Begin typing your search above and press return to search.

కొత్త టెన్షన్!... నోయిడా రూల్ అమరావతి విమానాశ్రయానికి అప్లై అయితే..?

సాధారణంగా... ఎక్కడైనా ‘విమానాశ్రయ నిర్మాణం’ అనే ప్రకటన వెలువడితే.. వెంటనే అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అయిపోతుందని అంటారు

By:  Tupaki Desk   |   13 July 2025 5:00 PM IST
కొత్త టెన్షన్!... నోయిడా రూల్ అమరావతి విమానాశ్రయానికి అప్లై అయితే..?
X

సాధారణంగా... ఎక్కడైనా ‘విమానాశ్రయ నిర్మాణం’ అనే ప్రకటన వెలువడితే.. వెంటనే అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ స్టార్ట్ అయిపోతుందని అంటారు. రియల్ ఎస్టేట్ సంస్థల ప్రకటనలు కూడా... విమానాశ్రయానికి అత్యంత సమీపంలో.. ఎయిర్ పోర్ట్ కు కేవలం 2 కి.మీ. దూరంలో అద్భుతమైన అపార్ట్మెంట్స్ అని ప్రకటనలు కనిపిస్తుంటాయి. అయితే ఇకపై అలాంటివి కనిపించే అవకాశం లేదనే చర్చ తెరపైకి వచ్చింది. మరి.. అమరావతి విమానాశ్రయం పరిస్థితి ఏమిటి?

అవును... నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం భవిష్యత్తు కార్యకలాపాలను సురక్షితంగా ఉంచడానికని... ప్రతిష్టాత్మక విమానాశ్రయం చుట్టూ 10 కిలోమీటర్ల జోన్‌ లో అన్ని కొత్త నిర్మాణాలను స్థానిక అధికారులు తాజాగా నిలిపివేశారు. విమానాలు, విమానాశ్రయ కార్యకలాపాలకు ప్రమాదాలు కలగకుండా.. నియంత్రణ లేని భవనాలను నిరోధించడానికి అధికారులు చేసే కృషిలో భాగంగా ఈ నిర్ణయాత్మక చర్య అని చెబుతున్నారు.

విమానాశ్రయం సమీపంలో అనుమతి లేని, వేగవంతమైన భవనాల గురించి పెరుగుతున్న ఆందోళనలే దీనికి కారణం అని అంటున్నారు. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్ లిమిటెడ్ (ఎన్ఐఏఎల్), గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా పరిపాలన అధికారులు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. విమానాశ్రయం చుట్టూ ఉన్న ఆకాశం వచ్చే, వెళ్లే అన్ని విమానాలకు స్పష్టంగా, సురక్షితంగా ఉండేలా చూడటం తమ లక్ష్యం అని అంటున్నారు.

ఇటీవల జరిగిన విమానాశ్రయ పర్యావరణ నిర్వహణ కమిటీ (ఏఈఎంసీ) సమావేశంలో.. నియంత్రణ లేని అభివృద్ధి వల్ల కలిగే అనేక ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయని అంటున్నారు. ఈ సమయంలో విమానాశ్రయానికి 10 కి.మీ. చుట్టుపక్కల నిర్మాణాలు ఉండకుండా చూడటంతో పాటు విమానాశ్రయం సమీపంలో లేజర్, డ్రోన్ల వాడకం వంటి కార్యకలాపాలపై గట్టి నియంత్రణ ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే.. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భోగాపురం, రాబోయే అమరావతి విమానాశ్రయాల వద్ద పరిస్థితి ఏమిటి? నొయిడా విమాశ్రయం విషయంలో తీసుకున్న ఈ 10 కి.మీ నిబంధనను అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు వర్తింపజేస్తే.. భోగాపురం, అమరావతి చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్ల పరిస్థితి ఏమిటి? ఈ విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారబోతున్నాయని అంటున్నారు!

ఈ లెక్కన చూసుకుంటే శంషాబాద్ విమానాశ్రయం, ముంబై, చెన్నై, బెంగళూరు మొదలైన నగరాల్లోని ఇతర విమానాశ్రయాల చుట్టూ ఇప్పటికే ఉన్న అనేక నివాస, వాణిజ్య భవనాల పరిస్థితి ఏమిటనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. అయితే.. ఇప్పటికే పనిచేస్తున్న విమానాశ్రయాలకు ఈ రూల్ వర్తించదని అంటున్నారని తెలుస్తోంది. కాకపోతే కొత్తగా నిర్మించబోయే, నిర్మాణంలో ఉన్న అన్ని విమానాశ్రయాలకు ఈ 10 కి.మీ నిర్మాణ నిషేధం అమలు చేయబడే అవకాశం ఉందని అంటున్నారు!