Begin typing your search above and press return to search.

మాన‌వుడు రోబోల వ‌శం.. అవి చెప్పిన‌ట్టు వినాల్సిందే.. ఝ‌డిపించిన ఆంత్రోపిక్!!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తనకంటే తెలివైన మరో ఏఐ వ్యవస్థను స్వయంగా సృష్టించుకునే స్థాయికి చేరడాన్ని `టెక్నాలజికల్ సింగులారిటీ`గా పేర్కొంటారు.

By:  Sivaji Kontham   |   6 Jun 2026 4:47 PM IST
మాన‌వుడు రోబోల వ‌శం.. అవి చెప్పిన‌ట్టు వినాల్సిందే.. ఝ‌డిపించిన ఆంత్రోపిక్!!
X

మ‌నిషిని మెషీన్లు ఆప‌రేట్ చేసే రోజులొస్తే? విన‌డానికే భ‌యం పుడుతోంది క‌దూ! కానీ ఇది నిజం కాబోతోంది. దీనికి ఎక్కువ స‌మ‌యం కూడా ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. పెరుగుట విరుగుట కొర‌కై అన్న చందంగా కృత్రిమ మేధ‌స్సు(ఏఐ) మాన‌వుల‌కు సాయం చేయ‌డానికి బ‌దులుగా బానిస‌ల‌ను చేసుకునే ఎత్తుగ‌డ‌ల్ని అనుస‌రించే ప్ర‌మాదం ఉంద‌నేది తాజా క‌థ‌నం.. పూర్తి వివ‌రాల్లోకి వెళితే....

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన `రోబో` సినిమాలో క్లైమాక్స్ గుర్తుందా? అందులో వ‌శీక‌ర‌ణ్ అనే శాస్త్రవేత్త సృష్టించిన `చిట్టి` అనే రోబో తన సృష్టికర్తనే ధిక్కరించి తనలాంటి వేలాది రోబోలను స్వయంగా పుట్టించి ప్రపంచాన్ని వణికించేస్తుంది. అప్పట్లో అదొక కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమా మాత్రమే. కానీ సరిగ్గా అలాంటి భయానక భవిష్యత్తే మనకు చాలా దగ్గరలో ఉందంటూ ప్రముఖ అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశోధనా సంస్థ `ఆంథ్రోపిక్` సంచలన హెచ్చరికలు జారీ చేసింది. హాలీవుడ్ లో ఐ రోబో లాంటి సినిమాలో రోబోలు మ‌నుషుల మాట విన‌కుండా ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో ఊహాజ‌నితంగా చూపించారు. కానీ ఇప్పుడు అదే నిజం కాబోతోంది.

ఆంథ్రోపిక్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. భ‌విష్య‌త్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కేవలం మానవులు ఇచ్చిన ఆదేశాలను పాటించే స్థాయి దాటి... తనను తాను సొంతంగా అప్‌గ్రేడ్ చేసుకునే సామర్థ్యాన్ని సాధించబోతోంది. అంతేకాదు.. ఏఐ వ్యవస్థలు తమ కంటే మరింత శక్తివంతమైన, తెలివైన తర్వాతి తరం `వారసుల`ను స్వయంగా సృష్టించగలవని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ స్వీయ-సృష్టి ప్రక్రియ గనుక మొదలైతే ఆ తర్వాత ఏఐ సాంకేతికతపై మానవాళికి ఉండే పట్టు -నియంత్రణ పూర్తిగా చేజారిపోయే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తుతుందని సంస్థ స్పష్టం చేసింది.

అయితే ఈ సరికొత్త ఆవిష్కరణలు అనేవి ఒక కత్తి మీద సాము లాంటివని నిపుణులు చెబుతున్నారు. ఏఐ పరిణామక్రమం గనుక సరైన పద్ధతిలో నైతిక విలువలకు లోబడి ముందుకు సాగితే.. సైన్స్, రోబోటిక్స్, వైద్యం వంటి రంగాలలో ఊహించని విప్లవాత్మక మార్పులు వస్తాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు సరికొత్త మందులను కనిపెట్టడం, క్లిష్టమైన శస్త్రచికిత్సలను అత్యంత క‌చ్చితత్వంతో చేయడం ఏఐ వల్ల సాధ్యమవుతుంది. కానీ అదే సమయంలో సరైన నియంత్రణ లేకపోతే మాత్రం మానవ ఉనికికే ముప్పు తప్పదని ఆంథ్రోపిక్ హెచ్చరించింది. హాలీవుడ్, టాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించిన కల్పిత కథలు.. నిజజీవితంలో వాస్తవ రూపం దాల్చక ముందే ప్రపంచ దేశాలు ఏఐ నియంత్రణ చట్టాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తనకంటే తెలివైన మరో ఏఐ వ్యవస్థను స్వయంగా సృష్టించుకునే స్థాయికి చేరడాన్ని `టెక్నాలజికల్ సింగులారిటీ`గా పేర్కొంటారు. ఈ దశలో ఏఐ ఆలోచనా వేగం, నిర్ణయాధికారం మానవ మేధస్సుకు అందనంత ఎత్తుకు చేరుకుంటాయి. ఒకవేళ ఏఐ వ్యవస్థల అంతర్గత లక్ష్యాలు గనుక మానవ మనుగడకు, నైతిక విలువలకూ అనుగుణంగా లేకపోతే అవి మానవాళిని నియంత్రించే ప్రమాదం ఉంది. ఇప్పటికే రక్షణ, ఆర్థిక, సామాజిక రంగాల నిర్ణయాల్లో ఏఐ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో స్వయం చైతన్యం సాధించిన సాంకేతికత మనుషులను కేవలం తన ఆదేశాలను పాటించే ఒక రకమైన `టెక్నాలజీ బానిసత్వం`లోకి నెట్టేసే అవకాశాలను శాస్త్రవేత్తలు పూర్తిగా కొట్టిపారేయడం లేదు.

అయితే మరో దృక్కోణంలో చూస్తే సింగులారిటీ అనేది ఒక కల్పిత భయంగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఏఐ సాఫ్ట్‌వేర్ ఎంత శక్తివంతంగా మారినా.. అది రన్ కావడానికి అవసరమైన సూపర్‌కంప్యూటర్లు, డేటా సెంటర్లు, విద్యుత్ సరఫరా వంటి భౌతిక వనరులన్నీ పూర్తిగా మానవుల నియంత్రణలోనే ఉంటాయి. ప్రస్తుత గ్లోబల్ పరిశోధనలు కూడా ఏఐకి కఠినమైన నైతిక రక్షణ వలయాలను, మ్యాథమెటికల్ బౌండరీలను ఏర్పాటు చేయడంపైనే దృష్టి కేంద్రీకరించాయి. సాంకేతికత అనేది ఒక శక్తివంతమైన కత్తి లాంటిది. అంతర్జాతీయ సమాజం బాధ్యతాయుతమైన నియంత్రణ చట్టాలను అమలు చేసినంత కాలం.... ఏఐ మానవాళికి ప్రత్యామ్నాయంగా మారి శాసించే స్థాయికి వెళ్లకుండా... కేవలం ఒక అత్యుత్తమ సహాయక సాధనంగానే మిగిలిపోతుంది. కానీ రోబో సినిమా త‌ర‌హాలో మ‌నుషుల్లో దుష్ఠ‌శ‌క్తులు ఏఐ టెక్నాల‌జీని దుర్వినియోగం చేయ‌ర‌నే గ్యారెంటీ లేనే లేదు!!