అంతర్జాతీయ సర్వీసుల విషయంలో ఎయిరిండియా కీలక నిర్ణయం!
ఈ తగ్గింపు కారణంగా ఎఫెక్ట్ అవుతున్న ప్రయాణికులకు ఎయిరిండియా క్షమాపణలు చెబుతోంది.
By: Tupaki Desk | 19 Jun 2025 10:38 AM ISTజూన్ 12 అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అనంతరం ఎయిరిండియా నిత్యం వార్తలో నిలుస్తోన్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా ఎయిరిండియా ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. వైడ్-బాడీ విమానాలపై అంతర్జాతీయ సేవలను 15% తగ్గించనుందది. ఈ మేరకు సౌరభ్ సిన్హా నివేదించారు.
అవును... ఎయిరిండియా వైడ్ బాడీ విమానాలపై అంతర్జాతీయ సేవలను 15% తగ్గించనుందని.. ఇది జూలై మధ్య కాలం వరకూ తక్షణమే అమలులోకి వస్తుందని సౌరభ్ సిన్హా నివేదించారు. వైడ్ బాడీ బోయింగ్ విమానాల్లో మరింతగా రక్షణ తనిఖీలు చేపట్టనున్నామని.. అదనపు జాగ్రత్తల కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిరిండియా తెలిపింది.
ఈ తగ్గింపు కారణంగా ఎఫెక్ట్ అవుతున్న ప్రయాణికులకు ఎయిరిండియా క్షమాపణలు చెబుతోంది. ఈ సందర్భంగా.. ప్రయాణికులు ఎలాంటి ఖర్చు లేకుండా వారి ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకునే లేదా డబ్బులు వాపస్ తీసుకునే అవకాశాన్ని కూడా అందిస్తున్నట్లు తెలిపింది. ఈ కొత్త షెడ్యూల్ జూన్ 20 - 2025 నుంచి అమల్లోకి రానుందని వివరించింది!
ప్రధానంగా కార్యాచరణ స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి, ప్రయాణికులకు చివరి నిమిషంలో కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి ఇది జరుగుతుందని.. ప్రయాణికులు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, భారతదేశ మద్దతుతో తాము ఆ విషాద సంఘటన నుంచి మరింత బలంగా బయటపడతామని.. ప్రయాణికులకు తమ సేవల్లో విశ్వాసాన్ని తిరిగి స్థాపించగలమని పేర్కొంది.
కాగా... ఇటీవల ఎయిరిండియా బోయింగ్ 787-8/9 విమానాలలో మెరుగైన భద్రతా తనిఖీని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం 33 విమానాలలోనూ ఇప్పటికే 26 విమానాల తనిఖీలు పూర్తయ్యాయని ఎయిరిండియా తెలిపింది. మిగిలినవి త్వరలో పూర్తవుతాయని వెల్లడించింది.
