ఏఐ విధ్వంసం.. వందేళ్లలో చూడని పరిస్థితి వస్తుందంటున్న బిల్‌గేట్స్, ఒబామా
బిజినెస్ మేనేజ్ మెంట్ నుంచి ఆరోగ్యం, విద్య, వినియోగాదారుల సేవల వరకు ప్రతి రంగంలోనూ ఏఐ ఆధారిత ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తోంది.
By: Tupaki Desk | 21 April 2025 10:45 PM ISTఈ సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పెను మార్పును తీసుకొస్తుంది. బిజినెస్ మేనేజ్ మెంట్ నుంచి ఆరోగ్యం, విద్య, వినియోగాదారుల సేవల వరకు ప్రతి రంగంలోనూ ఏఐ ఆధారిత ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తోంది. పనులు శరవేగంగా పూర్తవుతున్నప్పటికీ దీనివల్ల ఉద్యోగ భద్రత మీద తీవ్రమైన ఆందోళనలు నెలకొన్నాయి. తాజాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వంటి ప్రపంచ స్థాయి నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఏఐ కారణంగా కోట్లాది మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని, తద్వారా నిరుద్యోగం భారీగా పెరిగే అవకావిం ఉందని వారు హెచ్చరించారు. వారి ఆందోళనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
టెక్నాలజీ దిగ్గజం బిల్ గేట్స్ మాట్లాడుతూ.. "ఇది ఏఐ యుగం.. సమాజం దృక్కోణాన్ని సమూలంగా మార్చే శకం. ఇప్పటివరకు గొప్ప గొప్ప డాక్టర్లు, టీచర్ల మేధ అద్భుతం అని కొనియాడాం. కానీ, ఏఐ రాకతో రాబోయే దశాబ్ద కాలంలో వీరికి ఉండే జ్ఞానం ఉచితంగా, అందరికీ అందుబాటులో ఉంటుంది" అని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు, మానసిక ఆరోగ్య నిపుణుల కొరతను ఏఐ తీర్చగలదని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐ అందించే వైద్య సలహాలు , బోధనా తరగతులు చాలా మందికి ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. "ఇదంతా పక్కనబెడితే.. మరి ఉద్యోగాల సంగతేంటీ? కనీసం వారానికి రెండు, మూడు రోజులైనా పని చేయగలమా?" అని ఆయన ప్రశించారు. ఏఐ కొన్ని సమస్యలను పరిష్కరిస్తున్నప్పటికీ ఉద్యోగాల భవిష్యత్తుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ కొత్త ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని ఆయన అంగీకరించారు.
అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏఐ విస్తృత ప్రభావాన్ని గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "సాంకేతికత పెరిగే కొద్దీ.. ఏఐ మరింత ప్రభావవంతంగా, వేగంగా అందుబాటులోకి వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆటోమేషన్‌కు అడ్వాన్స్‌డ్ వెర్షన్. అయితే, కేవలం తయారీ రంగాన్ని మాత్రమే ఆటోమేటిక్ చేయట్లేదు. రోబో చేతులను ఉపయోగించినట్లు కాదు. ఉన్నత స్థాయి మేధోపరంగానూ అనేక పనులు చేస్తోంది" అని ఆయన అన్నారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ డెవలపర్లు చేసే 70 శాతం పనులను ఏఐ చేయగలదని ఆయన అంచనా వేశారు. ఏఐ విస్తృతమైన వినియోగం సమాజంలో తీవ్రమైన ఆర్థిక, సామాజిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందంటూ ఆయన హెచ్చరించారు.
ఈ ఇద్దరు ప్రముఖుల అభిప్రయాల మీద సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. వినియోగదారులు ఏఐ భవిష్యత్తు ప్రభావం గురించి తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. "ఇలాంటి భవిష్యత్తునేనా మనం కోరుకునేది? విద్య, ఆరోగ్య రంగాల్లో మనిషి ప్రతిభను మెషిన్లు భర్తీ చేయగలవా?" అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
