Begin typing your search above and press return to search.

AI వల్ల అంతరించిపోయే ఉద్యోగాలివే

ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ రంగంలో కృత్రిమ మేధస్సు (AI) విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.

By:  Tupaki Desk   |   14 Jun 2025 4:46 PM IST
AI వల్ల అంతరించిపోయే ఉద్యోగాలివే
X

ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ రంగంలో కృత్రిమ మేధస్సు (AI) విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక ప్రకారం.., ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 మిలియన్ల పూర్తికాల ఉద్యోగాలు AI వల్ల ఆటోమేటెడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిణామం ఎన్నో ఆందోళనలను రేకెత్తిస్తున్నా, అదే సమయంలో కొత్త అవకాశాలనూ సృష్టిస్తోంది.

- AI ప్రభావంతో అంతరించే అవకాశం ఉన్న ఉద్యోగాలు

ముఖ్యంగా పునరావృతమయ్యే పనులు.. నిర్ణీత నియమాల ప్రకారం జరిగే ఉద్యోగాలపై AI ప్రభావం ఎక్కువగా ఉంటుంది. డేటా ఎంట్రీ, షెడ్యూలింగ్, ట్రాన్స్‌క్రిప్షన్ వంటివి ముందుగా AI బారిన పడే అవకాశముంది. వీటిని AI ఆధారిత సాఫ్ట్‌వేర్‌లు సమర్థవంతంగా నిర్వహించగలవు. ప్రస్తుతం అనేక సంస్థలు కస్టమర్ సర్వీస్ కోసం AI చాట్‌బాట్‌లను ఉపయోగిస్తున్నాయి. ఇవి సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, సమస్యలను పరిష్కరించడంలో మానవుల కంటే వేగంగా, నిరంతరం పనిచేస్తాయి. చిన్న దుకాణాల నుండి పెద్ద రిటైల్ స్టోర్‌ల వరకు, క్యాషియర్‌లు, స్టాక్ మేనేజర్‌ల పని ఆటోమేషన్ ద్వారా తగ్గుతుంది. సెల్ఫ్-చెక్‌అవుట్ కియోస్క్‌లు, స్మార్ట్ ఇన్వెంటరీ సిస్టమ్స్ ఇప్పటికే వాడుకలోకి వచ్చాయి. రోబోట్లు, ఆటోనమస్ డెలివరీ వాహనాలు తయారీ, రవాణా రంగాల్లో మానవ శ్రమను భర్తీ చేస్తున్నాయి. ఉత్పత్తి ప్రక్రియలు, లాజిస్టిక్స్‌లో AI అనుసంధానం గణనీయంగా పెరిగింది. కాపీరైటింగ్, టెంప్లేటెడ్ రిపోర్ట్స్ వంటి ప్రాథమిక కంటెంట్ క్రియేషన్ పనులను AI టూల్స్ చేయగలుగుతున్నాయి. మెకిన్సే నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 30% పని గంటలు ఆటోమేటెడ్ అయ్యే అవకాశం ఉంది.

- AIతో పుట్టుకొచ్చే కొత్త ఉద్యోగాలు

AI ఉద్యోగాలను తొలగిస్తున్నప్పటికీ, అదే సమయంలో కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా ప్రకారం, 2025 నాటికి 85 మిలియన్ల ఉద్యోగాలు తొలగిపోయే అవకాశం ఉన్నా, 97 మిలియన్ల కొత్త ఉద్యోగాలు వస్తాయన్నది విశ్వసనీయ సమాచారం. కొత్తగా డిమాండ్ ఉన్న ఉద్యోగాలు చూస్తే.. AI ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు.., మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు, రోబోటిక్స్ ఇంజనీర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, AI ఎథిక్స్ ఆఫీసర్లు పోస్టులు కొత్తగా సృష్టించబడే జాబితాలో ఉన్నాయి.

-భవిష్యత్తుకు ఎలా సిద్ధం కావాలి?

AI ఒక శత్రువు కాదు. అది ఒక శక్తివంతమైన సాధనం. ఈ మార్పులను అందిపుచ్చుకోవడానికి వ్యక్తిగత, వృత్తిపరమైన అభివృద్ధి చాలా ముఖ్యం. AI టూల్స్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం అవసరం. ఇది మీ పనితీరును మెరుగుపరచి, సమయాన్ని ఆదా చేస్తుంది. విశ్లేషణాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, భావోద్వేగ తెలివితేటలు (ఎమోషనల్ ఇంటెలిజెన్స్) వంటి సాఫ్ట్ స్కిల్స్‌కు AI యుగంలో మరింత విలువ ఉంటుంది. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తిని కనబరచాలి. ఇది మారుతున్న ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా మారడానికి సహాయపడుతుంది. AI కాపీరైటింగ్ చేయగలిగినప్పటికీ మానవుడిలోని సృజనాత్మకత, విశ్లేషణ, భావోద్వేగ అనుసంధానం వంటివి AIకి సాధ్యం కాదు. ఈ మానవ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.