Begin typing your search above and press return to search.

హనీమూన్ మర్దర్ కేసును మించేలా తెలుగు స్టేట్స్ క్రైం స్టోరీ!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ తరహాలో తెలుగు రాష్ట్రాల్లో ఓ క్రైం స్టోరీ వెలుగుచూసింది. తెలంగాణకు చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న ఏపీ యువతి నెలరోజుల్లోనే అతడిని మట్టుబెట్టింది.

By:  Tupaki Desk   |   23 Jun 2025 12:00 PM IST
హనీమూన్ మర్దర్ కేసును మించేలా తెలుగు స్టేట్స్ క్రైం స్టోరీ!
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ తరహాలో తెలుగు రాష్ట్రాల్లో ఓ క్రైం స్టోరీ వెలుగుచూసింది. తెలంగాణకు చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న ఏపీ యువతి నెలరోజుల్లోనే అతడిని మట్టుబెట్టింది. ఈ ఘోరానికి నిందితురాలి తల్లి కూడా సహకరించిందని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో సుమారు పది మంది పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మధ్యప్రదేశ్ కు చెందిన రాజా రఘువంశీని పెళ్లి అయిన 11 రోజులకు హనీమూనుకి తీసుకువెళ్లిన భార్య మేఘాలయాలో హతమార్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ కేసు తరహాలోనే తెలంగాణలోని గద్వాలలో నవ వరుడి హత్య కేసు వెలుగు చూసింది. పెళ్లి అయిన 30 రోజులుకే నవ వరుడు విగత జీవిగా మారడం, అంతకుముందు చోటుచేసుకున్న పరిణామాలతో హతుడి భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు అసలు విషయాన్ని నిగ్గుతేల్చారు.

‘నువ్వు అంటే ఇష్టమని పెళ్లాడిన యువతే భర్తను హతమార్చడం’ కలకలం సృష్టిస్తోంది. ఈ హత్యకు వివాహేతర సంబంధం కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. హతుడి భార్యకు ఓ బ్యాంకు ఉద్యోగితో ఉన్న అనుబంధమే ఈ హత్యకు పురిగొల్పినట్లు భావిస్తున్నారు. గద్వాలకు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. అతడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని పాణ్యం సమీపంలో తేజేశ్వర్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు హతుడి భార్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, హత్య ఉదంతం వెలుగుచూసిందని చెబుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గద్వాలకు చెందిన తేజేశ్వర్ కు కర్నూలుకు చెందిన ఐశ్యర్యతో వివాహం నిశ్చయమైంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం వీరికి ఫిబ్రవరి 13న వివాహం జరగాల్సివుంది. అయితే పెళ్లికి ఐదు రోజుల ముందు ఐశ్యర్య ఇంటి నుంచి పరారైంది. తేజేశ్వర్ తో వివాహం ఐశ్యర్వకు ఇష్టం లేదని ఆ కారణంగానే ఇంటి నుంచి వెళ్లిపోయిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే పరారైన మూడు రోజుల తర్వాత తిరిగొచ్చిన ఐశ్యర్య కాబోయే భర్త తేజేశ్వర్ తో ఫోన్లో మాట్లాడి తాను ఇంటి నుంచి వెళ్లిపోడానికి ఆర్థిక సమస్యలే కారణమని చెప్పింది. కట్నం ఇచ్చేందుకు తల్లిపడుతున్న ఇబ్బందుల వల్లే స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిపింది. దీంతో తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను మే 18న వివాహం చేసుకున్నాడు తేజేశ్వర్.

అయితే పెళ్లి అయిన రెండు రోజుల నుంచి ఆమె ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుండటంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు మొదలైనట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 17న తేజేశ్వర్ కనిపించకుండా పోయాడు. ఆదివారం ఉదయం పాణ్యం సమీపంలో ఆయన మృతదేహం లభించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగగా, సంచలన విషయాలు వెలుగుచూశాయి. హతుడు తల్లిదండ్రులు అనుమానం మేరకు ఐశ్వర్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, హత్య ఉదంతం వెలుగుచూసింది.

నిందితురాలు ఐశ్యర్య పథకం ప్రకారం తేజేశ్వర్ ను హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం ఓ బ్యాంకు ఉద్యోగి సహకారంతో సుపారీ గ్యాంగ్ ను రంగంలోకి దింపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని అంటున్నారు. కర్నూలులోని ఓ బ్యాంకు ఉద్యోగితో నిందితురాలు ఐశ్వర్యకు వివాహేతర సంబంధం ఉందని పోలీసుల విచారణలో తేలిందని చెబుతున్నారు. ఐశ్వర్య తల్లి సదరు బ్యాంకులో స్వీపర్ గా పనిచేస్తుందని, ముందుగా ఐశ్వర్య తల్లితో సంబంధం పెట్టుకున్న బ్యాంకు ఉద్యోగి ఆ తర్వాత నిందితురాలితోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు చెబుతున్నారు.

ఐశ్వర్యకు వివాహం అయిన తర్వాత తమ సంబంధం కొనసాగేందుకు తేజేశ్వర్ అడ్డువస్తున్నాడని, అతడిని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. పథకం ప్రకారం తేజేశ్వర్ ను హతమార్చాలనే ఉద్దేశంతో సుపారీ గ్యాంగును రంగంలోకి దింపారని చెబుతున్నారు. ఈ సుపారీ గ్యాంగ్ కు బ్యాంకు ఉద్యోగి డ్రైవర్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం పది ఎకరాల స్థలం కొనుగోలు చేశామని, ఆ భూమిని సర్వే చేయాలని సుపారీ గ్యాంగు సభ్యులు తేజేశ్వర్ ను సంప్రదించారు. కారులో పాణ్యం తీసుకువెళుతూ మార్గ మధ్యలో కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఐశ్యర్య కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యపోయే నిజాలు తెలుసుకున్నారని అంటున్నారు. వివాహం అయిన ఈ నెల రోజుల్లో ఐశ్యర్య ఫోన్ నుంచి తేజేశ్వర్ కు 150 కాల్స్ ఉండగా, బ్యాంకు ఉద్యోగి ఫోన్ కు 2000 వేల కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. దీంతో బ్యాంకు ఉద్యోగి పాత్రపై పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్య వెలుగుచూసిన వెంటనే బ్యాంకు ఉద్యోగి పరార్ అయినట్లు చెబుతున్నారు. ప్రధాన నిందితురాలు ఐశ్యర్య, ఆమె తల్లి సుజాతను అదుపులోకి తీసుకున్నారు.