Begin typing your search above and press return to search.

ఏఐ జాబ్స్ మీద 2 రిపోర్టులు.. ఏం చెప్పాయంటే?

ఇప్పుడు ఎక్కడ విన్నా ఏఐ అలియాస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉరఫ్ కృత్రిమ మేధ గురించే చర్చంతా.

By:  Garuda Media   |   14 Sept 2025 9:18 AM IST
ఏఐ జాబ్స్ మీద 2 రిపోర్టులు.. ఏం చెప్పాయంటే?
X

ఇప్పుడు ఎక్కడ విన్నా ఏఐ అలియాస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉరఫ్ కృత్రిమ మేధ గురించే చర్చంతా. ఫ్యూచర్ అంతా ఈ సాంకేతికత చుట్టూనే తిరుగుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే కోర్సులు మాత్రమే కాదు ఉపాధి అవకాశాలు ఈ రంగంలో భారీగా లభిస్తున్నాయి. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయన్న వాదనను పక్కన పెడితే.. ఈ రంగంలో నైపుణ్యాన్ని సాధిస్తే.. అధిక జీతాలకు జాబ్స్ దొరుకుతున్న పరిస్థితి. ఏఐ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలపై రెండు రిపోర్టులు తాజాగా వెల్లడయ్యాయి. అందులో పేర్కొన్న అంశాల్ని పరిశీలిస్తే.. ఈ రంగంలో ఉన్న ఉద్యోగవకాశాలపై అవగాహన పెరగటమే కాదు.. మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలో కూడా ఇట్టే అర్థమవుతుంది.

2025లో ఏఐ మార్కెట్ ఏకంగా 28.8 బిలియన్ డాలర్లకు చేరుకునే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ.. మార్కెట్ లో ఈ రంగానికి సంబంధించిన నిపుణుల కొరత ప్రధానంగా వేధిస్తోంది. వాస్తవ కోణంలో చూస్తే.. పది జెన్ఏఐ జాబ్స్ ఉంటే నైపుణ్యం ఉన్న వారు ఒక్కరే లభిస్తున్నట్లుగా పేర్కొంది టీమ్ లీజ్ డిజిటల్ రూపొందించిన రిపోర్టు. ఇంతకూ ఈ రంగంలో అత్యధిక డిమాండ్ ఉన్న రంగాలేమిటి? అన్న విషయాన్ని ఈ నివేదిక వెల్లడించింది.

నిర్దిష్ట ప్రాంప్ట్ ఇంజినీరింగ్

ఎల్ఎల్ఎం సేఫ్టీ

ట్యూనింగ్

ఏజెంట్ డిజైన్

సిమ్యులేషన్ గవర్నన్స్

ఏఐ కాంప్లయెన్స్

రిస్క్ ఆపరేషన్స్

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు

జనరేటివ్ ఏఐ ఇంజినీరింగ్

మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ విభాగాల్లోనూ అవకాశాలు దండిగా ఉంటున్నాయి. ఈ రంగాల్లో పని చేసే సీనియర్లకు వార్షిక ప్యాకేజీ రూ.58-60 లక్షల వరకు ఉండటం గమనార్హం. అంతేకాదు డిజిటల్ ఎకానమీలో ఏఐ.. క్లౌడ్ లోనూ డిమాండ్ భారీగా ఉంది. జీసీసీల్లో సైబర్ సెక్యూరిటీ.. డేటా ఇంజినీరింగ్ ఉద్యోగాల వేతనాలు 2025-27 ఆర్థిక సంవత్సరానికి వార్షికంగా రూ.28 లక్షల నుంచి రూ.33.5 లక్షలకు పెరిగే వీలుందని అంచనా వేస్తున్నారు. ఏఐ మార్కెట్ ప్రస్తుతం హైపర్ గ్రోత్ దశలోకి అడుగు పెడుతోందని.. ఏటా 45 శాతం వృద్ధితో ముందుకు వెళుతోంది. ఇలాంటి వేళ ఈ రంగంలో ప్రతిభావంతుల కొరత తీవ్రంగా ఉంది.

మరో ముఖ్యమైన అంశం ఏమంటే.. 2026 నాటికి ఏఐ టాలెంట్ అంతరం 53 శాతానికి పెరగనుంది. అదే విధంగా క్లౌడ్ కంప్యూటింగ్ లో డిమాండ్ - సరఫరా అంతరం 55-60 శాతానికి పెరగనుంది. ఈ రిపోర్టు అంచనా ప్రకారం 2027లో 47 లక్షల కొత్త టెక్ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ఎక్కువగా జెన్ఏఐ.. ఇంజినీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగాల్లోనే ఉంటాయని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. కెరీర్ ఫ్లాట్ ఫామ్ అందించే అప్నా కో రిపోర్టు మరిన్ని ఆసక్తికర అంశాల్ని పేర్కొంది. టెక్నాలజీ రంగంలో మెరుగైన ఉద్యోగ అవకాశాల్ని పొందేందుకు ఏఐ సాయం చేస్తుందన్న విషయాన్ని మహిళలు నమ్ముతున్నట్లుగా పేర్కొంది. దేశంలోని టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న 11,300 మందికి పైగా మహిళా టెకీల అభిప్రాయాన్ని ఈ సంస్థ రిపోర్టుగా తయారుచేసింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది జెన్ జెడ్ వారు కాగా.. దాదాపు 60 శాతంమంది టూటైర్ .. త్రీ టైర్ నగరాలకు చెందిన వారు కావటం గమనార్హం. ఏఐ సాఫ్ట్ వేర్ డెవలపర్లుగా ఎదగాలని సగానికి పైగా మహిళలు టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఈ రిపోర్టు వెల్లడించింది. ఈ విభాగం తర్వాత డేటా సైన్స్ ఎంఎల్ ఉద్యోగాల మీద ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇవే కాకుండా ప్రొడక్ట్ మేనేజ్ మెంట్.. రీసెర్చ్ లు కూడా ఉన్నాయి. పేరున్న కాలేజీల్లో చదవటం కంటే ఏఐ నైపుణ్యాలు ఉండటం చాలా ముఖ్యమన్న అభిప్రాయాన్ని 64 శాతం మంది వ్యక్తం చేయటం గమనార్హం.