Begin typing your search above and press return to search.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం... లేటెస్ట్ అప్ డేట్స్ ఇవే!

ఈ సందర్భంగా స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... ప్రమాద ఘటన గురించి తెలిసి తీవ్ర కలత చెందినట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   12 Jun 2025 6:38 PM IST
అహ్మదాబాద్  విమాన ప్రమాదం... లేటెస్ట్  అప్  డేట్స్  ఇవే!
X

అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఏఐ-171.. గురువారం మధ్యాహ్నం కూలిపోయింది. ఈ ప్రమాదానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనిపై ఎయిర్ ఇండియా ‘ఎక్స్’ వేదికగా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వెల్లడిస్తుంది. హాట్ లైన్ నెంబర్ ను ఏర్పాటుచేసింది.

విమానంలో ప్రయాణికులు:

ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉండగా... ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 గురు పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు ఉన్నట్లు ఎయిర్ ఇండియా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.

అతి తక్కువ ఎత్తులో ఉండగానే...!:

విమానం ప్రమాదానికి గురయ్యే ముందు 825 అడుగుల ఎత్తున ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు... ఫ్లైట్‌ రాడార్‌ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్స్‌ కోల్పోయింది. అనంతరం భారీ శబ్ధంతో కుప్పకూలిపోయింది. దీంతో.. సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.

ఏటీసీకి పైలెట్ నుంచి ‘మేడే కాల్’:

ఈ సందర్భంగా స్పందించిన పౌర విమానయానశాఖ వర్గాలు.. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు పైలట్ల నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి "మేడే కాల్" వచ్చినట్లు వెల్లడించాయి! అయితే.. తిరిగి పైలట్లను ఏటీసీ సంప్రదించేందుకు ప్రయత్నించగా.. స్పందన కరువైనట్లు పేర్కొన్నాయి.

విమానంలో 80 - 90 టన్నుల ఇందనం!:

ప్రమాద సమయంలో విమానంలో సుమారు 80 నుంచి 90 టన్నుల ఇందనం ఉందని తెలుస్తోంది. అందువల్లే... విమానం నేలను ఢీకొట్టినప్పుడు ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని అంటున్నారు. ఆ సమయంలో పైలెట్ కు విమానం నుంచి ఫ్యుయల్ డంప్ చేసే సమయం కూడా లేకుండా పోయిందని చెబుతున్నారు.

విమానయాన నిపుణుడి అభిప్రాయం!:

ఈ సందర్భంగా స్పందించిన విమానయాన నిపుణుడు సంజయ్ లాజర్... విమానం తక్కువ ఎత్తులో ఎగురుతూ పైకి ఎగరడంలో విఫలమైందని తెలిపారు. 825 అడుగుల చాలా తక్కువ ఎత్తులో ఉన్న విమానం లిఫ్ట్ సాధించడంలో ఘోరంగా వైఫల్యం చెందిదని అన్నారు!

ఐదుగురు మెడికల్ విద్యార్థులు మృతి!:

ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం జనావాసాల్లో పడింది. ఇందులో కొన్ని భాగాలు అక్కడే ఉన్న బీజీ మెడికల్ కాలేజ్ అండర్ గ్రాడ్యుయేట్ హాస్టల్ భవనాలపై పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మెడికల్ విద్యార్థులు మృతి చెందగా 15 నుంచి 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి!:

కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతిచెందారనే విషయం తెరపైకి వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ప్రయాణికుల జాబితాలో 12వ ప్రయాణికుడిగా విజయ్ రామ్నిక్ లాల్ రూపానీ ఉన్నారు. అతనిపై బిజినెస్ క్లాస్ కేటగిరి కింద టిక్కెట్ బుక్ చేయబడింది!

రామ్మోహన్ స్పాట్ రియాక్షన్:

ఘటనపై విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ ప్రమాదం గురించి తెలిసి తాను షాక్, తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. తాను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని వెల్లడించారు. ఈ సందర్భంగా అన్ని రకాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు!

ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి:

ఈ విమాన ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

రాష్ట్రపతి తీవ్ర కలత:

ఈ సందర్భంగా స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... ప్రమాద ఘటన గురించి తెలిసి తీవ్ర కలత చెందినట్లు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో దేశమంతా బాధిత కుటుంబాలకు తోడుగా ఉంటుందని అన్నారు.

ఎయిరిండియా రియాక్షన్:

విమాన ప్రమాదంలోని బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వీలుగా హాట్ లైన్ నెంబర్ 1800 4691 444ను ఎయిరిండియా ఏర్పాటు చేసింది.

ఇదే సమయంలో ఎయిరిండియా సంస్థ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో డీపీ మార్చింది. ఇందులో భాగంగా.. బాధితులకు సంతాపం తెలుపుతూ నలుపు రంగు డీపీ పెట్టింది.