మిడిల్ క్లాస్ కి జాబ్ ఇక కలగానేనా ?
ఎగువ తరగతి వారికి వ్యాపారాలు ఇతర రంగాలు ఎక్కువగా ఉంటాయి. వారిలో ఉద్యోగార్ధులు పెద్దగా ఎవరూ ఉండరు, ఇక దిగువ స్థాయిలో చూస్తే ఎక్కువ మంది అసంఘటిత రంగంలో ఉంటారు.
By: Satya P | 19 July 2026 10:02 AM ISTఎగువ తరగతి వారికి వ్యాపారాలు ఇతర రంగాలు ఎక్కువగా ఉంటాయి. వారిలో ఉద్యోగార్ధులు పెద్దగా ఎవరూ ఉండరు, ఇక దిగువ స్థాయిలో చూస్తే ఎక్కువ మంది అసంఘటిత రంగంలో ఉంటారు. వివిధ వృత్తులలో నైపుణ్యం సంపాదించి తమ స్వయం ఉపాధికి వారు దారులు వెతుక్కుంటారు. ఇక దిగువ వర్గాలు కూడా చిన్న వ్యాపారాలు చేస్తారు. దాంతో వారికి ఉపాధి విషయంలో సమస్య ఉన్నా మిడిల్ క్లాస్ తో పోలిస్తే అంతగా ఒత్తిడి ఉండదు, పైగా ప్రభుత్వాలు పేదల సంక్షేమం వైపు చూస్తూంటాయి. అది వారికి శ్రీరామ రక్షగా కొంతవరకూ పనిచేస్తుంది. ఇక అటూ ఇటూ చూస్తే ఎటూ కాకుండా మిగిలిపోయే వారు అచ్చంగా మిడిల్ క్లాస్ సెక్షన్ అని అంటున్నారు. మిడిల్ క్లాస్ అని ఎలా క్లాసిఫికేషన్ చేశారో తెలియదు కానీ వీరు అన్ని విషయాలలోనూ అడ్డంగా దొరికేసి మధ్యన పడి మరీ నలిగిపోతూంటారు.
కొత్త వర్గం సైతం :
ఇక ఈ మిడిల్ క్లాస్ లో ఒక వర్గం కొత్తగా తాజా దశాబ్దాలలో ఏర్పాటు అయింది. దాని పేరు ఉన్నత మధ్య తరగతి వర్గం. అంటే అప్పర్ మిడిల్ క్లాస్ అన్న మాట. వీరు మిడిల్ క్లాస్ తో పోలిస్తే కాస్ట్లీ లైఫ్ ఎంజాయ్ చేస్తూంటారు. అయితే వీరు నయా కోటీశ్వరులు కానీ వందల కోట్లకు పడగలెత్తిన ఉన్నత వర్గాల వారు కారు. అదే విధంగా ఇరుకు బతుకులు బతికే మధ్య తరగతి కేటిగిరీకి మాత్రం వీరు ఆగర్భ శ్రీమంతులు కిందకే లెక్క. అయితే ఇపుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కృత్రిమ మేధ అనే ఏఐ విప్లవంతో అప్పర్ మిడిల్ క్లాస్ సైతం ఇబ్బందులో పడీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిడిల్ క్లాస్ అయితే నేరుగా టార్గెట్ అవుతోంది అని అంటున్నారు.
వైట్ కాలర్ జాబ్స్ కోత :
గడచిన కొన్నేళ్ళుగా చూసుకుంటే కనుక దేశంలో జాబ్ మార్కెట్ భారీగా పతనం అవుతోంది. దాంతో ఎక్కువగా ఇబ్బంది పడేది మధ్యతరగతి వర్గాలే అని నివేదికలు సూచిస్తున్నాయి. ఇక గతంలో 11 శాతంగా ఉన్న వైట్ కాలర్ ఉద్యోగాల వృద్ధి రేటు ఇటీవల కాలంలో ఏకంగా ఒక్క శాతానికి పడిపోయింది. దీని మీద ఉపాధి రంగానికి చెందిన విశ్లేషకుల అంచనా ప్రకారం చూస్తే ప్రతి ఏటా దాదాపు 80 లక్షల మంది గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నప్పటికీ ఐటీ కస్టమర్ సర్వీస్ వంటి రంగాలలో ఉద్యోగాల సృష్టి భారీగా మందగించింది అని తెలుస్తోంది.
జాబ్ కొట్టాలంటే మరి :
ఈ నేపథ్యంలో మధ్యతరగతి వర్గాలు జాబ్ కొట్టాలీ అంటే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తోంది. మధ్య తరగతి వర్గాలకు ఇంతవరకూ వైట్ కాలర్ జాబ్స్ అందుబాటులో ఉండేవి. అవి కేవలం ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా అధికంగానే దక్కేవి. ఇక ఐటీ ఫీల్డ్ లో అత్యధిక శాతం ఆఫర్లతోనే మిడిల్ క్లాస్ లోని ఒక సెక్షన్ కాస్తా అప్పర్ మిడిల్ క్లాస్ గా మారిపోయింది. లక్షల్లో వేతనాలు నెలకు అందుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించిందించి. ఇపుడు అప్పర్ మిడిల్ క్లాస్ తో పాటు మిడిల్ క్లాస్ కి కూడా ఈ జాబ్ మార్కెట్ దారుణంగా పతనం చెందడం అనేది చూస్తే కలవరం చెలరేగుతోంది.
ఏఐతో పోటీ పడితేనే :
ఒక విధంగా ఇపుడున్న డిగ్రీలు టాలెంట్ కి అదనంగా మిడిల్ క్లాస్ యూత్ తమ వద్ద నైపుణ్యాన్ని ఇంకా పెంచుకోవాల్సి ఉందని అంటున్నారు. అలా చేస్తేనే తప్ప జాబ్స్ అన్నవి దక్కే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి జాబ్స్ క్రియేషన్ కి సంబంధించిన ట్రెండ్స్ చూస్తే కనుక కొత్త ఉద్యోగాల కల్పన పక్కన పెడితే ఉన్నఉద్యోగాలలో భారీ కోత పడుతోంది. మరీ ముఖ్యంగా ఐటీ నియామకాల్లో తగ్గుదల కనిపిస్తోంది. సాంకేతిక పరివర్తనల మూలంగానూ అలాగే ఏఐ వంటి వాటి కారణంగానూ మధ్యతరగతి ఉద్యోగార్థులకు కొత్త అవకాశాలు దొరకడం ఇపుడున్న పరిస్థితుల్లో బహు కష్టతరంగా మారుతోంది.
వీటిలో మాత్రం చాన్స్ :
అయితే అంతగా నిరుత్సాహానికి గురి కావాల్సిన పని లేదని కూడా జాబ్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఎంత సాంకేతికత అందుబాటులోకి వచ్చినా పనిచేయించాల్సింది మనిషే కాబట్టి మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా తమ టాలెంట్ ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. డిమాండ్ ఉన్న నైపుణ్యాలను అంది పుచ్చుకోవాలని అంటున్నారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ హెల్త్‌కేర్ విభాగాలలో మాత్రమే ప్రస్తుతం నియామకాలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. దాంతో వీటి మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం యూత్ కి ఉంది అని సూచిస్తున్నారు.
