అడవి అంచున వెలిగిన 'ఏఐ' దీపం: ప్రాణాలను, ప్రకృతినీ కాపాడుతున్న నయా కాపలాదారుడు
సమాచారం అందుకని రాపిడ్ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగడానికి కేవలం 15 నిమిషాలు పట్టింది.
By: A.N.Kumar | 30 July 2026 12:25 PM ISTఒకప్పుడు చీకటి పడిందంటే చాలు... అడవి అంచున ఉన్న ఆ పల్లెల్లో గుండెల నిండా భయం మాత్రమే నిండేది. "ఈ రాత్రి ఏనుగుల గుంపు వస్తుందేమో? పొలం మట్టిపాలవుతుందేమో? ఉన్న ఇల్లు కూలిపోతుందేమో?" అనే దడతో ప్రతి క్షణం నరకంలా గడిచేది. ఏళ్ల తరబడి పడ్డ కష్టం క్షణాల్లో నాశనమైపోతుంటే ఎంతోమంది రైతులు కంటినీరు పెట్టుకోవడం మనం చూశాం. పొరపాటున ఏనుగుల ఎదురొస్తే సంభవించే ప్రాణనష్టం ఆ కుటుంబాల్లో నింపే విషాదం మాటల్లో చెప్పలేనిది. కానీ కాలం మారింది. ఆ భయానక రాత్రుల చీకట్లను తుడిచేస్తూ కృత్రిమ మేధస్సు రూపంలో ఒక కొత్త వెలుగు, ఒక నమ్మకమైన కాపలాదారుడు వచ్చాడు.
అర్థరాత్రి వేళ... కొద్ది సెకన్లలో జరిగిపోయిన అద్భుతం
పశ్చిమ బెంగాల్‌లోని జల్దాపారా అటవీ ప్రాంతం సమీపంలో ఇటీవల జరిగిన ఓ ఘటనే దీనికి సజీవ సాక్ష్యం. అది నిశిరాత్రి... చీకటిని చీల్చుకుంటూ ఓ ఏనుగుల గుంపు మెల్లగా గ్రామం వైపు అడుగులు వేస్తోంది. సాధారణంగా అయితే ఆ విషయాన్ని మనుషులు గుర్తించేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయేది. కానీ అక్కడ కాపలా ఉన్న 'ఏఐ నైట్ విజన్' కెమెరాలు క్షణాల్లో ఆ కదలికలను గుర్తుపట్టాయి. కొద్ది సెకన్లలోనే అటవీ శాఖ కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ మెసేజ్ వెళ్ళిపోయింది.
సమాచారం అందుకని రాపిడ్ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగడానికి కేవలం 15 నిమిషాలు పట్టింది. గ్రామంలోకి ఏనుగులు అడుగుపెట్టకముందే అత్యంత సురక్షితంగా వాటిని మళ్లీ అడవి వైపే మళ్లించారు. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ సోషల్ మీడియాలో పంచుకున్న ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇది కేవలం టెక్నాలజీ విజయం కాదు... మానవత్వం, సాంకేతికత కలబోసిన ఓ గొప్ప మానవీయ దృశ్యం..
మనుషులకే కాదు... మూగజీవాలకూ రక్షణ
మన దేశంలో మనుషులు-ఏనుగుల మధ్య ఘర్షణల వల్ల ప్రతి ఏటా వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరోవైపు విద్యుత్ తీగలు తాకి, రైలు ప్రమాదాల్లో లేదా ప్రతీకార దాడుల్లో ఎన్నో మూగజీవాలు కూడా కన్నుమూస్తున్నాయి. ఏ తప్పూ చేయని ఆ మూగజీవాలు ప్రాణాలు కోల్పోతుంటే ప్రకృతి కూడా మూగబోయేది. ఇలాంటి సమయంలో ఏఐ మనకు అందిస్తున్న సహాయం అమూల్యమైనది. ఇక్కడ ఏఐ మనుషుల స్థానాన్ని భర్తీ చేయలేదు.. కానీ కంటికి రెప్పలా కాపాడే అటవీ సిబ్బందికి బలాన్ని ఇచ్చింది.
ఒకప్పుడు ప్రమాదం వచ్చాక కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రమాదం ద్వారంలోకి రాకముందే ఏఐ మనల్ని హెచ్చరిస్తోంది. భవిష్యత్తులో దేశంలోని అన్ని సున్నిత అటవీ ప్రాంతాల్లో ఇలాంటి ‘డిజిటల్ అటవీ కాపలాదారులు’ అందుబాటులోకి వస్తే... గ్రామాల్లో భయం స్థానంలో ప్రశాంతత.. అడవిలో మూగజీవాలకు నిండు నూరేళ్ల ఆయుష్షు లభిస్తాయి. సాంకేతికత అంటే కేవలం యంత్రాలు కాదని.. అది ప్రాణాలను కాపాడే అమృతం అని ఏఐ మరోసారి నిరూపించింది..
