Begin typing your search above and press return to search.

అక్కడ నుంచి ఐశ్వర్య పోటీ!

ఈ నేపథ్యంలో ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కందుకూరు నెల్లూరు జిల్లాలో చేరింది.

By:  Tupaki Desk   |   9 Feb 2024 3:30 PM GMT
అక్కడ నుంచి ఐశ్వర్య పోటీ!
X

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి.. కందుకూరు. ఇటు ప్రకాశం జిల్లాకు, అటు నెల్లూరు జిల్లాకు సరిహద్దుల్లో కందుకూరు ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా కందుకూరు నెల్లూరు జిల్లాలో చేరింది.

కాగా ఈసారి కందుకూరు నుంచి వైసీపీ తరఫున ఆదిశంకర ఇంజనీరింగ్‌ కాలేజీ అధిపతి డాక్టర్‌ వి.పెంచలయ్య కుమార్తె ఐశ్వర్య పోటీ చేస్తారని చెబుతున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో ఆదిశంకర కాలేజీ ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో కందుకూరుకు చెందిన డా.వి.పెంచలయ్య వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో డా.పెంచలయ్యకు సీఎం జగన్‌ స్వయంగా పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు.

సీఎం జగన్‌ ను కలిసిన వారిలో డా.పెంచలయ్యతో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు వి.అరవింద, డాక్టర్‌ వి.ఐశ్వర్య కూడా ఉన్నారు. వీరితోపాటు ప్రస్తుత కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి ఉన్నారు.

కాగా మానుగుంట మహీధర్‌ రెడ్డి తొలిసారి 1989లో కందుకూరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి 1500 స్వల్ప ఓట్ల తేడాలో ఓటమి పాలయ్యారు.

తిరిగి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా మహీధర్‌ రెడ్డి విజయం సాధించారు. అంతేకాకుండా కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మున్సిపల్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో మహీధర్‌ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

కాగా గతంలో మూడుసార్లు మహీధర్‌ రెడ్డి తండ్రి ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్యేగా కందుకూరు నుంచి గెలుపొందారు. అలాగే మహీధర్‌ రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొత్తం మీద తండ్రీకుమారుడు ఏడుసార్లు కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు.

వచ్చే ఎన్నికల్లో మానుగుంట మహీధర్‌ రెడ్డికి సీటు నిరాకరించారని వార్తలు వస్తున్నాయి. వివాదరహితుడిగా, సౌమ్యుడిగా మానుగుంటకు మంచి పేరుంది. అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంలో దూకుడుగా ఉండటం లేదని వైసీపీ అధిష్టానం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే తనకు టికెట్‌ ఇచ్చినా, ఇవ్వకపోయినా బూతులు తిట్టే రాజకీయాలు తాను చేయబోనని మహీధర్‌ రెడ్డి తెలిపారని ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్‌.. మానుగుంట మహీధర్‌ రెడ్డికి సీటు నిరాకరించారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన నారా లోకేశ్‌ ను కలిశారని టాక్‌ నడిచింది. అయితే అనూహ్యంగా ఆదిశంకర ఇంజనీరింగ్‌ కాలేజీ అధినేత పెంచలయ్య, ఆయన కుమార్తెలతో కలిసి సీఎం జగన్‌ ను మహీధర్‌ రెడ్డి కలిశారు.

ప్రస్తుతం మానుగుంట మహీధర్‌ రెడ్డి పోటీ చేసే పరిస్థితిలో లేరని అంటున్నారు. ఈ నేపథ్యంలో పెంచలయ్య కుమార్తె ఐశ్వర్య కందుకూరు నుంచి పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది. ఐశ్వర్య బీసీ సామాజికవర్గానికి చెందినవారు.