Begin typing your search above and press return to search.

దారుణం... ఇన్ ఫ్లుయెన్సర్లూ ఇదొక్కసారి చదవండి!

అవును.. అహ్మదాబాద్‌ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Jun 2025 2:00 PM IST
దారుణం... ఇన్ ఫ్లుయెన్సర్లూ ఇదొక్కసారి చదవండి!
X

కొందమంది సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు లైకులే నీళ్లు, షేర్లే ఆహారం అన్నట్లుగా వారి తీరు ఉంటుందని.. సామాజిక బాధ్యత, విలువలు, ఇంగితం వంటివి తమ పరిధిలోకి రావన్నట్లుగా వారి ప్రవర్తన ఉంటుందనే కామెంట్లు నెట్టింట వినిపిస్తూ ఉంటాయి. అలాంటివాళ్లకు తాజాగా ఎయిరిండియా విమాన ప్రమాదంలోని బాధిత కుటుంబాలు ఓ కీలక విజ్ఞప్తి చేస్తున్నాయి.

అవును.. అహ్మదాబాద్‌ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో.. ప్రమాదంలో తమ వారు ప్రాణాలు కోల్పోయారనే షాక్‌ నుంచి ఇప్పటికీ వారి కుటుంబ సభ్యులు తేరుకోలేకపోతున్నారు. మృతదేహాల ఆచూకీ దొరకని పరిస్థితి!

దీంతో.. జూన్ 12 సాయంత్రం నుంచి తమ వారి మృతదేహాల కోసం తిండీ, నిద్రా లేకుండా ఆస్పత్రి మార్చురీ వద్ద పడిగాపులు కాస్తున్నారు. తమవారి మృతదేహం ముద్దలైనా దొరకకపోతాయా, అంత్యక్రియలు జరపకపోతామా అనే ధీన స్థితిలో ఎదురుచూస్తున్నారు! ఈ పరిస్థితుల్లో వారికి సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో పెద్ద సమస్య వచ్చిపడింది.

ఇందులో భాగంగా... మృతులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉపయోగించుకొని పలువురు ఇన్‌ ఫ్లుయెన్సర్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ విసుగు చెందిన మృతుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైకులు, షేర్ల కోసం బాధిత కుటుంబాలను మరింత బాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా వాటిని ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ క్రమంలో... రాజస్థాన్‌ లోని బాంస్‌ వాడకు చెందిన డాక్టర్‌ కోమి వ్యాస్‌.. భార్యాపిల్లలతో కలిసి లండన్ వెళ్తూ విమాన ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో వారి కుటుంబానికి చెందిన చివరి సెల్ఫీ అంటూ ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటో చాలా మందితో కన్నీరు పెట్టించింది.

అయితే... ఆ ఫోటోను ఉపయోగించుకుని వారి కుటుంబానికి చెందిన ఫేక్‌ ఫొటోలను, ఏఐ వీడియోలను పలువురు నెటిజన్లు, ఇన్‌ ఫ్లుయెన్సర్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారని కోమి వ్యాస్‌ బంధువు కుల్దీప్ భట్ ఆరోపించారు. లైక్స్‌, వ్యూస్‌ కోసం ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు.

తమ కుటుంబానికి వచ్చిన కష్టంతో తామంతా ఇప్పటికే మానసికంగా కుంగిపోయి ఉంటే... మాలగే మరో 270కి పైగా కుటుంబాలు తమ వారిని కోల్పోయి విచారంలో మునిగిపోయి ఉంటే.. ఇవేవీ పట్టించుకోకుండా కొందరు ఇన్‌ ఫ్లుయెన్సర్లు వారి లైక్‌ లు, షేర్లు, కామెంట్ల కోసం ప్రమాదానికి సంబంధించిన వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

కోమి కుటుంబం విమానం ఎక్కగానే దిగిన సెల్ఫీ ఫొటో నుంచి ఏఐ వీడియోలు చేస్తున్నారని.. ప్రమాదంలో మరణించిన వారి కుమార్తె ఎనిమిదేళ్ల మిరియాకు చెందినదని ఓ మృతదేహం ఫొటోను షేర్‌ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆమెకు దహన సంస్కారాలు చేస్తున్నట్లు మరికొన్ని వీడియోలు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే... వాస్తవానికి ఇప్పటివరకూ వారి మృతదేహాలు కూడా దొరకలేదని.. దీంతో తామంతా శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నామని.. లైకుల కోసం తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తూ.. మమ్మల్ని మరింత క్షోభకు గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు.