Begin typing your search above and press return to search.

మరో ఏడాదిలో ఏఐ మనుషుల్ని దాటేస్తుందా? ఆంత్రోపిక్ సీఈవో మాటల్లో నిజమెంత?

ఆంత్రోపిక్ సంస్థ సీఈవో డారియో అమోడీ ఇటీవలే "మరో ఏడాదిలో ఏఐ మనుషుల్ని దాటేస్తుంది. 2030 నాటికి సగం వైట్-కాలర్ ఉద్యోగాలు మాయమవుతాయి.

By:  A.N.Kumar   |   18 July 2026 6:00 PM IST
మరో ఏడాదిలో ఏఐ మనుషుల్ని దాటేస్తుందా? ఆంత్రోపిక్ సీఈవో మాటల్లో నిజమెంత?
X

ఆంత్రోపిక్ సంస్థ సీఈవో డారియో అమోడీ ఇటీవలే "మరో ఏడాదిలో ఏఐ మనుషుల్ని దాటేస్తుంది. 2030 నాటికి సగం వైట్-కాలర్ ఉద్యోగాలు మాయమవుతాయి. ఆంత్రోపిక్ చీఫ్ ఇంజనీర్ రెండు నెలలుగా ఒక్క లైన్ కోడ్ కూడా రాయలేదు" అంటూ వ్యాఖ్యానించడం సాఫ్ట్ వేర్ రంగంలో గుబులు రేకెత్తించింది.. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముంది? కాస్త లోతుగా పరిశీలిస్తే ఇందులో కొన్ని నిజాలు, మరికొన్ని అర్ధసత్యాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

మనల్ని అధిగమించడానికి 1-2 ఏళ్లే.. ఇది నిజమేనా?

అవును ఇది నిజమే. 2026 జనవరిలో డారియో అమోడీ రాసిన “సాంకేతికత కౌమారదశ” అనే సుదీర్ఘ వ్యాసంలో ఈ విషయాలను ప్రస్తావించారు. 2027 నాటికే నోబెల్ గ్రహీతల కంటే తెలివైన ఏఐ వ్యవస్థలు రావొచ్చని, మానవ మేధస్సును ఏఐ దాటేయడానికి కేవలం ఒకటి రెండేళ్ల సమయం మాత్రమే ఉందని ఆయన అంచనా వేశారు.

అయితే ఇది పరిశ్రమలో అందరి అభిప్రాయం కాదు. గూగుల్ డీప్‌మైండ్ సీఈవో డెమిస్ హసాబిస్ దీనిపై స్పందిస్తూ... ఈ దశాబ్దంలో మనిషి స్థాయి ఏఐ వచ్చే అవకాశం 50% మాత్రమే ఉందని చాలా జాగ్రత్తగా మాట్లాడారు. అమోడీ నడుపుతున్న ఆంత్రోపిక్ కంపెనీ విలువ ప్రస్తుతం $350 బిలియన్లు కావడంతో తన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసమే ఆయన ఇలాంటి హైప్ క్రియేట్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.

2030 నాటికి సగం ఎంట్రీ-లెవెల్ ఉద్యోగాలు మాయం?

ఈ వ్యాఖ్య కూడా అమోడీ చేసినదే. 2025 మే నెలలో యాక్సియోస్ ఇంటర్వ్యూలోనూ ఆ తర్వాత 2026 ఫిబ్రవరిలోనూ ఆయన ఈ హెచ్చరికను పునరుద్ఘాటించారు. వచ్చే ఐదేళ్లలో ఎంట్రీ-లెవెల్ వైట్-కాలర్ ఉద్యోగాల్లో 50% వరకు తగ్గిపోవచ్చని.. నిరుద్యోగం 10-20% పెరగొచ్చని ఆయన పేర్కొన్నారు.

దీనికి మద్దతుగా కొన్ని గణాంకాలు కూడా ఉన్నాయి. 'సిగ్నల్‌ఫైర్' నివేదిక ప్రకారం బిగ్ టెక్ కంపెనీల్లో ఫ్రెషర్స్ నియామకాలు దాదాపు 50% తగ్గాయి. అయితే ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ వంటి ప్రముఖులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతుందే తప్ప ఉద్యోగాలు పోవని వారి వాదన. అలాగే కంపెనీలు తమ అంతర్గత కారణాలతో చేసే లేఆఫ్‌లను కూడా ఏఐ పైకి నెట్టేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.

క్లాడ్ కోడ్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న బోరిస్ చెర్నీ 2026 జూన్ ఫార్చ్యూన్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. తాను దాదాపు ఎనిమిది నెలలుగా చేతితో ఒక్క లైన్ కోడ్ కూడా రాయలేదని, వందల సంఖ్యలో ఏఐ ఏజెంట్లను నిర్వహించడమే తన పని అని చెప్పారు. అంటే ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పని పూర్తిగా పోలేదు, కేవలం కోడింగ్ రాసే విధానం మారి ఏఐ ఏజెంట్లను మేనేజ్ చేసే స్థాయికి రూపాంతరం చెందింది.

ఆందోళనా? మార్కెటింగా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మూడు వ్యాక్యాలలో మొదటి రెండు డారియో అమోడీ సొంత అంచనాలు కాగా, మూడోది పూర్తిగా వేరే వ్యక్తి బోరిస్ చెర్నీ చేసిన వ్యాఖ్య. వేర్వేరు సందర్భాల్లో వచ్చిన భిన్న అభిప్రాయాలను కలిపేసి, ఒకే వ్యక్తి ఖాతాలో వేయడం వల్ల సోషల్ మీడియాలో ఇది ఒక సంచలనంగా మారింది. సాంకేతికత వేగంగా మారుతున్న మాట నిజమే అయినా, ఇలాంటి వైరల్ కోట్స్‌ వెనుక ఉన్న పూర్తి వాస్తవాలను తెలుసుకోవడం ముఖ్యం.