ఎయిరిండియా ప్రమాదం... తాజాగా తెరపైకి దశాబ్ధాల నాటి చర్చ!
అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదానికి గల కారణంపై ఇటీవల ప్రాథమిక నివేదిక (అంచనా!) వెలువడిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 July 2025 9:15 AM ISTఅహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదానికి గల కారణంపై ఇటీవల ప్రాథమిక నివేదిక (అంచనా!) వెలువడిన సంగతి తెలిసిందే. "ఇంధనాన్ని ఎందుకు ఆపేశావు" అని ఒక పైలట్ ప్రశ్నించగా.. "నేను ఆపలేదు" అని మరో పైలెట్ బదులిచ్చారు. జూన్ 12న ఎయిరిండియా విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు జరిగిన ఈ సంభాషణను విమాన ఆడియో రికార్డర్ నుండి స్వాధీనం చేసుకున్నారు.
లండన్ బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం కూలిపోయిన సరిగ్గా ఒక నెల తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఏఏఐబీ) విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఇదే సమయంలో.. ఆ ఏఏఐబీ ప్రాథమిక నివేదిక అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఇందులో ప్రధానంగా.. కాక్ పిట్ వీడియో రికార్డర్ లపై దశాబ్ధాలుగా జరుగుతున్న చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.
అవును... విమానాలు ప్రమాదాలకు గురైనప్పుడు కాక్ పీట్ లోని కీలకమైన క్షణాల్లో వీడియోలు ఖచ్చితమైన సమాధానాన్ని అందించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. కేవలం ఆడియోపై ఎందుకు ఆధారపడాలి అనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. ఎంతో అధునాతన ఎలక్ట్రానిక్స్ కలిగిన విమానాలలో.. క్లిష్టమైన పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలను, చర్యలను నమోదు చేయగల కెమెరాలు కాక్ పిట్లలో ఎందుకు ఉండకూడదని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
వాస్తవానికి ఈ చర్య అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాతే మొదలయ్యింది కాదు.. విమాన ప్రమాదాలను పరిశీలించే స్వతంత్ర అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్.టీ.ఎస్.బీ) సుమారు 25 సంవత్సరాల క్రితమే కాక్ పిట్ వీడియో రికార్డర్ ల కోసం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో... 260 మందిని బలిగొన్న ఎయిరిండియా ప్రమాదం తర్వాత మరోసారి ఈ చర్చ బలంగా మొదలైంది.
అయితే... కాక్ పిట్ లలో వీడియో రికార్డింగ్ ల విషయంలో పెద్ద అడ్డంకి పైలట్ సంఘాలే అని అంటారు. ఈ విషయంలో వారి నుంచి సానుకూల స్పందన రావడం లేదని చెబుతారు. ఈ విషయంలో పైలట్ల నుంచి వ్యక్తిగత గోప్యతతోపాటు వీడియోలను దుర్వినియోగం చేస్తారనే వాదన ఉంది. దీనిపై 'ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్ లైన్ పైలట్స్ అసోసియేషన్' సహా ఇతర పైలట్ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేశాయి.
1999లో జరిగిన ఈజిప్ట్ ఎయిర్ ఫ్లైట్ 990 ప్రమాదాన్ని పరిశీలించిన తర్వాత విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ ఎన్.టీ.ఎస్.బీ.. కాక్ పిట్ వీడియో పర్యవేక్షణను ప్రతిపాదించిందని చెబుతారు. ఈ ప్రమాదంలో కైరో-న్యూయార్క్ విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. దీంతో.. ఆ విమానంలో ఉన్న 217 మంది మరణించారు. కెప్టెన్ వాష్ రూమ్ కి వెళ్లినపుడు.. ఫస్ట్ ఆఫీసర్ గమిల్ అల్ బటౌటి ఆటోపైలట్ ను డిస్ కనెక్ట్ చేసినట్లు నివేదించబడిందని చెబుతారు!
వాష్ రూమ్ నుండి తిరిగి వచ్చిన కెప్టెన్, అల్ బటౌటి మధ్య జరిగిన గందరగోళ సంభాషణను కాక్ పిట్ వాయిస్ రికార్డర్ వెల్లడించింది. ఆ సమయంలో... "ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది?" అని కెప్టెన్ అడిగినప్పుడు.. "నేను దేవుడిపై ఆధారపడుతున్నాను" అని అల్ బటౌటి పదే పదే అరబిక్ లో చెప్పడం వినిపించింది! ఈ నేపథ్యంలో... ఈ ప్రమాదానికి అల్ బటౌటి చర్యలే కారణమని ఎన్.టీ.ఎస్.బీ. ఆరోపించింది.
అయితే... ఈజిప్టు అధికారుల స్వతంత్ర దర్యాప్తు మాత్రం ఇది ఒక మానవ తప్పిదం అని ఆ ఆరోపణలు తోసి పుచ్చింది.. దర్యాప్తులు అసంపూర్తిగా మిగిలిపోయింది. దీంతో... కాక్ పిట్ లో వీడియో రికార్డర్ ఉండి ఉంటే.. పైలట్ ఏ పాత్ర పోషించాడో దర్యాప్తు అధికారులకు ఖచ్చితంగా తెలిసి ఉండేదనే చర్చ బలంగా వినిపించింది.
ఈ క్రమంలోనే 2003 నుండి ఎన్.టీ.ఎస్.బీ. తన మోస్ట్ వాంటెడ్ జాబితాలో కాక్ పిట్ లో వీడియో రికార్డింగ్ ను చేర్చింది. అయితే.. దీనికి ప్రపంచంలోనే అతిపెద్ద పైలట్ల సంఘం 'ఎయిర్ లైన్ పైలట్స్ అసోసియేషన్' (ఏ.ఎల్.పీ.ఏ) వ్యతిరేకత ఉందని చెబుతారు. ఈ సందర్భంగా... ఇటీవల ఆస్ట్రేలియాలో హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయిన ఘటనను తెరపైకి తెస్తున్నారు.
ఆ ఘటనలో పైలట్ చనిపోగా.. ఆ దర్యాప్తులో వీడియో రికార్డింగ్ కీలకంగా నిలిచింది. అందులో... హెలికాప్టర్ ఆటోమోడ్ లో ఉన్నప్పుడు ఆహారం, శీతలపానీయాలు తీసుకునేందుకు ఎక్కువ సేపు కేటాయించడంతోపాటు మొబైల్ చూసినట్లు నివేదికలో తేలింది. అందులో ఉన్న కెమెరాల వల్ల ఈ విషయం తేలడంతో వీటి వాడకాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆస్ట్రేలియన్ ట్రాన్స్ పోర్ట్ సేఫ్టీ బ్యూరో (ఏ.టీ.ఎస్.బీ) సూచించింది.
ఈ క్రమంలో అంతిమంగా... కార్లతో సహా ప్రతిచోటా కెమెరాలు ఉన్నప్పటికీ.. విమానాలలో వాటిని కాక్ పిట్ లో ఎందుకు ఉంచకూడదు అని ప్రజలు ప్రశ్నిస్తుంటే... కాక్ పిట్ లోని కెమెరాలు గోప్యత, డేటా భద్రతా సమస్యలను తెస్తాయని పైలెట్ల సంఘాలు అంటున్నాయని తెలుస్తోంది. వాటిని గూఢచర్యం చేయడానికి ఉపయోగించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో.. ప్రమాదం జరిగినప్పుడు, ఫుటేజ్ తప్పుగా అర్థం చేసుకోబడవచ్చని అంటున్నారు.
