Begin typing your search above and press return to search.

AI కాటు.. వేల ఉద్యోగాల తొలగింపు..

AI అంటే ‘మనిషి పనిని సులభం చేయడం’ అనే భావనతో మొదలైంది. కానీ ఇప్పుడు అది ‘మనిషి పనిని మాయం’ చేసే దిశగా వెళ్తోంది. కంపెనీల లాజిక్‌ సింపుల్‌ యంత్రం తప్పు చేయదు, అలిసిపోదు, జీతం అడగదు.

By:  Tupaki Political Desk   |   4 Nov 2025 12:00 AM IST
AI కాటు.. వేల ఉద్యోగాల తొలగింపు..
X

మనషి కంప్యూటర్ ను కనుగొంటే.. అదే కంప్యూటర్ నేడు మనిషిని నాశనం చేస్తుంది. మనిషి అద్భుత శృష్టిలో కంప్యూటర్ ఒకటి అయితే.. దాని నుంచి కనుగొన్న ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్) మరోటి. ఏఐ వచ్చినప్పటి నుంచి మనిషికి ఉపాధి కరువైంది. ఏ రంగమైనా ఏఐ ఉంటే చాలు అంటున్నాయి కంపెనీలు. ఒక్క మీటతో పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో మనుషులు చేసే పని ఏఐ చేస్తుంది. ఖర్చు కూడా లేదు. దీంతో మనిషికి ఉపాధి కరువై రోడ్డుపై పడుతున్నాడు

డిజిటల్ దిశగా ప్రపంచం..

ప్రపంచం డిజిటల్‌ మార్పు దిశగా వేగంగా పరిగెడుతోంది. కానీ ఆ వేగాన్ని మనిషి అందుకోలేకపోతున్నాడు. ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద టెక్‌ కంపెనీల్లో వేలమంది ఉద్యోగులు ఒక్కసారిగా తమ కుర్చీలు, గుర్తింపులను కోల్పోయారు. ఇంటెల్‌, అమెజాన్‌, టీసీఎస్‌, మైక్రోసాఫ్ట్‌, సేల్స్‌ఫోర్స్‌ వంటి కంపెనీలు ‘పనితీరు తగ్గించింది’ లేదంటే ‘ఆటోమేషన్‌ పెంచింది’ ఈ కారణాలతో లక్షల మంది ఉద్యోగులను బయటకు పంపాయి. కృత్రిమ మేధస్సు (AI) రూపంలో వచ్చిన సాంకేతిక విప్లవం ఇప్పుడు ఉద్యోగ విపత్తుగా మారుతోంది. యంత్రం శిక్షణ పొందుతోంది, ఇదే సమయంలో మనిషి రోడ్డుపై పడుతున్నాడు.

సాంకేతికత సృష్టించిన అసమాన పోరు

AI అంటే ‘మనిషి పనిని సులభం చేయడం’ అనే భావనతో మొదలైంది. కానీ ఇప్పుడు అది ‘మనిషి పనిని మాయం’ చేసే దిశగా వెళ్తోంది. కంపెనీల లాజిక్‌ సింపుల్‌ యంత్రం తప్పు చేయదు, అలిసిపోదు, జీతం అడగదు. ఈ లాజిక్‌ వ్యాపారానికి సరైనదే అయినా.. సమాజానికి మాత్రం ప్రమాదకరం. ప్రతి ఉద్యోగం వెనుక ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగం ఒక ‘కోడ్‌ లైన్‌’ లేదా ‘సర్వర్‌ అప్డేట్‌’లో మాయం అవుతోంది. ఇంటెల్‌లో 24,000 మందిని తొలగించారు. అమెజాన్‌లో 30,000 మందికి పని పోయింది. టీసీఎస్‌లో 20,000 మందికి వీడ్కోలు పలికారు. ప్రతి తొలగింపూ ఆర్థిక వ్యూహం కాకపోవచ్చు. కానీ అన్ని తొలగింపులు మాత్రం కుటుంబాలను రోడ్డుపైకి తెచ్చేవే. కంపెనీలు లాభాల గురించి మాట్లాడుతుంటే.. ఉద్యోగులు భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటున్నారు. ఇది అభివృద్ధి కాదు.. అది అసమాన పోరు ఇది మనిషికి యంత్రానికి మధ్య జరిగే పోరు.

పరిష్కారం దృష్టికోణంతోనా..

AIని ఆపడం అసాధ్యం. కానీ దాన్ని ఎలా వాడాలో నిర్ణయించేది మాత్రం మనిషే. సాంకేతికత మనిషిని భర్తీ చేయకూడదు.. సహకరించాలి తప్ప. దీనికి మూడు మార్గాలు ఉన్నాయి. మొదటిది ప్రతి సంస్థ రీ-స్కిలింగ్‌ ప్రోగ్రామ్‌లను నిజమైన ఉద్దేశంతో చేపట్టాలి. ఉద్యోగి కొత్త టూల్స్‌ నేర్చుకునే సమయం.. వనరులు ఇవ్వాలి. రెండోది ప్రభుత్వాలు AI వలన ఉద్యోగాలు కోల్పోయిన వారికి తక్షణ ఆర్థిక మద్దతు, రీ-ట్రైనింగ్‌ వోచర్లు ఇవ్వాలి. ఇక మూడోది.. విద్యా వ్యవస్థను కొత్త దిశగా తీసుకెళ్లాలి. మన పిల్లలు రేపటి ఉద్యోగాలకు సిద్ధం కావాలంటే.. పాఠశాల స్థాయిలోనే ‘AI అవగాహన’ మొదలవ్వాలి. ఇవి జరిగితే యంత్రాలు మనుషులపై కాకుండా, మనుషులతో కలిసి పనిచేస్తాయి.

మానవత్వం మళ్లీ ముందుకు రావాలి

ఇది AI యుగమని ఒప్పుకొని తీరాల్సిందే.. కానీ ఇందులో మానవత్వాన్ని మాత్రం పతర పెట్టద్దు. కంపెనీల దృష్టిలో అభివృద్ధి అంటే కేవలం లాభాల తెచ్చిపెట్టేదిలా ఉండకూడదు. మనుషుల భద్రత, గౌరవం, స్థిరత్వం అని తెలుసుకోవాలి. ఒక ఉద్యోగి పనిని కోల్పోయినప్పుడు.. అతను తన విలువను కోల్పోకూడదు. యంత్రం వేగంగా నేర్చుకుంటుంది. కానీ అది మానవత్వంను చూపించదు. టెక్నాలజీ మార్పు అనివార్యం, కాని మానవ విలువలు ఎప్పటికీ నిలిచి ఉండాలి. మనిషి సృష్టించిన యంత్రం మానవుడికే సేవ చేయాలి, కానీ రోడ్డున పడేయవద్దు.