Begin typing your search above and press return to search.

విమానంలో ఏ సీటు సేఫ్?

ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంలో ఒక్కరు మినహా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Jun 2025 6:00 PM IST
విమానంలో ఏ సీటు సేఫ్?
X

ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంలో ఒక్కరు మినహా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. ఒక్కరు మినహా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. మృత్యుంజయుడు రమేష్ కూర్చున్న 11ఏ సీటు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి ఈ సీటును బ్యాడ్ లక్ సీటుగా అభివర్ణిస్తారు. ఎందుకంటే.. ఈ సీటు బిజినెస్ క్లాస్ తర్వాత వచ్చే ఎకానమీ క్లాస్ కు కాస్త ముందుగా ఉంటుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీటు పక్కనే వస్తుంది. దీంతో 11 ఏ సీటుకు విండో ఉండదు. దీంతో చూసేందుకు ఏమీ కనిపించదు. అందుకే దీన్ని బ్యాడ్ లక్ సీటుగా చెబుతారు. కానీ.. రమేశ్ కు ఈ దురదృష్టమే అదృష్టంగా మారింది.

ప్రమాదం జరిగిన వెంటనే సీటు ఊడిపోవటం.. అత్యవసర ద్వారం ఊడిపోవటంతో సీటు కాస్త విసురుగా బయటకు వచ్చేసింది. సీటు బెల్టు పెట్టుకొని ఉండటంతో విసురుగా బయటకు వచ్చి పడిన కుర్చీలో చిన్న గాయాలతో బయటపడిన పరిస్థితి. ఈ విషయాన్ని తెలుసుకున్న థాయ్ నటుడు కం సింగర్ రువాంగ్సాక్ లోయ్చుసాక్ తన జీవితంలో ఇదే విధంగా ఎదురైన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.

27 ఏళ్ల క్రితం (1998 డిసెంబరు 11న)థాయ్ ఎయిర్ వేస్ విమానం కూలినప్పుడు ఆయన కూడా 11ఏ సీటులోనూ ప్రయాణించారు. ఆ విమానానికి జరిగిన ఘోర ప్రమాదంలో 146 మంది ప్రయాణికుల్లో 101 మంది మరణించారు. బతికిన వారిలో రువాంగ్సాక్ ఒకరు. అప్పుడు ఆయన ప్రయాణించిన సీటు కూడా 11ఏ. దీంతో.. తనకు గతంలో ఎదురైన అనుభవాన్ని పేర్కొంటూ.. ‘నాకు రెండో జీవితం దక్కింది బహుశా 11ఏలో కూర్చోవటం వల్లనే. నాటి బోర్డింగ్ పాస్ నా దగ్గర లేదు. కానీ.. నా సీట్ నెంబరు అప్పుడు అన్ని పత్రికల్లో వచ్చింది. ఆ ప్రమాదం తర్వాత పదేళ్లు నేను విమాన ప్రయాణం చేయలేదు’ అంటూ తన అనుభవాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

11ఏ సీటులో కూర్చున్న ఇద్దరు ప్రాణాలతో బయటపడటంతో ఈ సీటు సేఫ్ గా భావిస్తున్నారంతా.కానీ.. అందులో నిజం లేదంటున్నారు నిపుణులు. విమాన ప్రమాదం జరిగిన తీరుకు అనుగుణంగా పరిస్థితులు ఉంటాయే తప్పించి.. 11ఏ సురక్షితమన్న వాదనలో ఎలాంటి లాజిక్ లేదంటున్నారు. సాంకేతిక ఆధారాలు కూడా లేవని చెబుతున్నారు. మరి.. అలాంటప్పుడు విమానంలో ఏ సీటు సురక్షితం అన్న విషయానికి వస్తే.. దాదాపుగా ఏది సేఫ్ కాదన్న మాటను చెబుతున్నారు.

అయితే.. అమెరికాకు చెందిన ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్ డైరెక్టర్ మిచెల్ ఫాక్స్ ఇదే విషయాన్ని చెబుతూ.. ‘విమానంలో ఫలానా సీటు సురక్షితమని చెప్పలేం. కాకుంటే విమానంలో ముందు సీటు కంటే కూడా వెనుక వైపు సీట్లు ఎక్కువ సురక్షితం’’ అని ఆయన చెబుతున్నారు. మరి.. దీనికి ఏమైనా సాంకేతిక ఆధారాలు ఉన్నాయా? అని అడిగితే.. 1971 నుంచి జరిగిన విమాన ప్రమాదాలపై 2007లో పాపులర్ మెకానిక్స్ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసిందని ఆయన వెల్లడించారు. సో.. విమానంలో ఏ సీటు సేఫ్ అన్నది మీకు కాస్తంత క్లారిటీ వచ్చి ఉంటుంది.