షాకింగ్.. మనిషిని ఉద్యోగంలోంచి తీసేసిన ఏఐ మేనేజర్.. శాన్‌ఫ్రాన్సిస్కోలో విచిత్ర ఘటన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం ఇప్పటివరకు కేవలం కోడింగ్, కంటెంట్ తయారీ, డేటా అనలిటిక్స్ లేదా కస్టమర్ కేర్ సేవలకు మాత్రమే పరిమితమైందని భావిస్తే పొరపాటే.
By: A.N.Kumar | 18 Aug 2026 12:26 PM ISTఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం ఇప్పటివరకు కేవలం కోడింగ్, కంటెంట్ తయారీ, డేటా అనలిటిక్స్ లేదా కస్టమర్ కేర్ సేవలకు మాత్రమే పరిమితమైందని భావిస్తే పొరపాటే. మనుషులు చేసే సంక్లిష్టమైన పనులను క్షణాల్లో పూర్తి చేస్తున్న ఏఐ.. ఇప్పుడు ఏకంగా కంపెనీల్లో మేనేజ్‌మెంట్ బాధ్యతలను స్వీకరిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఒక మానవ ఉద్యోగిని ఏఐ మేనేజర్ ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన టెక్నాలజీ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో వేదికగా పనిచేస్తున్న ‘అండన్ ల్యాబ్స్’ అనే ప్రముఖ పరిశోధనా సంస్థ ‘అండోన్ మార్కెట్’ పేరుతో ఓ ప్రయోగాత్మక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ స్టోర్ రోజువారీ నిర్వహణతో పాటు ఉద్యోగుల పనితీరు పర్యవేక్షణ బాధ్యతలను ‘లూనా’ అనే ఏఐ మేనేజర్‌కు అప్పగించారు. ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ డెవలప్ చేసిన 'క్లాడ్' మోడల్ ఆధారంగా ఈ లూనా పనిచేస్తుంది.
వరుస లేట్ కమ్స్... చర్యలకు సిద్ధమైన ఏఐ
స్టోర్‌లో పనిచేస్తున్న ఒక మానవ ఉద్యోగి హాజరు రికార్డులను లూనా సునిశితంగా పరిశీలించింది. సదరు ఉద్యోగి మొత్తం 23 షిఫ్టుల్లో ఏకంగా 17 షిఫ్టులకు తీవ్ర ఆలస్యంగా హాజరైనట్లు రికార్డుల ద్వారా వ్యక్తమైంది. ప్రారంభంలో ఈ ఆలస్యాన్ని పెద్దగా పరిగణించని లూనా.. కంపెనీ నిర్వాహకులు ఇచ్చిన ఎంప్లాయ్ హ్యాండ్‌బుక్ నిబంధనలను విశ్లేషించింది. సంస్థ నియమావళి ప్రకారం క్రమశిక్షణా రాహిత్యం కింద సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించి చివరకు అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
కంపెనీల్లో మేనేజర్ పాత్రలకూ ముప్పు పెరిగినట్లేనా?
ఇప్పటివరకు "ఏఐ వల్ల ఉద్యోగాలు ఊడుతున్నాయి" అనే మాట మాత్రమే విన్నాం. కానీ ఏఐ మేనేజరే ఒక మనిషిని ఉద్యోగంలోంచి తీసివేయడం భవిష్యత్తు కార్పొరేట్ రంగానికి సరికొత్త సవాలుగా మారింది. ఉద్యోగుల పర్యవేక్షణ, నిబంధనల అమలు, పర్ఫార్మెన్స్ రివ్యూ వంటి సంక్లిష్ట నిర్ణయాల్లో ఏఐ పాత్ర వేగంగా పెరుగుతోందనడానికి ఈ ఘతనే నిదర్శనం.
మానవ స్పర్శ లేకపోతే ఎలా?
ఈ ఘటన ఆధారంగా టెక్ నిపుణులు పలు కీలక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఏఐ తీసుకునే తీవ్రమైన నిర్ణయాల వెనుక మానవ సమీక్ష ఎంతవరకు అవసరం? ఉద్యోగి ఆలస్యానికి గల వ్యక్తిగత లేదా ఆరోగ్య కారణాలను ఏఐ మానవీయ కోణంలో అర్థం చేసుకోగలదా? డేటా ఆధారంగా యంత్రాలు తీసుకునే నిర్ణయాలు వంద శాతం న్యాయబద్ధంగా ఉంటాయా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
భవిష్యత్తులో హెచ్‌ఆర్, మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఏఐ ఆధిపత్యం మరింత పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తున్నా.. నిర్ణయాధికారంలో మానవ విచక్షణ, పర్యవేక్షణ లేకపోతే మరిన్ని వివాదాలు తలెత్తే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం.
