విమాన ప్రమాదం దర్యాప్తు అధికారికి ఎక్స్ - కేటగిరీ భద్రత.. ఏం జరిగింది?
అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఒక్కసారిగా ప్రతిఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 Jun 2025 4:02 PM ISTఅహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఒక్కసారిగా ప్రతిఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 275 మంది మరణించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తు బృందానికి ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ నాయకత్వం వహిస్తున్నారు!
ఈ సమయలో ఏఏఐబీ డీజీ జీవీజీ యుగంధర్ విషయంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఆయనకు ఎక్స్-కేటగిరీ రక్షణ కల్పించడం ద్వారా భద్రతను పెంచింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో ఆయనకు ప్రమాదం పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అంచనాను అనుసరించి ఈ చర్య తీసుకున్నారు.
అవును... ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) డీజీ యుగంధర్ కు ఇక నుంచి 'ఎక్స్' కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ నిర్ణయం జూన్ 16 నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నాయి. ఈ నిర్ణయం ప్రకారం.. ఆయనకు సీఆర్పీఎఫ్ కమాండోలతో రక్షణ కల్పిస్తున్నారు.
జూన్ 12న సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోగా.. ఈ ఘటన జరిగిన ఆ మరుసటి రోజే (జూన్ 13న) ప్రమాదంపై దర్యాప్తునకు ఏఏఐబీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఏఏఐబీ డీజీ జీవీజీ యుగంధర్ నేతృత్వం వహిస్తున్నారు.
ఇక ఈ బృందంలో... ఏవియేషన్ మెడిసిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ప్రమాదానికి గురైన విమానం నుంచి సేకరించిన బ్లాక్ బాక్స్ లను ఏఏఐబీ ల్యాబ్ కు తరలించి.. అందులోని డేటాను విజయవంతంగా డౌన్ లోడ్ చేశారు. ప్రస్తుతం విశ్లేషణ జరుగుతోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కాగా... అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. సమీపంలోని మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ సముదాయాలపై కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని 241 మందితో పాటు బయట ఉన్నవారు 34 మంది మృతిచెందారు.
