Begin typing your search above and press return to search.

విమానాలు ఫుల్.. కరోనా తర్వాత తొలి రికార్డు ఇదే

ఇలాంటి వేళ.. ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పాలి. అగ్రరాజ్యంతో పాటు సంపన్న దేశాల్ని వణికిస్తున్న మాంద్యం మరకలు మన దేశాన్ని అంతలా అంటుకోలేదనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   27 Nov 2023 3:51 AM GMT
విమానాలు ఫుల్.. కరోనా తర్వాత తొలి రికార్డు ఇదే
X

ఆధునిక ప్రపంచంలో లెక్కలు ఏవైనా సరే.. కరోనాకు ముందు కరోనాకు తర్వాత అన్న పరిస్థితి. కరోనాకు ముందు వరకు ప్రపంచంలోని పలు దేశాల గమనం వేగంగా సాగుతున్న వేళ.. సడన్ బ్రేక్ వేసేసింది మహమ్మారి. దాదాపు నాలుగేళ్లు అవుతున్నా.. ఇప్పటికి కరోనా ఛాయలు పలు దేశాల్ని ఇబ్బందికి గురి చేస్తూనే ఉన్నాయి. కరోనా ఆ తర్వాత మాంద్యం పరిస్థితులు.. అందుకు తోడుగా ఉక్రెయిన్ మీద రష్యా.. సిరియా మీద ఇజ్రాయెల్ తరచూ ఏదో ఒక పరిణామం చోటు చేసుకోవటంతో.. ఎప్పుడేం జరుగుతుందోనన్న అనిశ్చితి నెలకొంది.

ఇలాంటి వేళ.. ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పాలి. అగ్రరాజ్యంతో పాటు సంపన్న దేశాల్ని వణికిస్తున్న మాంద్యం మరకలు మన దేశాన్ని అంతలా అంటుకోలేదనే చెప్పాలి. అంతేకాదు.. ఇటీవల కాలంలో మన దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. కరోనా తర్వాత ఆర్థిక రంగం రికవరీ జోరుగా ఉందని చెప్పాలి. తాజాగా దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ సైతం సరికొత్త గరిష్ఠాలకు చేరుకోవటం గమనార్హం.

నవంబరులో వరుస పెట్టి రికార్డు స్థాయిలో ప్రయాణికులు విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఈ నెల 18న 4, 56,748 మంది ప్రయాణిస్తే.. 19న 4,56,910మంది ప్రయాణించారు. ఇక.. 20న అంతకుమించి అన్నట్లుగా 4,59,526 మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారు. ఈ రికార్డును నవంబరు 23న అధిగమించి ఒక్క రోజులోనే 4,63,417 మంది ప్రయాణించినట్లుగా విమానయాన శాఖ తెలిపింది.

చాలా దేశాలతో పోలిస్తే కరోనా తర్వాత దేశీయ విమానయాన రంగం పుంజుకున్నా.. భారీగా మార్పులైతే చోటు చేసుకున్నది లేదు. కానీ.. తాజా పరిణామాల్ని చూసినప్పుడు మాత్రం సరికొత్త గరిష్ఠాలు నమోదవుతున్నట్లుగా చెప్పాలి. నవంబరు 23 ఒక్కరోజున 5998విమాన సర్వీసులకు 4,63,417 మంది ప్రయాణికులు ప్రయాణించటం ఒక కొత్త రికార్డుగా చెబుతున్నారు. కొవిడ్ తర్వాత ఇదే అత్యధిక ప్రయాణికుల సంఖ్యగా చెబుతున్నారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలు కూడా పుంజుకున్నాయి. ఈ నెల 24 ఒక్క రోజున 1.06 లక్షలమంది ప్రయాణాలు చేశారు.