విమానయాన వ్యవస్థలో లోపాలపై డీజీసీఏ సంచలన ప్రకటన
ఈ సందర్భంగా పలు లోపాలను గుర్తించగా... వాటిలో విమానాలు, రన్ వేల్లో లోపాలు వంటివీ ఇందులో ఉన్నాయని ఓ ప్రకటనలో తెలిపింది.
By: Tupaki Desk | 24 Jun 2025 9:12 PM ISTఅహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంతో దేశం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విమానాల్లోని లోపాలపై చర్చ నడుస్తోంది. దానికి తగ్గట్లుగా ఆ ప్రమాదం అనంతరం పలు విమానాల్లో అనేక సాంకేతిక లోపాల విషయాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పరిశీలనకు దిగిన డీజీసీఏ తాజాగా సంచలన ప్రకటన వెలువరించింది.
అవును... అహ్మదాబాద్ నుంచి లండన్ బయలు దేరిన ఎయిరిండియా విమానం ఈ నెల 12న ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దేశంలోని ప్రధాన విమానాశ్రయాలను ఇటీవల పరిశీలించింది. ఈ క్రమంలోనే విమానయాన వ్యవస్థల్లో అనేక లోపాలున్నాయని గుర్తించినట్లు తెలిపింది.
డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలోని రెండు బృందాలు ఇటీవల ఢిల్లీ, ముంబయి సహా దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాల్లో సమగ్ర పరిశీలనలు నిర్వహించాయి. ఇందులో భాగంగా.. ఫ్లైట్ ఆపరేషన్స్, ర్యాంప్ సేఫ్టీ, కమ్యూనికేషన్, నేవిగేషన్ సిస్టమ్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ప్రీ-ఫ్లైట్ మెడికల్ ఎవాల్యూయేషన్స్ తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలించాయి.
ఈ సందర్భంగా పలు లోపాలను గుర్తించగా... వాటిలో విమానాలు, రన్ వేల్లో లోపాలు వంటివీ ఇందులో ఉన్నాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో... ఓ విమానాశ్రయంలో అరిగిపోయిన టైర్ల కారణంగా ఓ దేశీయ విమానం నిలిచిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో... విమానాల్లో లోపాలు అనేకసార్లు పునరావృతమైన కేసులు వెలుగుచూశాయని తెలిపారు.
ఇదే క్రమంలో... పలు విమానాల్లో సాఫ్ట్ వేర్ ప్రస్తుత వెర్షన్ కు అప్ డేట్ గా లేదని గుర్తించినట్లు డీజీసీఏ వెల్లడించింది. రెగ్యులర్ పర్యవేక్షణతో పాటు సమస్యల పరిష్కారంలో లోపాలను ఇవి సూచిస్తున్నాయని పేర్కొంది. అదేవిధంగా... ఒక విమానాశ్రయంలో రన్ వే గుర్తులు మసకబారినట్లు, టాక్సీవేలలోని లైటింగ్ సరిగ్గా పనిచేయడం లేదని డీజీసీఏ కనుగొందని తెలుస్తోంది.
సమీపంలో కొత్త నిర్మాణం జరిగినప్పటికీ.. విమానాశ్రయానికి సమీపంలోని భవనాలు, ఇతర నిర్మాణాల గురించి సమాచారం మూడు సంవత్సరాలుగా అప్ డేట్ చేయలేదని డీజీసీఏ ఎత్తి చూపింది. అయితే... లోపాలు వెలుగుచూసిన విమానయాన సంస్థలు, వాటి వివరాలు మాత్రం డీజీసీఏ వెల్లడించలేదు. ఈ ఫలితాలను ఏడు రోజుల్లోపు అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఆపరేటర్లకు తెలియజేయడం జరిగిందని వెల్లడించింది.
