ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడే విమానంలో తేడా.. ప్రయాణికుడి షాకింగ్ ట్వీట్!
అవును... తాజాగా ప్రమాదానికి గురైన విమానం ముందుగా ఢిల్లీలో బయలుదేరి, అహ్మదాబద్ కు చేరుకుంది.
By: Tupaki Desk | 12 Jun 2025 10:46 PM ISTఅహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం.. గురువారం మధ్యాహ్నం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి.
మరోవైపు.. ఈ విమానం ఢిల్లీ నుంచి బయలుదేరి అహ్మదాబాద్ చేరుకునే సమయంలో పలు సాంకేతిక సమస్యలను కలిగి ఉందని, ఏదో తేడాగా ఉందంటూ ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ విమాన ప్రమాద దర్యాప్తులో అతడి ట్వీట్, అందులో పేర్కొన్న అంశాలు కీలక భూమికపోషించే అవకాశన్ని కొట్టిపారేయలేమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును... తాజాగా ప్రమాదానికి గురైన విమానం ముందుగా ఢిల్లీలో బయలుదేరి, అహ్మదాబద్ కు చేరుకుంది. అక్కడ నుంచి లండన్ కు బయలుదేరింది. అయితే.. ప్రమాదానికి సుమారు రెండు గంటల ముందు.. ఈ విమానంలో ఢిల్లీ నుంచి ప్రయాణించిన ఒక ప్రయాణికుడు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ విమానంలో అసాధారణ సంఘటనలు గమనించినట్లు అతడు ఎక్స్ లో తెలిపారు.
ఈ క్రమంలో విమానంలో పరిస్థితిని వీడియో తీసిన ఆకాష్ వాస్త అనే ప్రయాణికుడు.. ఏసీలు పనిచేయడం లేదని, పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి విమానాలను ఎయిరిండియా ఎందుకు నడుపుతుందని ప్రశ్నించారు! టచ్ స్క్రీన్ పని చేయడం లేదని, లైట్స్ ఆన్ అవ్వడం లేదని అన్నారు! మరిన్ని వివరాలకు తనను సంప్రదించాలని కోరారు!
కాగా... ప్రమాదానికి గురైన విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 గురు పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు ఉన్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. వారిలో గుజరాత్ మాజీ సీఎం కూడా ఉన్నారు.
ఈ క్రమంలో... దాదాపుగా విమానంలో ప్రయాణించిన వారంతా మృతి చెందారంటూ కథనాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. మరోపక్క 242 మందిలో ఒక వ్యక్తి మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అంటున్నారు! ఏది ఏమైనా దేశ చరిత్రలోని ఘోర విమాన ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందని మాత్రం చెప్పొచ్చు!
