‘ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావ్?’... ఎయిరిండియా ప్రమాదంపై ప్రాథమిక నివేదిక!
అవును... అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఒక్కసారిగా కూలిపోయిన ఘటనతో దేశం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 July 2025 9:48 AM ISTజూన్ 12న అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. టెకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఎయిరిండియా విమానం ఒక్కసారిగా జనావాసాలపై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 241 మందితో పాటు బయట ఉన్న 19 మంది మృతి చెందారు. ఈ క్రమంలో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఏఏఐబీ.. తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెల్లడించింది.
అవును... అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఒక్కసారిగా కూలిపోయిన ఘటనతో దేశం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ ప్రమాద ఘటనపై 'ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో' (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది.
కాక్ పీట్ లో పైలెట్ల ఆఖరి మాటలు ఇవే!:
ఏఏఐబీ ఇచ్చిన నివేదికలో కాక్ పీట్ లో పైలెట్ల ఆఖరి మాటలు ఇవే అంటూ కీలక విషయం వెల్లడించింది. ఇందులో భాగంగా.. విమానం టేకాఫ్ అయిన తర్వాత సెకన్ల వ్యవధిలో ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్ లు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ సమయంలో ఒక పైలెట్ మరో పైలెట్ ను... 'ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావు’ అని ప్రశ్నిచాడని రిపోర్ట్ వెల్లడించింది.
దీనికి సమాధానంగా స్పందించిన మరో పైలెట్... 'తాను స్విచ్ ఆఫ్ చేయలేదు’ అని సమాధానం ఇచ్చినట్లు తెలిపింది. కాక్ పిట్ లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. తర్వాత పైలట్లు ఏటీసీకి మేడే కాల్ ఇచ్చారని వెల్లడించింది. ఈ రెండు స్విచ్ లు ఒక సెకను తేడాతో ఒకదాని తర్వాత మరొకటి ఆగినట్లు నివేదికలో తెలిపింది.
గాల్లో కేవలం 32 సెకన్లపాటే ఉంది!:
ఈ విమానం ప్రమాదానికి ముందు 32 సెకన్ల పాటు మాత్రమే గాల్లో ఉన్నట్లు ఏఏఐబీ వెల్లడించింది. రన్ వేకు కేవలం 0.9 నాటికల్ మైళ్ల దూరంలోని విమానం కూలిపోయిందని వివరించింది. ఇంజిన్లు శక్తిని కోల్పోయిన తర్వాత ర్యామ్ ఎయిర్ టర్బైన్ ను యాక్టివేట్ చేసినట్లు గుర్తించినట్లు తెలిపింది.
* ఇదే క్రమంలో... మేడే కాల్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ.. ఎలాంటి స్పందన రాలేదని.. అందుకు కారణం అప్పటికే విమానం కూలిపోయిందని ఏఏఐబీ వివరణ ఇచ్చింది.
* ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. విమానంలో ఇంధనం కూడా స్వచ్ఛంగానే ఉందని, కలుషితమైన ఆనవాళ్లు లేవని తెలిపింది.
* అదేవిధంగా... ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసి, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ ను గుర్తించామని పేర్కొంది.
