అహ్మదాబాద్ విమాన ప్రమాదం: మీరా చోప్రా ఫైర్.. నెటిజన్ల కౌంటర్
మీరా చోప్రా తన ట్వీట్‌లో "ఎయిరిండియా వైఖరి చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది. నా భర్త జూన్ 15న ఎయిరిండియాలో దుబాయ్‌కు ప్రయాణించాల్సి ఉంది.
By: Tupaki Desk | 13 Jun 2025 5:41 PM ISTఅహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మనిషి ప్రాణం నిమిషాల్లో ఎలా గాలిలో కలిసిపోతుందో కళ్లముందు కదలాడిన ఈ ఘటన, విమాన ప్రయాణాల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఈ విషాద ఘటన అనంతరం పలువురు విమాన ప్రయాణం చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
ఈ దుర్ఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ మీరా చోప్రా భర్త కూడా తన విమాన టికెట్‌ను రద్దు చేసుకున్నారు. జూన్ 15న దుబాయ్‌కి ఎయిరిండియా విమానంలో వెళ్లాల్సి ఉన్న ఆయన, అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భద్రతపై నమ్మకం కోల్పోవడంతో ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎయిరిండియా తమ టికెట్ డబ్బులను తిరిగి ఇవ్వడానికి నిరాకరించిందని మీరా చోప్రా ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్స్ సిబ్బంది తీరుపై ఆమె తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.
మీరా చోప్రా తన ట్వీట్‌లో "ఎయిరిండియా వైఖరి చాలా దిగ్భ్రాంతికరంగా ఉంది. నా భర్త జూన్ 15న ఎయిరిండియాలో దుబాయ్‌కు ప్రయాణించాల్సి ఉంది. భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో మేము ప్రయాణం రద్దు చేసుకోవాలనుకున్నాం. కానీ ఎయిర్ ఇండియా వారికి ఎటువంటి సలహా రాలేదని పేర్కొంటూ టికెట్ ధర మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి నిరాకరించింది. ప్రముఖ టాటా గ్రూప్ నడుపుతున్న మన జాతీయ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాను నడపడంలో మేమందరం గర్వపడ్డాం. కానీ ఈ రోజు ఏమి జరిగిందో మనం చూశాం. ఇప్పుడు వారు విమానాలు ఎలా నిర్వహిస్తున్నారో తీవ్ర నిరాశపరిచింది. ఈ ఘటన వారికి సిగ్గుచేటు. ఈ ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఎయిరిండియా వీటిని అస్సలు పట్టించుకోదు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే మీరా చోప్రా టికెట్ రీఫండ్ చేయమని అడగడంపై నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. టికెట్ రద్దు విధానాన్ని ముందుగా చదువుకోవాలని ఆమెకు సలహాలిచ్చారు. "నిబంధనల ప్రకారం మీరు విమాన సమయాన్ని మార్చినట్లయితే రద్దు చేసి డబ్బులిస్తారని" ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. "నిబంధనలకు విరుద్ధంగా మీ సొంత కారణాలతో టికెట్ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని" మరో నెటిజన్ మీరాకు కౌంటరిచ్చారు.
కాగా, గురువారం జరిగిన ఎయిరిండియా ప్రమాదంలో ఒక్కరు మినహా 241 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాద ఛాయలు నింపింది.
