Begin typing your search above and press return to search.

కూలిన ఎయిరిండియా విమానంపై 10 కీలక పాయింట్స్!

అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం 1:39 గంటల సమయంలో లండన్ బయలుదేరిన విమానం నెంబర్ ‘ఎయిర్ ఇండియా – 171’ కూలిపోయింది.

By:  Tupaki Desk   |   12 Jun 2025 3:44 PM IST
కూలిన ఎయిరిండియా విమానంపై 10 కీలక పాయింట్స్!
X

అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం 1:39 గంటల సమయంలో లండన్ బయలుదేరిన విమానం నెంబర్ ‘ఎయిర్ ఇండియా – 171’ కూలిపోయింది.

1. ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది క్యాబిన్ క్రూ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 గురు పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు ఉన్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది.

2. ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పందించింది. ఇందులో భాగంగా... విమానానికి సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ గా క్లైవ్ కుండర్ వ్యవహరించినట్లు పేర్కొంది. కెప్టెన్ సుమిత్ కు ఎల్.టీ.సీగా 8,200 గంటల అనుభవం ఉండాగా.. కోపైలెట్ కు 1,100 గంటల అనుభవం ఉన్నట్లు వెల్లడించింది.

3. ఈ క్రమంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ విమానం రన్ వే 23 నుంచి గాల్లోకి ఎగిరింది. కొద్ది సేపటికే ఆ విమానం నుంచి ఏటీసీకి ‘మేడేకాల్’ (ఎమర్జెన్సీ కాల్) వచ్చింది! ఆ తర్వాత కూలిపోయింది! ఆ సమయంలో విమానం 825 అడుగుల ఎత్తుల్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

4. 300 మంది వరకూ ప్రయాణించగలిగే ఈ విమానంలో.. సుదూర ప్రాంతం కావడంతో ఇంధనం కూడా భారీగా ఉందని అంటున్నారు. అందువల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని.. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు, పొగ కనిపించాయని చెబుతున్నారు.

5. ఈ ఘటనపై విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ ప్రమాదం గురించి తెలిసి తాను షాక్, తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. తాను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని వెల్లడించారు. ఈ సందర్భంగా అన్ని రకాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరారు.

6. ఈ సందర్భంగా ప్రమాదానికి జరిగిన దృశ్యాల్లో దట్టమైన బూడిద రంగు పొగ కరెంటు స్థంభాలంతకంటే ఎత్తుకు ఎగిసిపడుతున్నట్లు చూపిస్తున్నాయి. దీంతో.. ప్రమాద తీవ్రతపై ఆందోళనలు వెళ్లువెత్తుతున్నాయి! ఈ సమయంలో ప్రమాద స్థలానికి సుమారు రెండు డజన్లకు పైగా అంబులెన్సులు చేరుకున్నట్లు తెలుస్తోంది.

7. ఈ ప్రమాదంలో గాయపడిన అనేక మంది ప్రయాణికులను ఇప్పటికే సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనా స్థలంలో వైద్య, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

8. మరోవైపు అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా విమానాశ్రయానికి, చుట్టుపక్కల క్రాష్ జోన్ కు దారితీసే యాక్సెస్ మార్గాలను అధికారులు దిగ్బంధించారు. ఈ స్థలం చుట్టూ రద్దీని నిర్వహించడానికి ట్రాఫిక్ మళ్లిపులు ఏర్పాటు చేశారు!

9) ఈ విమానంలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన విమానం ఎక్కినట్లు నిర్ధరించే ప్యాసింజర్‌ జాబితాలో రూపానీ పేరు ఉందని తెలుస్తోంది. లండన్‌ లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్‌ రూపానీ ఈ విమానంలో ప్రయాణానికి బుక్‌ చేసుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.

10. ప్రయాణికులకు, ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి తాము 1800 5691 444 అనే ప్రత్యేక ప్రయాణీకుల హాట్‌ లైన్ నంబర్‌ ను ఏర్పాటు చేసామని ఎయిర్ ఇండియా ప్రకటించింది.