Begin typing your search above and press return to search.

హైకోర్టును ఆశ్రయించిన అజయ్ కల్లం... తెరపైకి పాతచర్చ!

అవును... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

By:  Tupaki Desk   |   29 July 2023 7:26 AM GMT
హైకోర్టును ఆశ్రయించిన అజయ్  కల్లం... తెరపైకి పాతచర్చ!
X

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఎన్నో రకాల ట్విస్ట్ లు నెలకొంటున్న సంగతి తెలిసిందే. చార్జిషీట్ ల దగ్గర నుంచి అరెస్టులు, ఈ మధ్యలో ఒక వర్గం మీడియా అత్యుత్సాహం వెరసి... ఇప్పటికే వివేకా హత్యకేసు వ్యవహారం కిచిడీ అయిపోయిందనే కామెంట్లు వినిపిస్తోన్నాయి. ఈ సమయంలో అజయ్ కల్లం రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

అవును... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి రిట్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తాను ఇచ్చిన స్టేట్‌ మెంట్‌ కు సీబీఐ సమర్పించిన వాంగ్మూలం భిన్నంగా ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా... 2023 ఏప్రిల్ 9న సీబీఐ తన స్టేట్ మెంట్ రికార్డు చేసిందని చెప్పిన అజయ్ కల్లాం... తాను చెప్పింది ఒక్కటైతే.. సీబీఐ దాన్ని మార్చి చార్జ్‌ షీట్‌ లో మరో విధంగా పేర్కొందని ఆయన పిటిషన్‌ లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో వివక్ష, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని ఈ సందర్భంగా అజయ్ కల్లాం కోరారు.

ఈ సందర్భంగా పూర్తి వివరాలు వెళ్లడించిన అజయ్ కల్లం.. మార్చి 15, 2019న వైఎస్ జగన్‌ నివాసంలో సుమారు ఉదయం 5 గంటల సమయంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైందన్నారు. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్‌ వచ్చి డోరు కొట్టారని.. ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌ గారికి ఏదో విషయం చెప్పారని అన్నారు.

వెంటనే జగన్‌ షాక్‌ కు గురైనట్టుగా ఒక్కసారిగా లేచి... చిన్నాన్న చనిపోయారని చెప్పారని అజయ్ కల్లం స్పష్టం చేశారు! సరిగ్గా ఇదే విషయాన్ని తాను సీబీఐకి చెప్పానని... ఇంతకుమించి తానేమీ సీబీఐకి చెప్పలేదని అన్నారు.. తాను స్టేట్‌ మెంట్లో ఇదే చెప్పానని.. కాని సీబీఐ మాత్రం ఛార్జిషీటులో వీటిని మార్చివేసిందని కల్లం ఆరోపించారు.

ఈ సందర్భంగా తాను చెప్పిన విషయాలు మార్చివేసిందని, చెప్పని విషయాలు పొందుపరిచిందని చెప్పిన కల్లం... జగన్‌ సతీమణి ప్రస్తావన కాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదని.. తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్‌ మెంట్‌ లో అబద్ధాలే ఉన్నాయని అన్నారు.

ఈ వ్యవహారం అంతా గమనిస్తుంటే... దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి ఇందులో కనిపిస్తుందని, కొంతమంది వ్యక్తులను కావాలని ఈ కేసులో ఇరికించే ప్రయత్నాల్లో భాగంగానే సీబీఐ ఇలా చేస్తోన్నట్లు కనిపిస్తోందని అన్నారు. కాబట్టి... తన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్‌ మెంట్‌ గా పేర్కొన్న అంశాలను కొట్టిపారేయాలని హైకోర్టుకు కల్లం విన్నవించారు.

దీంతో మరోసారి వివేకా హత్యకేసులో సీబీఐ వ్యవహారం చర్చనీయాంశం అయ్యిందని అంటున్నారు పరిశీలకులు.