Begin typing your search above and press return to search.

ఎయిరిండియా విమాన ప్రమాదం.. కలిచి వేస్తోన్న అర్జున్ భాయ్ కథ!

ఈ సమయంలో పలు విషాద కథలు తెరపైకి వస్తుండగా.. తాజాగా అర్జున్ భాయ్ కథ అందరినీ కలిచివేస్తోంది.

By:  Tupaki Desk   |   13 Jun 2025 8:00 PM IST
ఎయిరిండియా విమాన ప్రమాదం.. కలిచి వేస్తోన్న అర్జున్ భాయ్ కథ!
X

గురువారం అహ్మదాబాద్ లో జరిగిన అత్యంత ఘోరమైన ఎయిరిండియా విమాన ప్రమాదంలో 265 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇది భారతదేశ చరిత్రలోనే జరిగిన అత్యంత ఘోరమైన భారీ విమాన ప్రమాదాల్లో ఒకటని అంటున్నారు. ఈ సమయంలో పలు విషాద కథలు తెరపైకి వస్తుండగా.. తాజాగా అర్జున్ భాయ్ కథ అందరినీ కలిచివేస్తోంది.

అవును... అహ్మదాబాద్‌ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన 265 మందిలో.. తన దివంగత భార్య చివరి కోరిక తీర్చడానికి గుజరాత్‌ కు వెళ్లిన యూకే కి చెందిన ఒక భారతీయ వ్యక్తి కూడా ఉన్నాడు. తన భర్య చివరికోరిక తీర్చడం కోసం పిల్లలను యూకేలోనే ఉంచి భారత్ వచ్చిన అతడు.. తాజా విమాన ప్రమాదంలో మృతి చెందారు.

వివరాళ్లోకి వెళ్తే... అర్జున్ మనుభాయ్ పటోలియా (36) తన భర్య 8, 4 ఏళ్ల వయసున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి లండన్ లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో అతని భర్య భారతీబెన్ ఇటీవల లండన్ లో మరణించింది. అయితే ఆమె తన చితాభస్మాన్ని తన మాతృభూమికి తీసుకెళ్లమని చనిపోయే ముందు తన భర్తను కోరింది.

దీంతో తన భర్య చితాభస్మాన్ని నర్మదా నదిలో నిమజ్జనం చేయడానికి అమ్రేలి జిల్లాలోని తన పూర్వికుల గ్రామం వాడియాకు తిరిగి వచ్చాడు అర్జున్. ఈ క్రమంలో బంధువులతో కలిసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో గురువారం లండన్ లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్లే ఎయిరిండియా విమానం ఎక్కారు. ఆ తర్వాత.. విషాదం నెలకొంది!

దీంతో... 8, 4 ఏళ్ల వయసున్న తన ఇద్దరి పిల్లలు అనాథలయ్యారు. సుమారు వారం రోజుల వ్యవధిలోనే తల్లితండ్రులను కోల్పోయిన ఆ ఇద్దరు పసి పిల్లల పరిస్థితి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ సందర్భంగా అర్జున్ మృతిని అతని మేనల్లుడు క్రిష్ జగదీష్ ధృవీకరించారు!