Begin typing your search above and press return to search.

విమాన ప్రమాద దర్యాప్తు టీమ్ లోకి కొత్త మెంబర్.. ఎవరీ కెప్టెన్!

అవును... ఎయిరిండియా విమాన ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో పైలట్లకు భాగస్వామ్యం కల్పించాలని ఏఎల్ఎఫ్ఏ వ్యాఖ్యానించిన నేపథ్యంలో... ఏఏఐబీ కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించింది!

By:  Tupaki Desk   |   22 July 2025 6:00 AM IST
విమాన ప్రమాద దర్యాప్తు టీమ్  లోకి కొత్త మెంబర్.. ఎవరీ కెప్టెన్!
X

అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన మరుసటి రోజు నుంచే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో ఘటన జరిగిన సరిగ్గా నెల రోజుల తర్వాత ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. అయితే ఈ నివేదికపై భారత ఎయిర్ లైన్ పైలట్ల సంఘం (ఏఎల్ఎఫ్ఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇందులో భాగంగా.. ఈ నివేదికపై బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఏ అధికారి సంతకం లేదని మొదలుపెట్టిన ఏఎల్ఎఫ్ఏ.. ఈ దర్యాప్తులో ఎటువంటి పారదర్శకత కనిపించలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో... ఈ దర్యాప్తులో నిపుణులైన మరీ ముఖ్యంగా లైన్‌ పైలట్లు భాగం కాలేదని అని ఏఎల్ఎఫ్ఏ అధ్యక్షుడు సామ్‌ థామస్ అన్నారు. ఈ నేపథ్యంలో ఓ కీలక పరిణామం జరిగింది.

అవును... ఎయిరిండియా విమాన ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో పైలట్లకు భాగస్వామ్యం కల్పించాలని ఏఎల్ఎఫ్ఏ వ్యాఖ్యానించిన నేపథ్యంలో... ఏఏఐబీ కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించింది! దీంతో.. ఎయిరిండియాలో గతంలో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ గా పనిచేసిన మాజీ పైలట్ కెప్టెన్ ఆర్‌ఎస్‌ సంధును దర్యాప్తు బృందంలో 'డొమైన్ ఎక్స్ పర్ట్'గా చేరాలని ఏఏఐబీ కోరిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో దీనికి సంధు అంగీకరించారని అంటున్నారు. కాగా.. వైమానిక రంగంలో విశేషానుభవం ఉన్న నిపుణుడిగా (డొమైన్ ఎక్స్ పర్ట్)గా ఆర్‌ఎస్‌ సంధుకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎయిరిండియాలో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన ఆయన.. విమానయాన పరిశ్రమలో సుమారు 39 ఏళ్ల వృత్తిపరమైన అనుభవం కలిగి ఉన్నారు. ఎయిరిండియాలో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ హోదాలోనూ సేవలందించారు.

ప్రత్యేకించి 2013లో బోయింగ్ 787-8 విమానాల డెజిగ్నేటెడ్ ఎగ్జామినర్ గా సంధు వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన "ఏవియాజియోన్" పేరుతో ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నారు.