Begin typing your search above and press return to search.

భయంతో బాల్కనీ నుంచి దూకిన విద్యార్థులు.. విమాన ప్రమాదం నాటి వీడియో!

జూన్ 12న అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్టేడియం నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Jun 2025 4:16 PM IST
భయంతో బాల్కనీ నుంచి  దూకిన విద్యార్థులు.. విమాన ప్రమాదం నాటి వీడియో!
X

జూన్ 12న అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్టేడియం నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టెకాఫ్ అయిన కొద్దిక్షణాల్లోనే కుప్పకూలి అగ్నిగోళంలా మారిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోనివారు 241 మంది, బయట జనావాసాల్లో ఉన్న మరో 33 మంది మృతి చెందారు.

242 మంది ఉన్న విమానంలో ఒకేఒక్క ప్రయాణికుడు గాయాలతో బయటపడగా.. విమానం కూలిన చోట ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్ లోని విద్యార్థులు సుమారు 33 మంది మృతి చెందినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఈ ఘటనకు సంబంధించిన మరో వీడియో తెరపైకి వచ్చింది. విమానం కూలిన అనంతరం ప్రాణభయంతో బాల్కనీ నుంచి దూకుతున్న విద్యార్థులు అందులో కనిపించారు.

అవును... జూన్ 12 మధ్యాహ్నం 1:39 గంటల ప్రాంతంలో 232 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలెట్లతో అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ విమానం సరిగా బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కుప్పకూలింది. దీంతో.. ఆ భవనంలోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు రెండు, మూడు అంతస్తుల్లోని బాల్కనీల నుంచి బెడ్ షీట్లు, తాళ్ల సాయంతో కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమానం కూలిన అనంతరం పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ భవనానికి ఒకవైపు చెలరేగగా.. వీరు మరోవైపు బాల్కనీ నుంచి బయటకు దూకుతున్నారు.

కాగా... ఈ విమాన ప్రమాధం మధ్యాహ్న సమయంలో జరగడంతో చాలా మంది విద్యార్థులు హాస్టల్ లో భోజనం చేస్తుండగానే మృతి చెందినట్లు చెబుతున్నారు. టెబుల్స్ పై భోజనంతో ఉన్న ప్లేట్లు అలానే ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి! ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు కాకుండా.. జనావాసాల్లో ఉన్న 33 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది.