హాస్టల్ బిల్డింగ్ పై దొరికిన బ్లాక్ బాక్స్... కీలక సమాచారం ఏమిటంటే..?
అవును... అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న బ్లాక్ బాక్స్ లభ్యమైంది.
By: Tupaki Desk | 13 Jun 2025 6:35 PM ISTఅహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. బ్లాక్ బాక్స్ దొరికితే కానీ కారణంపై క్లారిటీ రాదనే కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో బ్లాక్ బాక్స్ దొరికింది.
అవును... అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న బ్లాక్ బాక్స్ లభ్యమైంది. తాజాగా విమానం ఢీకొన్న రెసిడెంట్ డాక్టర్స్ హాస్టల్ భవనం పైకప్పు వద్ద ఈ పరికరాన్ని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) బృందం స్వాధీనం చేసుకొంది.
ఈ సందర్భంగా స్పందించిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో... ఈ విమాన ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. ఇదే సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది, పౌరవిమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. విమానం తోక దగ్గర ఈ ఆరెంజ్ కలర్ బాక్స్ దొరికినట్లు చెబుతున్నారు!
కాగా... బ్లాక్ బాక్స్ అనేది విమానంలోని కేవలం ఒక పరికరం కాదు.. వాస్తవానికి ఇందులో ఫ్యాక్ చేయబడిన రెండు భాగాలు ఉంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్.డీ.ఆర్). ఇది విమానం వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు, నావిగేషన్ వివరాలు వంటి సంకేతిక డేటాను రికార్డ్ చేస్తుంది.
ఇక రెండోది.. కాక్ పీట్ వాయిస్ రికార్డర్ (సీ.వీ.ఆర్). ఇది పైలట్ సంభాషణలు, ఫ్లైట్ డెక్ నుంచి వచ్చే ఇతర శబ్ధాలతో సహా కాక్ పీట్ నుంచి ఆడియోను సేవ్ చేస్తుంది. ఈ రికార్డ్లు కలిసి 25 గంటలకు పైగా విమాన డేటాను, రెండు గంటల వాయిస్ రికార్డింగులను నిల్వ చేయగలవు.
సాధారణంగా విమానం ముందు వైపు కూలిపోతుంది కాబట్టి.. క్రాష్ ప్రూఫ్ పరికరం విమానం తోక దగ్గర ఉంటుంది. ఈ పరికరం క్రాష్ తర్వాత అనేక సందేహాలకు సమాధానాలను ఇస్తుందని అంటారు. ఈ పరికరం కనీసం గంటపాటు 1,100 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ని తట్టుకునేలా ఇన్సులేట్ చేయబడి ఉంటుంది.
