Begin typing your search above and press return to search.

ఏఐ టెక్నాలజీ.. ఇలా అయితే ఏది నిజమే తెలుసుకోవడం కష్టం!

వీటిపై ప్రస్తుతానికి ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో అడ్డూ అదుపు లేకుండా ఇవి చెలరేగుతున్నాయి.

By:  Tupaki Desk   |   24 Aug 2023 11:30 PM GMT
ఏఐ టెక్నాలజీ.. ఇలా అయితే ఏది నిజమే తెలుసుకోవడం కష్టం!
X

ఇప్పుడు ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ వంటివి ఏలుతున్నాయి. ముఖ్యంగా ఏఐ రాక కొన్ని లక్షల ఉద్యోగాలకు ఎసరు పెడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఏఐ టెక్నాలజీతో కంపెనీలు చాలా వరకు మానవ వనరులను తగ్గించుకుంటాయని నివేదికలు చెబుతున్నాయి. కంపెనీలు ఏఐపైన ఆధారపడటం వల్ల కొన్ని లక్షల మంది ఉద్యోగులు పోగొట్టుకుంటారని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేశాయి.

ఏఐతో లాభాల సంగతేమో కానీ నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీడియా రంగంలో ఏఐని చెడుగా ఉపయోగించుకుని తప్పుడు వార్తలను, వీడియోలను ప్రచారంలో పెట్టే వీలుందని అంటున్నారు. దీంతో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి తలెత్తుతుందని చెబుతున్నారు. ఫొటోలు, వీడియోలను ఏఐ టెక్నాలజీతో రూపొందించి అవాస్తవాలను వార్తల రూపంలో కేటుగాళ్లు వినియోగించే ప్రమాదముందని అంటున్నారు.

సైబర్‌ నేరగాళ్లు సాక్షాత్తూ ఏఐ టెక్నాలజీతో మనల్ని పోలినట్టే లైవ్‌ వీడియోలు చేసే ప్రమాదముంది. అంతేకాకుండా మన పరిచయస్తులు, మన కుటుంబ సభ్యులు, బంధువులతో లైవ్‌ వీడియోలో మాట్లాడి నగదు తమ ఖాతాల్లో వేయించుకుంటున్న మోసాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.

ఈ నేపథ్యంలో ఏది ఏఐ టెక్నాలజీతో జరిగే మోసమో, కాదో తెలుసుకోవాలి. జరిగే వార్తలకు సంబంధించిన సమాచారం, డేటా, నివేదికలు పూర్తిగా నిజమైనవి కానివి ప్రజల ముందుకు వస్తున్నాయి. అందుకని, మూలాధారాలు లేకుండా వచ్చిన సమాచారం అవాస్తవం అని తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే అసత్యాలు, అవాస్తవాలు సోషల్‌ మీడియలో కొకొల్లుగా షేర్‌ అవుతున్నాయి. వీటిపై ప్రస్తుతానికి ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో అడ్డూ అదుపు లేకుండా ఇవి చెలరేగుతున్నాయి.

తమకు తెలిసిన విషయాన్ని మిగతా వారికి తెలియజేయాలనే తొందరలో వ్యక్తులు నిజానిజాలు తెలుసుకోవడం లేదు. తాము చూసిన వార్త, సమాచారాన్ని వెంటనే తమకు తెలిసినవారికి షేర్‌ చేస్తున్నారు. దీంతో తప్పుడు సమాచారం భారీ ఎత్తున ప్రజలకు చేరిపోతోంది. దీంతో జరగాల్సిన అనర్థాలు జరిగిపోతున్నాయి. అవి ఒక్కోసారి షేర్‌ చేసినవారిపై పోలీసు కేసులకు దారితీస్తున్నాయి.

వార్తలను ఇలా చెక్‌ చేసుకోండి..

– తప్పుడు వార్తలు... ముఖ్యాంశాలు, విజువల్స్, క్యాప్షన్‌లు కంటెంట్‌కు సరిపోని విధంగా ఉంటాయి. మోసగించడానికి ఫొటోలు, కంటెంట్‌ ను కూడా తారుమారు చేస్తుంటారు.

– సంబంధిత వీడియో మూలం ఎక్కడ ఉందో చూసుకోవాలి. అది నిజమో, కాదో మిగతా మాధ్యమాల ద్వారా తనిఖీ చేసుకోవాలి.

– ఆ వీడియోలో కులమతాలను, వర్గాలను, జెండర్‌ ను కించపరిచేలా ఏమైనా ఉన్నాయేమో చెక్‌ చేసుకోవాలి.

– ఇప్పుడు విస్తృత మోసాలకు దారితీస్తున్న డీప్‌ ఫేక్స్‌ వంటి వాటిని గుర్తించడానికి 'డీప్‌ ఫేక్‌ డిటెక్షన్‌ మోడల్‌' వంటి స్పెషల్‌ సాఫ్ట్‌వేర్‌ అందుబాటులో ఉంది. దాన్ని వినియోగించుకోవాలి.

– వీడియోలోని సంఘటనలు నిజమేనా? నమ్మదగేలా ఉన్నాయా? లేక ఏమైనా అతుకుల బొంతా అనేది ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి. ఆ వీడియోను ఏ సందర్భంలో తీశారో జాగ్రత్తగా గమనించాలి.

– లైవ్‌ వీడియోలో మాట్లాడుతున్నప్పుడు ముఖాన్ని ఎడమ లేదా కుడికి కదిలించమని సదరు వ్యక్తిని ఉద్దేశించి అడగాలి.

– వీడియోలో వ్యక్తి కనురెప్పలు ఆర్పుతున్నారో లేదో పరిశీలించాలి.

గూగుల్‌ రివర్స్‌ ఇమేజ్‌ చెక్‌ చేయాలి. లేదా ఫొటో వెరిఫికేషన్‌ కోసం www.tineye.comని ఉపయోగించాలి.

ఫొటో లేదా వీడియో https://www.invid-project.eu/tools-and-services/invid-verification-plugin/ కోసం ఇన్‌విడ్‌ టూల్‌కిట్‌ ఎక్స్‌టెన్షన్‌ని ఇన్‌స్టాల్‌ చేయాలి.

ఫార్వర్డ్‌ చేసే ముందు www.factly.in ని వాస్తవాన్ని చెక్‌ చేయాలి.