Begin typing your search above and press return to search.

విమానంలో ఉన్నప్పుడు పిడుగు పడితే జరిగే పరిణామాలు ఇవే..!

విమాన ప్రమాదాల గురించి ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. రోడ్డుపై ప్రమాదాలు జరిగితే నిర్ధిష్ట ప్రదేశం గురించి తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   19 Sept 2025 5:00 PM IST
విమానంలో ఉన్నప్పుడు పిడుగు పడితే జరిగే పరిణామాలు ఇవే..!
X

విమాన ప్రమాదాల గురించి ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. రోడ్డుపై ప్రమాదాలు జరిగితే నిర్ధిష్ట ప్రదేశం గురించి తెలుస్తుంది. కానీ గాలిలో ప్రమాదం జరిగితే.. రోడ్డుపై అయితే అక్కడికి సహాయం అందించేందుకు ఏమేమి అవసరం అవుతాయో తెలుస్తుంది. కానీ గాలిలో కాదు. కాబట్టి విమానాలకు ప్రమాదాలు జరిగితే దాదాపు ఎక్కువ శాతం ప్రాణనష్టం జరుగుతుంది. ఇక గాలిలో ఉండగా.. అంటే ఆకాశంలో విమానంపై పిగుడుపడితే ఏమవుతుందన్న ఆలోచన చాలా మందికి వస్తుంది. శాస్త్రవేత్తలకు కూడా వస్తుంది.

ఆందోళన సహజమే..

విమానంలో ప్రయాణిస్తుండగా బయట వర్షం కురుస్తూ, మెరుపులు పిడుగులు పడుతుంటే ప్రయాణికుల్లో కలిగే ఆందోళన సహజమే. కిటికీ గాజు బయట మెరుస్తున్న కాంతి, చెవులు చెదిరే శబ్దం చూసి చాలా మంది గుండెల్లో దడ పుడుతుంది. ‘ఇప్పుడు విమానంపై పిడుగు పడితే ఏమవుతుందో?’ అన్న భయం చాలా మందికి కలుగుతుంది. కానీ వాస్తవం ఏంటంటే, ఆధునిక విమానాల రూపకల్పన, నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఈ పిడుగులు విమాన ప్రయాణానికి ఎలాంటి ముప్పు తలపెట్టలేవు.

తట్టుకునేలా రూపొందించిన ఇంజినీర్లు..

విమాన తయారీలో ఇంజినీర్లు ఈ సమస్యను చాలా కాలం క్రితమే పరిష్కరించారు. విమానం నిర్మాణం మొత్తం అల్యూమినియం వంటి విద్యుత్‌ వాహక లోహాలతో రూపొందించబడి ఉంటుంది. ఇవి పిడుగు పడినప్పుడు విద్యుత్‌ శక్తిని లోపలికి పంపించకుండా పై భాగం నుంచే గాలిలోకి పంపిస్తాయి. అంటే ఒక వైపు నుంచి పిడుగు పడితే అది మరో వైపునకు వెళ్తుందన్నమాట. ఈ నేపథ్యంలో లోపల కూర్చున్న వారికి ఎటువంటి హానీ జరగదు. దీన్ని ‘ఫరడే కేజ్’ (Faraday Cage) సూత్రం అంటారు. ఇది సాధారణంగా మన ఇళ్లల్లోని ఉపయోగించే సాంకేతికతే. ఉదాహరణకు, కారులో కూర్చున్న మనిషికి పిడుగు పడినా ప్రమాదం జరగదు.. ఎందుకంటే కారు తయారు చేసిన మెటల్ పిడుగు శక్తిని లోపలికి అనుమతించదు. విమానాలు కూడా ఇలానే ఉంటాయి.

విహంగ చరిత్రలో చాలాసార్లు పిడుగులు పడ్డాయి..

విమానయాన చరిత్రలో వందల, వేల సార్లు విమానాలపై పిడుగులు పడ్డాయి. గణాంకాల ప్రకారం ప్రతి విమానం ఏడాదికి ఒకసారి పిడుగుపాటుకు గురవుతుందట. అయినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రికార్డులు చెబుతున్నాయి. పిడుగు వల్ల విమానం ఇంజిన్‌, రెడార్‌ లేదా నావిగేషన్‌ పరికరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఎందుకంటే ఈ భాగాలను ప్రత్యేక భద్రతతో తయారు చేస్తారు. అందువల్ల ప్రయాణికులు, సిబ్బంది ముప్పు ఉండదు.

అవగాహన లేమితో భయం..

అవగాహన లేని వారే ఎక్కువగా భయపడతారు. పిడుగు పడగానే విమానం కూలిపోతుందన్న అపోహ సాధారణ ప్రజల్లో ఉంది. శాస్త్రం చెబుతున్న నిజం వేరే. మనం శాస్త్రాన్ని అర్థం చేసుకున్నప్పుడు భయం పోతుంది. నేటి రోజుల్లో విమానయాన రంగంలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు కఠినంగా ఉంటాయి. చిన్న లోపం కూడా చోటు చేసుకునే అవకాశం ఉండదు. ప్రతి విమానం నిరంతరం పరీక్షలను ఎదుర్కొంటూ, అత్యవసర పరిస్థితులను సైతం ఎదుర్కొనే శిక్షణ పొందిన సిబ్బందితో నడుస్తుంది.

లైట్ ను ఎంజాయ్ చేయండి..

మనం ఒక విషయం గురించి తెలుసుకోవాలి. సహజ ఘటనలు మనిషిని భయపెట్టవచ్చు కానీ శాస్త్రం వాటిని నియంత్రించే శక్తిని కలిగిస్తుంది. పిడుగు అనేది సహజ ప్రక్రియ, దాన్ని పూర్తిగా ఆపలేము. కానీ దాని వల్ల సంభవించే ప్రభావాన్ని ఎదుర్కొనే సాంకేతిక కవచం తయారు చేయవచ్చు. ఇది విజ్ఞాన శక్తి ఇచ్చిన వరం. విమానంలో ప్రయాణస్తున్న సమయంలో పిడుగు పడితే ఏమీ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. బయట ఒక మెరుపు మెరిస్తే ఆ కాంతిని ఎంజాయ్ చేయాలే తప్ప భయపడాల్సిన అవసరం లేదు. మనం కూర్చున్న విమానం ఒక శక్తివంతమైన సాంకేతిక కవచం కింద ఉందని గుర్తుంచుకోవాలి.