మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాపై ఎయిరిండియా కీలక ప్రకటన!
అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమానం ఘోర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 274 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు
By: Tupaki Desk | 15 Jun 2025 11:40 AM ISTఅహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమానం ఘోర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 274 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో విమానంలో ఉన్న 242 మందిలో 241, బయట ఉన్న వారిలో 33 మంది ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై భారత్ తో పాటు ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్నవారే కాకుండా.. సమీపంలోని బీజీ వైద్య కళాశాల హాస్టల్ భవనంలో భోజనానికి కూర్చున్న వైద్య విద్యార్థులు మృతి చెందడం ఈ విషాదాన్ని రెట్టింపు చేసింది. అయితే... విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించగా.. ఒక వ్యక్తి 39 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ విశ్వాస్ కుమార్ రమేష్ మృత్యుంజయుడిగా నిలిచారు.
ప్రమాదంలో విమానంలో ఉన్న అందరూ చనిపోగా అతడు మాత్రం స్వల్ప గాయాలతోనే బయటపడటం విశేషం. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాను ఎలా బ్రతికి పయటపడ్డానో తనకు తెలియడం లేదని విశ్వాస్ అంటున్నారు. విమానం ముక్కలవ్వడంతో తన సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఎగిరి బయట పడిందని చెబుతున్నారు.
ప్రస్తుతం కుటుంబ సభ్యుల డీ.ఎన్.ఏ లతో పోల్చి మృతదేహాలను అప్పగించే పనిలో వైద్యులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఉన్నారు. ఇప్పటివరకూ తొమ్మిది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెబుతున్నారు. మరోవైపు.. విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికులకు టాటా సంస్థ రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించగా.. తాజాగా ఎయిరిండియా స్పందించింది.
అవును... విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున టాటా సంస్థ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై ఎయిరిండియా సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... టాటా సంస్థ ఇస్తున్న రూ.కోటితో పాటు మరో రూ.25 లక్షలు అందజేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
