Begin typing your search above and press return to search.

రైత‌న్న‌ల‌కు సాంకేతిక భ‌రోసా: AIతో ఉల్లిపాయ‌ల గ్రేడింగ్ మెషీన్ మ్యాజిక్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనగానే మనకు సాఫ్ట్‌వేర్ కంపెనీలు, చాట్ బాట్లు లేదా అమెజాన్ వంటి గ్లోబల్ ఈ-కామర్స్ సంస్థల్లో ఉత్పత్తుల ప్యాకింగ్ - డెలివరీ పనులే గుర్తొస్తాయి.

By:  Sivaji Kontham   |   4 May 2026 9:29 AM IST
రైత‌న్న‌ల‌కు సాంకేతిక భ‌రోసా: AIతో ఉల్లిపాయ‌ల గ్రేడింగ్ మెషీన్ మ్యాజిక్
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనగానే మనకు సాఫ్ట్‌వేర్ కంపెనీలు, చాట్ బాట్లు లేదా అమెజాన్ వంటి గ్లోబల్ ఈ-కామర్స్ సంస్థల్లో ఉత్పత్తుల ప్యాకింగ్ - డెలివరీ పనులే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు ఏఐ తన పరిధిని విస్తరించి క్షేత్రస్థాయిలోకి.. ముఖ్యంగా వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టింది. ``ఇందుగలడు అందుగలడు`` అన్న చందంగా ఇప్పుడు ఉల్లిపాయల నాణ్యతను పరీక్షించి.. వాటిని గ్రేడింగ్ చేయడంలోనూ ఏఐ ఆధారిత యంత్రాలు అద్భుతాలు చేస్తున్నాయి. సాంకేతిక రంగంలో మానవాళి సాధిస్తున్న ఈ అసాధారణ వృద్ధి సామాన్య రైతులకు సైతం అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది.

భారతదేశంలో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పంట అనంతర నిర్వహణ. సరైన గ్రేడింగ్ సదుపాయాలు లేకపోవడం వల్ల సుమారు 20 శాతం నుండి 30 శాతం వరకు పంట వృథాగా పోతోంది. ఈ సమస్యను గుర్తించిన `అగ్రోగ్రేడ్ ఏఐ` వంటి స్టార్టప్‌లు ఉల్లి రైతులకు సాంకేతిక అండగా నిలుస్తున్నాయి. ఉల్లిపాయల పరిమాణం, రంగు, ఆకారం, లోపాలను గుర్తించడానికి ఇవి అత్యాధునిక ఏఐ అల్గారిథమ్స్‌ను ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల రైతులకు తమ పంటపై పూర్తి నియంత్రణ ఉండటమే కాకుండా... మార్కెట్‌లో సరైన ధరను పొందే అవకాశం లభిస్తోంది.

ఈ ఏఐ ఆధారిత యంత్రాల పనితీరు చాలా వినూత్నంగా ఉంటుంది. మానవ ప్రమేయం లేకుండానే ఉల్లిపాయల వ్యాసాన్ని.. దెబ్బతిన్న భాగాలను ఈ యంత్రాలు ఖచ్చితంగా విశ్లేషిస్తాయి. దీనివల్ల మంచి ఉల్లిపాయలు పాడవకుండా నాణ్యత ఆధారంగా వేగంగా వేరు చేయబడతాయి. ఉల్లిపాయలను చేత్తో ఏరడం అనేది చాలా కష్టమైన .. సమయం తీసుకునే పని. అగ్రోగ్రేడ్ యంత్రాలు గంటకు టన్నుల కొద్దీ పంటను గ్రేడింగ్ చేస్తూ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా.. కార్మికుల కొరతకు సమర్థవంతమైన పరిష్కారం చూపుతున్నాయి.

కేవలం సార్టింగ్ (వేరు చేయ‌డం) మాత్రమే కాకుండా.. ఈ యంత్రాలు రైతులకు డేటా అనలిటిక్స్ సదుపాయాన్ని కూడా కల్పిస్తాయి. తమ పంట నాణ్యత గురించి పూర్తి సమాచారాన్ని డిజిటల్ రూపంలో పొందే వీలుండటం వల్ల.. వ్యాపారులతో బేరసారాలు ఆడేటప్పుడు రైతులకు పూర్తి పారదర్శకత లభిస్తుంది. చెడిపోయిన ఉల్లిపాయలను ముందే గుర్తించి వేరు చేయడం వల్ల మిగిలిన పంటకు ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించవచ్చు. ఇలా శాస్త్రీయ పద్ధతిలో గ్రేడింగ్ చేయడం వల్ల మార్కెట్‌లో ప్రీమియం ధర లభించి రైతులకు గరిష్ట లాభాలు వచ్చేలా ఈ సాంకేతికత దోహదపడుతోంది.

ఇంకా చెప్పాలంటే.. అగ్రోగ్రేడ్ ఏఐ వంటి ఆవిష్కరణలు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు గ్లోబల్ స్టాండర్డ్స్ కలిగిన టెక్నాలజీని అందించి వారిని ఆర్థికంగా సాధికారత వైపు నడిపిస్తున్నాయి. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు ఏఐ వంటి ఆధునిక సాంకేతికత తోడైతే వ్యవసాయం కేవలం జీవనాధారంగానే కాకుండా ఒక లాభదాయకమైన వ్యాపారంగా మారుతుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను ఆర్జించే ఈ మార్పు.. దేశంలోని రైతులకు కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.