Begin typing your search above and press return to search.

ఎయిరిండియా విమానాన్ని వెనక్కి పంపిన అగ్నిపర్వతం.. ఏం జరిగింది?

కాగా... ఇండోనేషియాలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటైన తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌ లో ఉన్న మౌంట్ లెవోటోబి లకిలకి మంగళవారం సాయంత్రం బద్దలైంది.

By:  Tupaki Desk   |   18 Jun 2025 12:39 PM IST
ఎయిరిండియా విమానాన్ని  వెనక్కి పంపిన అగ్నిపర్వతం.. ఏం జరిగింది?
X

అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాద ఘటన అనంతరం ఆ సంస్థకు సంబంధించిన ఏ విషయం అయినా నెట్టింట హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అగ్నిపర్వతం బద్దలవ్వడంతో వెనక్కి మళ్లిన ఎయిరిండియా విమానం విషయం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఆ విమానం బుధవారం ఢిల్లీకి సురక్షితంగా చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అవును... తూర్పు ఇండోనేసియాలోని లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం బద్దలయ్యింది. సరిగ్గా ఆ అగ్నిపర్వతానికి సమీపంలో బాలికి వెళ్లే ఎయిరిండియా విమానం వెనక్కి మళ్లింది. అక్కడి నుంచి తిరుగుపయనమైన ఎయిరిండియా విమానం బుధవారం ఢిల్లీకి సురక్షితంగా చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

దీంతో భారత్‌ సహా సింగపూర్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో... అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని.. తూర్పు ఇండోనేషియాలోని నుసా టెంగారా ప్రావిన్స్‌ లోని ఎయిర్ పోర్ట్ ను మూసివేసినట్లు వెల్లడించారు.

కాగా... ఇండోనేషియాలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటైన తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌ లో ఉన్న మౌంట్ లెవోటోబి లకిలకి మంగళవారం సాయంత్రం బద్దలైంది. దీని ఫలితంగా భారీ బూడిద 32,800 (10,000 మీటర్లు) అడుగులు ఆకాశంలోకి ఎగిసిపడిందని వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.

ఇదే సమయంలో... సుమారు 150 కి.మీ దూరం నుండి బూడిద మేఘం కనిపించిందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే... బాలిలోని న్గురా రాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనేక విమానయాన సంస్థలు కార్యకలాపాలను నిలిపివేసాయి. ఎయిర్ న్యూజిలాండ్, వర్జిన్ ఆస్ట్రేలియా, సింగపూర్‌ కు చెందిన టైగర్ ఎయిర్ తో పాటు ఎయిరిండియా విమానాలను రద్దు చేశాయని లేదా దారి మళ్లించాయని తెలిపారు.