Begin typing your search above and press return to search.

అహ్మదాబాద్ ప్రమాదంపై యూకే, యూఎస్ లో కేసులు... ఎందుకంటే..?

గత నెలలో అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 July 2025 6:00 AM IST
అహ్మదాబాద్  ప్రమాదంపై యూకే, యూఎస్  లో కేసులు... ఎందుకంటే..?
X

గత నెలలో అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో విమానంలోని 241 మంది మరణించగా... వారిలో 181 మంది భారతీయులు, 52 మంది యూకే కు చెందినవారు ఉన్నారు. ఈ సమయంలో యూకే, యూఎస్ లలో ఎయిరిండియా, బోయింగ్ లపై కేసులు ప్లాన్ చేస్తున్నారు!

అవును... విమానంలోని వారు 241 మంది, బయట పౌరులు 19 మందిని పొట్టనపెట్టుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలపై ఏఏఐబీ దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... యూకేలోని మరణించినవారి కుటుంబాలు ఎయిరిండియాపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బోయింగ్ పైనా కేసులు వేయనున్నారని అంటున్నారు.

ఈ సమయంలో... ప్రమాద బాధితుల కుటుంబాలతో కలిసి యూకే, యూఎస్ లోని న్యాయబృందాలు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో.. ప్రస్తుత అంతర్జాతీయ చట్టం ప్రకారం వారి చట్టపరమైన హక్కులను నొక్కి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు. ఈ చట్టపరమైన ప్రయత్నానికి యూకేకి చెందిన కీస్టోన్ లా నుండి జేమ్స్ హీలీ ప్రాట్, ఓవెన్ హన్నా నాయకత్వం వహిస్తున్నారు.

యూఎస్ కు చెందిన విస్నర్ లా ఫర్మ్ నుండి విమానయాన నిపుణులతో కలిసి ఈ చట్టపరమైన ప్రయత్నానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్పమించిన జేమ్స్ హీలీ ప్రాట్... తమ అంతర్జాతీయ న్యాయ బృందం గత వారం రోజులుగా విమాన ప్రమాదంలో మరణించిన యూకే ప్రయాణికుల కుటుంబాలతో చర్చలు జరుపుతోందని అన్నారు. అన్ని ఆధారాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో... బోయింగ్‌ పై అమెరికాలో దావా వేయాలని, ఎయిరిండియా పై లండన్‌ లోని హైకోర్టులో కేసును దాఖలు చేయాలని ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులతో ఎలాంటి పరిణామలను రెండు సంస్థలు ఎదుర్కోవాల్సి వస్తోందనేది ఆసక్తిగా మారింది.

కాగా... విమాన ప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరి కుటుంబాలకు ఎయిరిండియా యాజమాన్యం టాటా గ్రూప్ ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... తక్షణ అవసరాలను తీర్చడానికి ఆయా కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారాన్ని అందించింది.