Begin typing your search above and press return to search.

274, 251, 245... మృతదేహాలను గుర్తించడంలో ఎందుకింత ఆలస్యం?

ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది ప్రయాణికులు, స్థానిక ప్రజలు 33 సహా మొత్తం 274 మంది ప్రాణాలు కోల్పోయారు.

By:  Tupaki Desk   |   23 Jun 2025 10:11 PM IST
274, 251, 245... మృతదేహాలను గుర్తించడంలో ఎందుకింత ఆలస్యం?
X

జూన్ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో దేశం మొత్తం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ క్రమంలో.. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ఈ ఘోర ప్రమాదంలో కాలి బూడిదైన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.

అవును... జూన్ 12న లండన్‌ కు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం మధ్యాహ్నం 1:39 గంటల ప్రాంతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. అలా టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే మెఘానినగర్‌ లోని ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ సముదాయంపై కుప్పకూలిపోయింది. ఆ సమయంలో అది అగ్నిగోళంలా మారిపోయింది.

ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది ప్రయాణికులు, స్థానిక ప్రజలు 33 సహా మొత్తం 274 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో ఇప్పటి వరకు 251 మంది మృతదేహాలను డీ.ఎన్.ఏ. పరీక్షల ద్వారా విజయవంతంగా గుర్తించారు. అలా గుర్తించిన వారిలో 245 మృతదేహాలను ఇప్పటికే వారి కుటుంబాలకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

వాస్తవానికి మృతుల కుటుంబ సభ్యుల నుంచి డీ.ఎన్.ఏ శాంపిల్స్ సేకరించేటప్పుడు.. 72 గంటల్లోనే మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు చెప్పిన పరిస్థితి! అయితే... ప్రమాదం జరిగి 10 రోజులు దాటినా ఇంకా కొందరి మృతదేహాలను గుర్తించలేకపోయారు. దీనికి కారణం ఇచ్చిన శాంపుల్స్ తో మృతదేహాల డీ.ఎన్.ఏ. మ్యాచ్ కాలేకపోవడమే అని చెబుతున్నారు! దీంతో మిగిలిన బాధితుల కుటుంబాలను మళ్లీ సంప్రదించాల్సి వచ్చిందని చెబుతున్నారు.

ఈ క్రమంలో... ఇప్పటికీ కొన్ని మృతదేహాల గుర్తింపు అంతుచిక్కకుండా ఉండటంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చివరి చూపు చూసుకునే వీలైనా దొరుకుతుందా.. కనీసం దొరికిన మాంసం ముద్దలకు అంత్యక్రియలైనా చేయగలుగుతామా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.