Begin typing your search above and press return to search.

ఏఐ వీడియోలతో క్యారెక్టర్ అసాసినేషన్.. సెలబ్రిటీలు, రాజకీయ నేతలకు కొత్త ముప్పు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి జీవితాన్ని సులభతరం చేయాల్సిన ఆధునిక విజ్ఞానం.. నేడు కొంటె చేతుల్లో పడి సరికొత్త ప్రమాదాలకు వేదికవుతోంది.

By:  A.N.Kumar   |   25 Oct 2026 8:00 PM IST
ఏఐ వీడియోలతో క్యారెక్టర్ అసాసినేషన్.. సెలబ్రిటీలు, రాజకీయ నేతలకు కొత్త ముప్పు
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి జీవితాన్ని సులభతరం చేయాల్సిన ఆధునిక విజ్ఞానం.. నేడు కొంటె చేతుల్లో పడి సరికొత్త ప్రమాదాలకు వేదికవుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సృష్టిస్తున్న డీప్‌ఫేక్, నకిలీ వీడియోలు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు ఫొటోలను మార్ఫింగ్ చేసి పరువు తీసే ప్రయత్నాలు జరిగేవి.. కానీ నేడు ఏకంగా మాట్లాడినట్లు.. ఎక్కడికో వెళ్లినట్లు... తప్పు చేసినట్లు కనిపించేలా అత్యంత సహజమైన వీడియోలను సృష్టించి సోషల్ మీడియాలో వదులుతున్నారు. అసలు నిజం ఏమిటో తేలేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుండటం డిజిటల్ యుగంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఎన్టీఆర్ పాట నుంచి రాజకీయ ప్రముఖుల వరకు..

సినిమా రంగంలో ఏఐ దుర్వినియోగం ఏ స్థాయికి చేరిందనేదానికి ఇటీవలి ఉదాహరణలే నిదర్శనం. నటుడు జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన 'దేవర' సినిమాలోని పాటకు సంబంధించి అసభ్యకరమైన రీతిలో మార్పు చేసిన ఏఐ కంటెంట్ తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ వర్గం స్పందించడం.. చట్టపరమైన చర్యలకు ఉపక్రమించడం జరిగిందనే వార్తలు టాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. సాంకేతికతను వ్యక్తుల ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఈ ఘటన హెచ్చరించింది.

ఈ ముప్పు కేవలం రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రజాజీవితంలో ఉన్న రాజకీయ నాయకులూ దీనికి బలవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక ప్రముఖ నటితో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఏఐ మార్ఫింగ్ వీడియోలు ఈ కోవకే చెందుతాయి. ఇలాంటి కృత్రిమ సృష్టిల వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది.

రాజరవీంద్ర ఆందోళన.. రఘురామరాజుతో చర్చ

ఈ సరికొత్త సాంకేతిక ముప్పుపై ప్రముఖ నటుడు రాజరవీంద్ర తాజాగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులే లక్ష్యంగా నకిలీ వీడియోలను సృష్టించి వారి వ్యక్తిగత జీవితాలను, కేరీర్‌ను దెబ్బతీస్తున్న దుర్మార్గపు ధోరణి పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"ఒక వ్యక్తి తాను ఆ వీడియోలో లేనని.. అది ఫేక్ అని వివరణ ఇచ్చుకునేలోపే ఆ కంటెంట్ లక్షలాది మందికి చేరిపోతుంది. ఆ తర్వాత అది నకిలీదని తెలిసినా.. ప్రజల మనసుల్లో నాటుకుపోయిన అనుమానాలను తొలగించడం అసాధ్యం" అని రాజరవీంద్ర పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రత్యర్థులపై బురదజల్లేందుకు ఈ అస్త్రాలను వాడుతుండటం ప్రజాస్వామ్యానికే పెను ముప్పని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలోనే మహేశ్ బాబు వంటి ఇతర ప్రముఖుల ఇమేజ్‌ను ముడిపెట్టి ప్రచారమవుతున్న తెలంగాణ పొలిటికల్ వీడియోలు కూడా చర్చనీయాంశంగా మారాయి.

నిజానిజాల కంటే 'వైరల్' వేగమే ఎక్కువ

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఏ వార్తైనా.. వీడియో అయినా అది నిజమా కాదా అని వెరిఫై చేసుకునే తీరిక లేదా ఆసక్తి నెటిజన్లలో కరువైంది. దాన్ని ఎంత వేగంగా షేర్ చేయాలనే ఆతృతే ఎక్కువైంది. ఏఐ సాయంతో ముఖకవళికలు , గొంతు, శరీర కదలికలను హూటాహుటిన తప్పులేకుండా అనుకరించడం నేడు సులభమైంది.

ఎన్నికల వేళ ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయడానికి, ఓటర్లను తప్పుదారి పట్టించడానికి ఇలాంటి వీడియోలు ప్రబలితే అది ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయతనే దెబ్బతీస్తుంది. ఒకసారి వైరల్ అయిన కంటెంట్‌ను ఎంత తొలగించినా.. ఏదో ఒక రూపంలో అది మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటుంది.

కఠిన చట్టాలే ఏకైక పరిష్కారమా?

ఈ అనూహ్య పరిణామాలను అరికట్టేందుకు అత్యవసరంగా కఠినమైన చట్టాలు తీసుకురావాలని మేధావులు, బాధితులు కోరుతున్నారు. ఈ అంశంపై డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సానుకూలంగా స్పందిస్తూ ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ప్రత్యేక చట్టాల అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే కేవలం చట్టాల రూపకల్పనే కాకుండా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు బాధ్యత వహించడం.. ఏఐ కంటెంట్‌కు స్పష్టమైన వాటర్ మార్కులు లేదా డిజిటల్ ట్యాగ్‌లు ఉండేలా నిబంధనలు తేవడం అత్యవసరం. అదే సమయంలో రాజకీయ విమర్శలు, సృజనాత్మక వ్యంగ్యం పేరిట భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా చూస్తూనే.. ఉద్దేశపూర్వకంగా క్యారెక్టర్ అసాసినేషన్ పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపాల్సి ఉంది.

ఏఐ అనేది మానవ జాతికి అందిన అద్భుతమైన వరం. కానీ దానికి హద్దులు, నిబంధనలు లేకపోతే అది వినాశకర ఆయుధంగా మారుతుంది. ఏఐని పూర్తిగా నిషేధించడం అసాధ్యం.. కానీ దాని దుర్వినియోగాన్ని కట్టడి చేయడం మన చేతుల్లోనే ఉంది. సోషల్ మీడియా సంస్థలు, ప్రభుత్వాలు, చట్టసభలు సమిష్టిగా స్పందించి వేగవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. రేపు రాజకీయ నాయకుడైనా.. సినీ నారాయణుడైనా.. చివరికి సామాన్య పౌరుడైనా ఈ టెక్నాలజీ బారిన పడవచ్చు. అందుకే డిజిటల్ ప్రపంచంలో 'నిజం' గెలిచేలా.. అబద్ధాలు కట్టడి అయ్యేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పుడే సమాజానికి రక్షణ లభిస్తుంది.