Begin typing your search above and press return to search.

విమాన ప్రమాద కారణాలు, కెప్టెన్ సమర్ధతపై పైలట్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు!

అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.

By:  Tupaki Desk   |   14 Jun 2025 9:32 AM IST
విమాన ప్రమాద కారణాలు,  కెప్టెన్  సమర్ధతపై పైలట్స్  చీఫ్  కీలక  వ్యాఖ్యలు!
X

అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బోయింగ్ విమానాల భద్రతా తనిఖీల కోసం పిలుపులు పెరుగుతున్నాయి.. ఇప్పటికే పౌర విమానయాన శాఖ ఎయిరిండియాకు భద్రతా తనిఖీల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత పైలట్ల సంఘం సమాఖ్య అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన నేపథ్యంలో బోయింగ్ విమానాల జవాబుదారీతనం, భద్రతా తనిఖీలపై తీవ్రమైన చర్చలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్స్ పైలట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కెప్టెన్ సీఎస్ రాంధావా కీలక వ్యాఖ్యలు చేశారు. విమాన సిబ్బందికి తమ మద్ధతును ప్రకటించారు! ఈ సందర్భంగా ప్రమాదానికి గల పలు కారణాలను అంచనా వేశారు.

ఈ సందర్భంగా... బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ పైలట్లలో ఒకరైన కెప్టెన్ సుమిత్ సభర్వాల్ అర్హతలను సమర్థించిన రాంధవా... 8,000 కంటే ఎక్కువ విమాన గంటలకు పైగా ఉన్న ఆయన అనుభవాన్ని హైలెట్ చేశారు. తాజాగా మాట్లాడిన ఆయన.. ప్రాథమికంగా రెండు ఇంజిన్లు విఫలమవ్వడం అనేది మొదటి ఆలోచనే కానీ.. అది అత్యంత అరుదైన సంఘటన అని అన్నారు.

ఇదే సమయంలో... పక్షి ఢీకొనడం, డ్యూయల్ ఇంజిన్ వైఫల్యం, ల్యాండింగ్ గేర్ సమస్యలు, లిఫ్ట్ కోల్పోవడం వంటి అనేక అవకాశాలను అంగీకరించారు. వాస్తవానికి అహ్మదాబాద్ పక్షుల కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ప్రాంతమని ఎత్తి చూపిన ఆయన.. ఒక పక్షి రెండు ఇంజిన్ లను ఢీకొని ప్రభావితం చేసి ఉంటే.. అది మంటలకు కారణమయ్యేదని.. లేదా, ఇంజిన్లు పనిచేయకుండా పోయేవని పేర్కొన్నారు.

అదేవిధంగా... విమానం తొలుత ఢిల్లీ నుంచి వచ్చి, లండన్ వెళ్లే ముందు అహ్మదాబాద్ లో ఇంధనం నింపుకుందని వివరించిన రాంధవా.. టేకాఫ్ కి ముందే విమానం పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించబడిందని, అన్ని టెక్నికల్ పరీక్షలు పూర్తై ఉన్నాయని అన్నారు! అందువల్ల తీవ్రమైన సాంకేతిక వైఫల్యమే ఈ ప్రమాదానికి కారణం అయ్యి ఉండొచ్చనే అభిప్రాయాన్ని ఆయన తోసిపుచ్చారు!

ఈ సందర్భంగా ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో వైరల్ గా మారిన వేళ.. దానిపై స్పందించిన ఆయన.. టేకాఫ్ నుంచి క్రాష్ అయ్యే వరకూ ల్యాండింగ్ గేర్ కిందికి ఉన్నట్లు కనిపిస్తోందని.. సాధారణంగా టేకాఫ్ అయిన వెంటనే గేర్ ను వెనక్కి తీసుకుంటారని.. అలా చేయడంలో విఫలమైతే అది లిఫ్ట్, మొత్తం విమాన పనితీరుపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు.

ఇక ప్లాప్ ల విషయాన్ని ప్రస్థావించిన రాంధవా.. టేకాఫ్ సమయంలో సాధారణంగా ఫ్లాప్ 5ని ఉపయోగిస్తామని, పరిమిత విమానాశ్రయాల్లో మాత్రమే ఫ్లాప్ 15ని ఉపయోగిస్తామని అన్నారు. ఆ వీడియోలో చూస్తే.. విమానం 350 - 400 అడుగులు ఎత్తు మాత్రమే ఎగిరినట్లు కనిపిస్తోందని.. ఆ సమయంలో గేర్ ను వెనక్కి తీసుకోకపోతే, డ్రాగ్ ఎక్కువగా ఉండి, ఫ్లాప్ తప్పు కాన్ఫిగరేషన్ తో కలిపిఉంటే, అది లిఫ్ట్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు.

ఈ నేపథ్యంలోనే... కెప్టెన్, ఆటోపైలెట్ ను ఇన్వాల్వ్ చేసి, గేర్ ను పైకి లేపమని ఆదేశాలు జారీ చేసి ఉండోచ్చని.. అయితే, కో-పైలెట్ బహుశా అనుకోకుండా గేర్ ను వెనక్కి తీసుకోవడానికి బదులుగా, ఫ్లాప్ లను పైకి లేపి ఉంటాడని.. దానివల్ల విమానం అకస్మాత్తుగా లిఫ్ట్ కోల్పోయి ఉండొచ్చని.. సరిగ్గా ఇదే జరిగినట్లు అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ.. ఊహాగాణాలపై కాకుండా, వాస్తవాలపై దృష్టి పెట్టాలని కోరిన రాంధవా... కెప్టెన్ సుమిత్ సభర్వాల్ తనకు 2003-2004 నుంచి తెలుసని, అతడు తన కింద శిక్షణ పొందారని.. అతడు సమర్థుడైన పైలెట్ అని నొక్కి చెప్పారు.