Begin typing your search above and press return to search.

మీడియాపై పైలట్ల సమాఖ్య కీలక నిర్ణయం..  నెట్టింట కామెంట్స్  వైరల్!

ప్రధానంగా ఏఏఐబీ ప్రాథమిక నివేదిక వెలువడిన తర్వాత పైలట్లను తప్పుబడుతూ అంతర్జాతీయ మీడియాల్లో వరుస కథనాలు వెలువడుతున్నాయి.

By:  Tupaki Desk   |   20 July 2025 3:00 AM IST
మీడియాపై పైలట్ల సమాఖ్య కీలక నిర్ణయం..  నెట్టింట కామెంట్స్  వైరల్!
X

అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ఘటనపై ఓ వైపు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు జరుగుతుండగా.. మరోవైపు రకరకాల కథనాలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఏఏఐబీ ప్రాథమిక నివేదిక వెలువడిన తర్వాత పైలట్లను తప్పుబడుతూ అంతర్జాతీయ మీడియాల్లో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత పైలట్ల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఏఏఐబీ ప్రాథమిక నివేదిక వెలువడిన తర్వాత మరింత ఎక్కువగా అంతర్జాతీయ మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... విమానయాన నిపుణుల అంచనాల మేరకు అని అంటూ... పైలట్లను తప్పుబడుతూ కథనాలు వెలువడుతున్నాయి.

దీనిపై ఇప్పటికే ఏఏఐబీ స్పందిస్తూ... దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు, తుది దర్యాప్తు వచ్చేవారకూ ఎవరూ ఊహాజనిత కథనాలు వెల్లడించొద్దని, అది పూర్తిగా బాధ్యతారాహిత్యమని పేర్కొంది. ఈ నేపథ్యంలో... 'ది వాల్ స్ట్రీట్ జర్నల్', 'రాయిటర్స్‌'లకు భారత పైలట్ల సమాఖ్య లీగల్ నోటీసులు పంపించింది. తక్షణమే క్షమాపణ చెప్పాలని కోరింది.

ఆ సంస్థల్లో వస్తోన్న కథనాలను తప్పుబడుతూ... ముఖ్యంగా దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ఇటువంటి చర్యలు పూర్తిగా 'బాధ్యతారాహిత్యం' అని పైలట్ల సమాఖ్య ప్రకటన హైలైట్ చేసింది. ఈ సందర్భంగా... మీడియా జర్నలిస్టిక్ సమగ్రతను కాపాడుకోవాలని, ప్రజలను తప్పుదారి పట్టించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా చూడాలని కూడా అభిప్రాయపడింది!

ఇటువంటి ఊహాజనిత కంటెంట్ ను ప్రచురించడం బాధ్యతారాహిత్యమే కాకుండా.. మరణించిన పైలట్ల ప్రతిష్టకు తీవ్ర, కోలుకోలేని హాని కలిగించిందని తెలిపింది. రాయిటర్స్ దుఃఖంలో ఉన్న కుటుంబాలపై అనవసరమైన బాధను కలిగించిందని.. అపారమైన ఒత్తిడి, ప్రజా బాధ్యతతో పనిచేసే పైలట్ సోదరభావం యొక్క ధైర్యాన్ని తగ్గించిందని లీగల్ నోటీసు పేర్కొంది.

ఈ నేపథ్యంలో నెట్టింట పైలట్ల సంఘానికి మద్దతు లభిస్తోంది! పూర్తి దర్యాప్తు నివేదిక ఇంకా రాకుండా.. కేవలం తెరపైకి వచ్చిన కాక్ పీట్ లోని పైలెట్ల సంభాషణతో.. అదిగో తోక అంటే, ఇదిగో పులి అన్నట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు వండి వార్చడం పెద్ద పెద్ద సంస్థలను కాపాడటం కోసం చేసే ప్రయత్నమా? అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కాగా... రెండు రోజుల క్రితం ఇదే విషయంపై ఏఏఐబీ స్ట్రాంగ్ గా స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆధారం లేని అంశాలతో భారత విమానయాన పరిశ్రమ భద్రత పట్ల ప్రజల్లో ఆందోళన సృష్టించాల్సిన సమయం ఇది కాదని.. తమ దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయాలకు రావద్దని గ్లోబల్ మీడియాను, ప్రజలను కోరుతూ ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ పేరున ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే.