Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో టెన్షన్ పెట్టిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్... ఏమైందంటే..!

మరో ఎయిరిండియా విమానం తాజాగా హైదరాబాద్ లో టెన్షన్ పెట్టిందంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు

By:  Tupaki Desk   |   19 July 2025 5:59 PM IST
హైదరాబాద్ లో టెన్షన్ పెట్టిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్... ఏమైందంటే..!
X

మరో ఎయిరిండియా విమానం తాజాగా హైదరాబాద్ లో టెన్షన్ పెట్టిందంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు పెడుతున్నారు. హైదరాబాద్ నుంచి థాయిలాండ్ కు బయలుదేరిన విమానం.. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన 16 నిమిషాలకే తిరిగి వచ్చేసింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును.. గత కొన్ని రోజులుగా పలు విమానయాన సంస్థల్లోని విమానాలు సాంకేతిక సమస్యలతో టెన్షన్ పెడుతోన్న సంగతి తెలిసిందే. గత వారం పదిరోజుల్లోనే వరుసగా పలు ఘటనలు తెరపైకి వచ్చాయి. దీంతో.. పలు విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం బయలుదేరిన కొన్ని నిమిషాలకే తిరిగి వచ్చేసింది.

వివరాళ్లోకి వెళ్తే... థాయిలాండ్‌ లోని ఫుకెట్‌ కు వెళ్లాల్సిన ఎయిరిండియా ఎక్స్‌ ప్రెస్ విమానం శనివారం ఉదయం టెకాఫ్ అయిన కొద్ది సేపటికే తిరిగి హైదరాబాద్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చేసింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం... బోయింగ్ 737 మాక్స్ 8 ద్వారా నిర్వహించబడుతున్న ఫ్లైట్ ఐఎక్స్ 110 ఉదయం 6:41 గంటలకు బయలుదేరింది.

ఈ విమానం ఉదయం 11:45 గంటలకు పుకెట్ లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే... 6:57 గంటలకే తిరిగి హైదరాబాద్ కు వచ్చేసింది. అంటే.. కేవలం 16 నిమిషాలు మాత్రమే ప్రయాణించిందన్నమాట. ఈ విషయంపై నిరాశ చెందిన ప్రయాణికులు.. విమానయాన సంస్థ నుండి సరైన సమాచారం లేకపోవడంతో విమానం లోపల వేచి ఉండాల్సి వచ్చిందని అంటున్నారు.

ఈ సందర్భంగా... "విమానం ఐఎక్స్110 హైదరాబాద్‌ నుంచి ఫుకెట్‌ కు వెళుతుండగా టేకాఫ్ తర్వాత తిరిగి వచ్చింది. ఇంకా ఎటువంటి సమాచారం లేదు. మేము విమానం లోపల వేచి ఉన్నాము. ఇది చాలా నిరాశ పరిచింది" అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎయిరిండియా ఎక్స్ ప్రెస్, డీజీసీఏ ను ట్యాగ్ చేశారు!

దీనిపై ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. ఈ సందర్భంగా జరిగిన అంతరాయానికి క్షమాపణలు చెబుతూ, సాంకేతిక లోపం వల్ల ఆలస్యం జరిగిందని స్పష్టం చేసింది. ఈ అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నట్లు చెబుతూ.. ప్రయాణికుల భద్రతకే తమ తొలి ప్రాధాన్యత అని వివరించింది.