Begin typing your search above and press return to search.

ఒక్కరోజుల్లో అన్ని ఎయిరిండియా విమానాలకు ఏమైంది?

మంగళవారం నాడు సాంకేతిక లోపాలు, విమానాలు అందుబాటులో లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల మొత్తం ఏడు ఎయిరిండియా అంతర్జాతీయ విమానాలు రద్దు చేయబడ్డాయి!

By:  Tupaki Desk   |   17 Jun 2025 11:06 PM IST
ఒక్కరోజుల్లో అన్ని ఎయిరిండియా విమానాలకు ఏమైంది?
X

మంగళవారం నాడు సాంకేతిక లోపాలు, విమానాలు అందుబాటులో లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల మొత్తం ఏడు ఎయిరిండియా అంతర్జాతీయ విమానాలు రద్దు చేయబడ్డాయి! అయితే.. రద్దు చేయబడిన విమానాలలో ఆరు బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాలు ఉన్నాయి. సుమారు 270 మందికి పైగా మరణించిన అహ్మదాబాద్ ప్రమాదంలో కూడా ఇదే తరహా విమానం ఉంది!

అవును... అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిరిండియా విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిరిండియా విమానాలకు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక సర్వీసులకు అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... మంగళవారం ఒక్కరోజే ఎయిరిండియాకు చెందిన ఏడు అంతర్జాతీయ సర్వీసులు రద్దయ్యాయి.

వీటిలో కొన్ని సాంకేతిక సమస్యలతో రద్దు కాగా.. మరికొన్ని డ్రీమ్ లైనర్ విమానాల తనిఖీల నేపథ్యంలో మిగిలాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాల మేరకు ఎయిరిండియా డ్రీమ్ లైనర్ విమానాలకు తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్‌ 17న ఆరు అంతర్జాతీయ సర్వీసులు రద్దయ్యాయి.

ఈ సందర్భంగా రద్దు చేయబడిన విమానాలు ఈ విధంగా ఉన్నాయి!:

ఏఐ915 - ఢిల్లీ నుండి దుబాయ్ - బీ787 డ్రీమ్ లైనర్

ఏఐ153 - ఢిల్లీ నుండి వియన్నా - బీ787 డ్రీమ్ లైనర్

ఏఐ143 - ఢిల్లీ నుండి పారిస్ - బీ787 డ్రీమ్ లైనర్

ఏఐ159 – అహ్మదాబాద్ నుండి లండన్ - బీ787 డ్రీమ్ లైనర్

ఏఐ170 - లండన్ నుండి అమృత్ సర్ - బీ787 డ్రీమ్ లైనర్

ఏఐ133 - బెంగళూరు నుండి లండన్ - బీ787 డ్రీమ్ లైనర్

ఏఐ179 - ముంబై నుండి శాన్ ప్రాన్సిస్కో - బీ777

వీటిలో ఢిల్లీ – పారిస్ విమానం.. ప్రయాణానికి ముందు తనిఖీల్లో సాంకేతిన సమస్య బయటపడటంతో ఆ విమానాన్ని రద్దు చేశారు. అహ్మదాబాద్ - లండన్ సెక్టార్ లో విమానాలు అందుబాటులో లేకపోవడమో అంతరాయం ఏర్పడిందని ఎయిరిండియా తెలిపింది! శాన్‌ ఫ్రాన్సిస్కో విమానానికి కోల్‌ కతాలో తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు సాంకేతిక సమస్యను గుర్తించినట్లు సమాచారం!

దీంతో ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చేందుకు ఎయిరిండియా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇతర రద్దులకు గల కారణాలు తెలియాల్సి ఉంది! ఈ సందర్భంగా... 12 జూన్ 2025 నుంచి 17 జూన్ 2025 సాయంత్రం 6 గంటల వరకూ ఎయిరిండియాకు సంబందించిన మొత్తం 83 విమాన సర్వీసులు రద్దు చేయబడగా.. వాటిలో 66 బోయింగ్ 787 విమానాలకు చెందినవి అని డీజీసీఏ తెలిపింది!