ఎయిరిండియాకు 4 వేల కోట్ల బీమా పరిహారం.. భారత చరిత్రలోనే అతి భారీ..
ఇక ఎయిరిండియా సొంత బీమా సంగతి ఏమిటి? అనే ప్రశ్న సహజం. అంత పెద్ద సంస్థ కాబట్టి బీమా కూడా భారీగానే ఉంటుందని భావించాలి.
By: Tupaki Desk | 17 Jun 2025 6:00 PM ISTగత గురువారం భారత విమానయాన రంగంలో అతి పెద్ద విషాదం... టేకాఫ్ అయిన నిమిషాల్లోనే విమానం కూలిపోవడం.. 270 మంది చనిపోవడం.. ఇదంతా మన దేశంలోనే జరిగిందా? అని ఇంకా కలగానే అనిపిస్తోంది.. ఒక్కో ప్రయాణికుడు.. ఒక్కో కల. ఇలా ఎందరి ఆశలతోనో అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం నిట్టనిలువునా కూలింది.. అంతేకాదు.. ఎందరికో ప్రాణాలు పోయాల్సిన యువ వైద్యుల ప్రాణాలు తీసింది. చనిపోయినవారి కుటుంబాలకు ఎయిరిండియా నిర్వాహక సంస్థ రూ.కోటి పరిహారం ప్రకటించింది. గాయపడినవారి కుటుంబాలకూ పరిహారం ఇస్తామని తెలిపింది.
ఇక ఎయిరిండియా సొంత బీమా సంగతి ఏమిటి? అనే ప్రశ్న సహజం. అంత పెద్ద సంస్థ కాబట్టి బీమా కూడా భారీగానే ఉంటుందని భావించాలి. తాజాగా బయటకు వస్తున్న కథనాల ప్రకారం.. ఎయిరిండియా రూ.4,080 కోట్ల బీమా క్లెయిమ్ పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది భారత విమానయాన చరిత్రలోనే అతి పెద్దదిగా చెబుతున్నారు. ఈ అంచనాను వేసింది ప్రఖ్యాత సంస్థ బ్లూమ్ బర్గ్ కావడం గమనార్హం.
ఎయిరిండియా బీమా కవరేజీ అందించిన వాటిలో జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. ఈ సంస్థ ఎండీ రామస్వామి నారాయణన్ కూడా ఎయిరిండియా క్లెయిన్ భారత దేశ చరిత్రలో అతిపెద్ద బీమా క్లెయిమ్ లలో ఒకటి అని పేర్కొనడం గమనార్హం. రూ.4 వేల కోట్లు (475 మిలియన్ డాలర్లు)లో 125 మిలియన్ డాలర్లు (రూ.1,075 కోట్లు) విమాన హాల్-ఇంజిన్ కు, రూ.3,014 కోట్లు (350 మిలియన్ డాలర్లు) ప్రయాణికులు, ఇతరులకు ప్రాణ నష్టం జరిగినందుకు అదనపు క్లెయిమ్.
వీటిలో హాల్ క్లెయిమ్ ను ముందుగా బీమా సంస్థలు పరిష్కరిస్తాయి. మిగతావాటికి కొంత సమయం పడుతుంది. ఇక ఈ పరిహారం మొత్తం రెండేళ్ల కిందట భారత విమానయాన పరిశ్రమ మొత్తం బీమా ప్రీమియం కంటే మూడు రెట్లు ఎక్కువ. ఇక అహ్మదాబాద్ ప్రమాదం తాలూకు ఆర్థిక భారం ప్రపంచ విమానయాన ఇన్సూరెన్స్, రీ ఇన్సూరెన్స్ మార్కెట్ ను బలంగా తాకడం ఖాయం. మున్ముందు భారత విమానయానం రంగంలో బీమా ప్రీమియంలు పెరుగుతాయని, లేదా పాలసీల రెన్యువల్ సమయంలో పెరుగుతాయని పేర్కొంటున్నారు.
ఇక ఎయిరిండియా ప్రమాదంలో చనిపోయినవారిలో విదేశీయులు గణనీయంగా కూడా ఉండడం బీమా క్లెయిమ్ ల మొత్తాన్ని ప్రభావితం చేసింది. వీరి స్వదేశాలలోని చట్టాల ప్రకారం బీమా క్లెయిమ్ లెక్కిస్తారు.
ఇక ఎయిరిండియా విమాన ప్రమాదం భారత బీమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం అంటున్నారు.
