Begin typing your search above and press return to search.

అర్థనగ్న నిరసనపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. దేశ ప్రతిష్ట తీశారంటూ బెయిల్ కు నో!

బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దేశ ప్రతిష్టను దెబ్బ తీసేలా అర్థనగ్న నిరసన చేపడతారా? అంటూ మండి పడింది.

By:  Garuda Media   |   24 Feb 2026 1:17 PM IST
అర్థనగ్న నిరసనపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. దేశ ప్రతిష్ట తీశారంటూ బెయిల్ కు నో!
X

బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దేశ ప్రతిష్టను దెబ్బ తీసేలా అర్థనగ్న నిరసన చేపడతారా? అంటూ మండి పడింది. భారత దౌత్య ప్రతిష్టను దెబ్బ తీసేలా నిరసన ఉందని పేర్కొంటూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నో చెప్పింది. ఇదంతా.. గడిచిన వారంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఏఐ సమిట్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేతలు నిర్వహించిన నిరసన సందర్భంగా అరెస్టు అయిన వారి విషయంపై మండిపడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలను విచారణ కోసం ఐదు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు శనివారం అనుమతించింది. అదే సమయంలో బెయిల్ కు ససేమిరా అని తేల్చేసింది.

బెయిల్ పిటిషన్ పై జరిగిన వాదనల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నిరసనను పబ్లిక్ ఆర్డర్ పై జరిగిన కఠోరమైన దాడిగా అభివర్ణించిన కోర్టు.. ఇది ప్రజాస్వామ్యబద్ధమైన అసమ్మతి కాదని.. అంతర్జాతీయ ప్రతినిధుల ముందు దేశ దౌత్య ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉందని పేర్కొంది. అదే సమయంలో అరెస్టు అయిన నలుగురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు ఐదు రోజుల పోలీస్ కస్టడీని విధిస్తూ నిర్ణయించింది. అదే సమయంలో బెయిల్ పిటిషన్ ను రిజెక్టు చేసింది.

ఇటీవల ఏఐ సమిట్ సందర్భంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నలుగురు చొక్కాలు విప్పి నిరసన తెలియజేశారు. అది కూడా భారత్ - అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా దీన్ని నిర్వహించారు. వీరు మోడీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలు ఉన్న టీ షర్టులు ధరించి.. ఎగ్జిబిషన్ హాల్ లోపల చొక్కాలు విప్పి నిరసన తెలపటంతో గందరగోళం చోటు చేసుకుంది. ఈ నిరసనను తెలిపిన వారిలో

తెలంగాణకు చెందిన నరసింహ యాదవ్

యూపీకి చెందిన అజయ్ కుమార్

బిహార్ కు చెందిన కృష్ణ హరి

బిహార్ కు చెందిన కుందన్ యాదవ్ లు ఉన్నారు. ఈ నేపథ్యంలో నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దీని వెనుక ఏమైనా అంతర్జాతీయ కుట్ర ఉందా? అన్న కోణంలో విచారిస్తున్నారు. అదే సమయంలో ఆర్థిక సహాయం, డిజిటల్ ప్లానింగ్ ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో పలు అంశాల మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ సదస్సులో అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాలు.. విధానకర్తలు పొల్గొన్న నేపథ్యంలో న్యాయస్థానం సైతం దీన్ని ప్రత్యేక కేసుగా చూస్తున్నట్లుగా చెప్పాలి. కఠినంగా వ్యవహరించినట్లుగా కనిపిస్తున్న పరిస్థితి. నిందితులు దూర ప్రాంతాలకు చెందిన వారుకావటంతో.. వారు పరారయ్యే అవకాశం ఉందని భావించిన కోర్టు వారికి బెయిల్ ఇచ్చేందుకు నో చెప్పేసింది.

తొలుత నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా గ్వాలియర్ లో ఐదో నిందితుడు జితేంద్ర యాదవ్ ను అరెస్టు చేశారు. దీంతో ఈ ఉదంతంలో అరెస్టు చేసిన వారి సంఖ్య ఏడుకు చేరుకుందని చెప్పాలి. నఈ నిరసన వెనుక భారీ కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేపాల్ లో మాదిరి జెన్ జెడ్ ఆందోళనల్ని స్ఫూర్తిని తీసుకొని ప్లాన్ చేసినట్లుగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఈ అంశాన్ని పోలీసులే కాదు.. కోర్టులు సైతం తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యబద్ధమైనదే అయినప్పటికి అంతర్జాతీయ వేదికపై ఇలాంటి ప్రవర్తన వల్ల అది చట్టబద్ధమైన అసమ్మతి పరిధిని దాటినట్లుగా పేర్కొంది.

ఈ నిరసన అనుకోకుండా.. అప్పటికప్పుడు జరిగింది కాదన్న అనుమానాల్ని బలపర్చేలా పరిణానమాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. నిరసనకారులు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకొని లోపలికి వెళ్లాక తమ ప్లాన్ ను అమలు చేసిన తీరును ముందస్తు కుట్రగా కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలు దేశ భద్రతకు.. శాంతి భద్రతలకు పెద్ద ముప్పుగా పేర్కొంది. ఈ ఉదంతంపై నిందితులపై నమోదైన కేసుల్ని ఏయే సెక్షన్ల కింద నమోదు చేశారంటే..

- సెక్షన్ 61(2): నేరపూరిత కుట్ర

సెక్షన్ 121(1): ప్రభుత్వ ఉద్యోగి తన విధిని అడ్డుకోవడం.

సెక్షన్ 132: ప్రభుత్వ ఉద్యోగిపై దాడి/నేరపూరిత బలప్రయోగం.

సెక్షన్ 221: ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడం.

సెక్షన్ 329: ఫోర్జరీ చేసిన పత్రాలను అసలైనవిగా ఉపయోగించడం (లోపలికి వెళ్లేందుకు వారు వాడిన క్యూఆర్ కోడ్‌ల కోసం).

నిరసన వ్యవహారం మొత్తం కుట్ర కోణంలో సాగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.ఇందులో భాగంగా వారి నుంచి స్వాధీనం చేసుకున్న స్మార్ట్ ఫోన్లను విశ్లేషిస్తున్నారు. ప్రాధమికంగా ఈ నిరసన ప్రణాళికకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు.. గూగుల్ మ్యాప్స్ లొకేషన్లను పోలీసులు గుర్తించారు. సమిట్ లోపలకు ప్రవేశించటానికి వీరు వాడిన ఫోర్జరీ క్యూఆర్ కోడ్ లు.. ఐడీ కార్డులు ఈ ఫోన్ల ద్వారానే క్రియేట్ చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. మరో కీలక అంశం ఏమంటే.. నేపాల్ లో జరిగిన జెన్ జెడ్ ఆందోళనల వీడియోలు.. ఆ టెక్నిక్స్ ను ఎలా అమలు చేయాలనే వివరాలు ఉన్నట్లుగా కోర్టుకు పోలీసులు తెలిపారు. ఈ అంశంపై మరింత లోతైన విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపారు. దీనిపై రిపోర్టు వస్తే.. మరింత సమాచారం అందుతుందని భావిస్తున్నారు.