Begin typing your search above and press return to search.

ఎయిరిండియా విమానం ప్రమాదం మానవ తప్పిదమా?

అవును... ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు జరుపుతోన్న ఏఏఐబీ.. ఇప్పటికే కేంద్రానికి ప్రాథమిక నివేదికను ఇచ్చిందనే సంగతి తెలిసిందే!

By:  Tupaki Desk   |   11 July 2025 1:01 PM IST
ఎయిరిండియా విమానం ప్రమాదం మానవ తప్పిదమా?
X

జూన్ 12.. భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి రోజుల్లో, విషాదకర సంఘటనల్లో ఒకటనే సంగతి తెలిసిందే. దానికి కారణం ఎయిరిండియా విమాన ప్రమాదం. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనపై ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు కొనసాగుతోంది! ఈ సమయంలో ఓ షాకింగ్ కథనం తెరపైకి వచ్చింది!

అవును... ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు జరుపుతోన్న ఏఏఐబీ.. ఇప్పటికే కేంద్రానికి ప్రాథమిక నివేదికను ఇచ్చిందనే సంగతి తెలిసిందే! ఆ ప్రాథమిక నివేదిక త్వరలో ప్రజల్లోకి రానుందని చెబుతున్నారు. ఈ సమయంలో విమానం కూలిపోవడంలో మానవ తప్పిదం జరిగి ఉంటుందని ఒకరు, టెక్నికల్ సమస్య అని మరొకచోట ఊహాగాణాలు ప్రచారం అవుతున్న వేళ అంతర్జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది!

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం... పైలట్లు టేకాఫ్ తర్వాత అనుకోకుండా లేదా యాదృచ్ఛికంగా ఇంధనం స్విట్చ్ లను ఆపివేశారని సూచిస్తుంది! ఆ విమానంలోని రెండు ఇంజిన్లకు ఇంధనం సరఫరా చేసే స్విచ్‌ లు ఆఫ్‌ అయి ఉంటాయని అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు పేర్కొంది., దీనివల్ల టేకాఫ్ అయిన కొద్దిసేపటికే థ్రస్ట్ కోల్పోవడం స్పష్టంగా కనిపిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయంటూ వారి అంచనాలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది!

ఇదే సమయంలో... సాధారణంగా విమాన ప్రయాణంలో ఫ్యుయల్ స్విచ్‌ లు ఆన్‌ లో ఉంటాయని.. వాటిని ఎలా లేదా ఎందుకు ఆపివేశారో అస్పష్టంగా ఉందని రాసుకొచ్చింది! ఈ చర్య ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా వాటిని తిరిగి ఆన్ చేయడానికి ప్రయత్నించడంలో విఫలమయ్యారా అనేది అస్పష్టంగా ఉందని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది!

మరోవైపు... ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఇంధన సరఫరా స్విచ్‌ లు ఆఫ్‌ అయ్యి ఉన్నయంటూ సందేహాలను వ్యక్తంచేస్తూ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఇలా కథనం ప్రచురించడం.. ఇప్పటికే రకరకాల ప్రచారాలు హల్ చల్ చేస్తున్న వేళ... ఏఏఐబీ కేంద్రానికి సమర్పించిన ప్రాథమిక నివేదిక ఈ రోజు వెలువడే అవకాశాలున్నాయని అంటున్నారు.

కాగా... ఈ ప్రమాదంపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు ఆధారంగా ప్రాథమిక నివేదిక రూపొందించిన ఏఏఐబీ.. దాన్ని కేంద్ర పౌర విమాన మంత్రిత్వశాఖతో పాటు సంబంధిత ఇతర అధికారులకు సమర్పించినట్లు ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే! అయితే ప్రస్తుతానికి ఈ నివేదికలో ఏ విషయం ఉందనేది మాత్రం అధికారులు బయటపెట్టలేదు. ఈ లోపు రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి.

ఇదే సమయంలో... ఎయిర్‌ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో.. బ్లాక్ బాక్స్‌ ల నుండి మంచి డేటాను సేకరించగలిగిందని, విమానయానంపై పార్లమెంటరీ ప్యానెల్ సమావేశంలో దాని అధికారులు ఎంపీలకు ఈ విషయం చెప్పారని వర్గాలు తెలియాని జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. అయితే... చర్చలు ప్రైవేట్‌ గా ఉండటంతో రెండు వర్గాలు వివరాలను వెల్లడించడానికి నిరాకరించాయని అంటున్నారు!

దీంతో... ఏది ఏమైనా వీలైనంత తొందరలో 260 మందిని బలితీసుకున్న ఎయిరిండియా అహ్మదాబాద్ ఘోర ఘటనకు సంబంధించిన వాస్తవ కారణాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు!