1:38:39 నుంచి 1:39:11... ఆ 32 క్షణాల్లో ఏ క్షణం ఏమి జరిగిందంటే..!
ఇందులో భాగంగా... జూన్ 12 ఉదయం 11:17 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి అహ్మదాబాద్ లో ల్యాడ్ అయినప్పటి నుంచి మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై తొమ్మిది నిమిషాల పదకొండు సెకన్ల వరకూ ఏమి జరిగిందనేది వివరించింది.
By: Tupaki Desk | 12 July 2025 10:30 AM ISTజూన్ 12 అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన దేశ చరిత్రలో మరిచిపోని దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. టెకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం ఒక్కసారిగా కూలిపోయిన ఈ ఘటనలో 260 మంది మృతి చెందడంతో.. యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఈ సమయంలో ఈ ఎయిరిండియా విమాన దుర్ఘటన పై ప్రాథమిక నివేదిక బహిర్గతమైంది.
ఈ సమయంలో 'ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో' (ఏఏఐబీ) తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఇందులో భాగంగా... విమాన ఇంజిన్ల ఇంధన కంట్రోల్ స్విచ్ లు ఆగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటన చోటుచేసుకోవడానికి ముందు కాక్ పిట్ లో ఏ క్షణానికి ఏం జరిగిందన్న వివరాలు ఇప్పుడు చూద్దామ్..!
అవును... అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ఘోర ప్రమాదానికి సంబంధించి ఏఏఐబీ ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఇందులో భాగంగా... జూన్ 12 ఉదయం 11:17 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి అహ్మదాబాద్ లో ల్యాడ్ అయినప్పటి నుంచి మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై తొమ్మిది నిమిషాల పదకొండు సెకన్ల వరకూ ఏమి జరిగిందనేది వివరించింది.
* మధ్యాహ్నం 1:10:38 గంటలు:- అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లోని బే34 నుంచి విమానం బయల్దేరేందుకు సిద్ధమైంది.
* మధ్యాహ్నం 1:25:15 గంటలు:- ట్యాక్సీ క్లియరెన్స్ కోరగా.. అందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతించింది. ఈ క్రమంలో... విమానం బే34 నుంచి ఆర్4 ట్యాక్సీవే మార్గంలో 23వ రన్ వే పైకి చేరుకుంది. టేకాఫ్ కు సిద్ధమైంది.
* మధ్యాహ్నం 1:32:03 గంటలు:- విమానం గ్రౌండ్ నుంచి టవర్ కంట్రోల్ కు మారింది.
* మధ్యాహ్నం 01:37:33 గంటలు:- పైలట్ లకు టేకాఫ్ క్లియరెన్స్ జారీ అయ్యింది.
* మధ్యాహ్నం 01:37:37 గంటలు:- విమానం టేకాఫ్ ప్రారంభించింది.
* మధ్యాహ్నం 01:38:39 గంటలు:- విమానం గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్ లోకి మారాయి. దీంతో విమానం గాల్లోకి లేచి, ప్రయాణం ప్రారంభించింది.
* మధ్యాహ్నం 01:38:42 గంటలు:- విమానం గరిష్ఠ వేగమైన 180 నాట్స్ ను అందుకుంది. ఆ మరుక్షణమే ఇంజిన్ 1, ఇంజిన్ 2కు చెందిన ఇంధన స్విచ్ లు 'రన్' నుంచి 'కటాఫ్' పొజిషన్ కు మారాయి. ఒక సెకను తేడాతో ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి.
దీంతో... ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది. ఫలితంగా ఇంజిన్లు రెండూ టేకాఫ్ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి. ఈ సమయంలోనే స్విచ్ లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించారు. తాను చేయలేదని మరో పైలట్ సమాధానమిచ్చారు.
* మధ్యాహ్నం 01:38:47 గంటలు:- మొదటి ఇంజిన్ ఇంధన స్విచ్ 'కటాఫ్' నుంచి మళ్లీ 'రన్'కు మారింది.
* మధ్యాహ్నం 01:38:56 గంటలు:- రెండో ఇంజిన్ ఇంధన స్విచ్ కూడా 'కటాఫ్' నుంచి మళ్లీ 'రన్'కు మారింది.
ఈ సమయంలో ఇంధనం వచ్చి థ్రస్ట్ రికవరీ అవుతుంది. ఈ విమానంలో మొదటి ఇంజిన్ తిరిగి ఆన్ అవడం ప్రారంభించింది. కానీ, రెండో ఇంజిన్ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకునేలా చేయలేకపోయింది!
* మధ్యాహ్నం 01:39:05 గంటలు:- పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్ 'మేడే.. మేడే.. మేడే..' అనే సందేశాన్ని పంపించారు.
* మధ్యాహ్నం 01:39:11 గంటలు:- డేటా రికార్డింగ్ ఆగిపోయింది.. మరుక్షణమే విమానం రన్ వేకు కేవలం 0.9 నాటికల్ మైళ్ల దూరంలోని సమీపంలోని మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాలపై కూలిపోయింది!
