చంద్రబాబులా ఏఐ డీప్‌ఫేక్ వీడియో కాల్ : రూ.80 వేలు స్వాహా.. విశాఖ వాసికి మోసం
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్లు, వారి రూపాలను వాడుకుని డీప్ ఫేక్ వాట్సాప్ కాల్ చేసి విశాఖకు చెందిన ఓ వ్యక్తిని మోసం చేశారు.
By: Tupaki Political Desk | 13 Jun 2026 11:00 PM ISTసాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతోందో, సైబర్ నేరగాళ్లు దాన్ని అంతకంటే వేగంగా వాడుకుంటూ కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. నిన్నమొన్నటి వరకు కేవలం ఫోన్ కాల్స్, ఓటీపీల ద్వారా దోచుకున్న కేటుగాళ్లు.. ఇప్పుడు ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వాడుకుంటూ ప్రముఖుల రూపాలను సృష్టించి బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్లు, వారి రూపాలను వాడుకుని డీప్ ఫేక్ వాట్సాప్ కాల్ చేసి విశాఖకు చెందిన ఓ వ్యక్తిని మోసం చేశారు. ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో చంద్రబాబు, లోకేశ్ మాట్లాడినట్లుగానే బాధితుడిని మోసం చేయడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
భూ వివాదం అడ్డుపెట్టుకుని..
విశాఖపట్నం సీతంపేటకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కొంతకాలంగా ఒక భూ వివాదంతో ఇబ్బంది పడుతున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు అతనికి వల వేశారు. సాధారణంగా వచ్చే ఫోన్ కాల్స్ అయితే ఎవరైనా అనుమానిస్తారని భావించిన కేటుగాళ్లు.. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రూపం, గొంతును పోలిన ఏఐ డీప్‌ఫేక్ సాంకేతికతను ఉపయోగించారు. బాధితుడికి వాట్సాప్ ద్వారా నేరుగా వీడియో కాల్ చేశారు. స్క్రీన్‌పై సాక్షాత్తూ సీఎం చంద్రబాబు కనిపిస్తూ, ఆయన గొంతుతోనే మాట్లాడటంతో బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. పైగా, జీవీఎంసీ కమిషనర్‌పై ఉన్న లంచం ఆరోపణలను నిరూపిస్తే, సదరు భూ వివాదాన్ని తక్షణమే పరిష్కరిస్తామని నమ్మబలికారు. అది నిజమైన కాల్ కాదని గుర్తించలేకపోయిన బాధితుడు మోసగాళ్లు చెప్పినట్లు చేసి నష్టపోయాడని చెబుతున్నారు.
మొదట నమ్మకం కుదిరిన తర్వాత, ఫైల్ ప్రాసెసింగ్, ఇతర ఖర్చుల పేరిట విడతల వారీగా శ్రీనివాస్ రెడ్డి నుండి రూ.80,000 వసూలు చేశారని చెబుతున్నారు. ఆ తర్వాత కూడా మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు, వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన శ్రీనివాస్ రెడ్డి.. తాను మోసపోయానని గ్రహించి, వెంటనే విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
12 నిమిషాల మాయాజాలం
సాధారణంగా సైబర్ కాల్స్ ఒకటి లేదా రెండు నిమిషాల్లో ముగుస్తాయి. కానీ ఈ కేసులో నేరగాళ్లు ఏఐ సాంకేతికతను ఎంత పక్కాగా వాడారంటే.. ఒక వీడియో కాల్ ఏకంగా 12 నిమిషాల పాటు మాట్లాడించారు. బాధితుడుకి ఊరట కలిగేలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ నమ్మకం కలిగించారని చెబుతున్నారు. దీంతో సాంకేతికతను మోసగాళ్లు ఎంత ప్రమాదకరంగా వాడుకుంటున్నారో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అంటున్నారు. ఈ ఘటనతో ప్రజలకు ఒక మేలుకొలుపుగా ఉండాలని పోలీసులు అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మోసాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ ద్వారా నేరగాళ్లు ఇప్పుడు ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
సీఎం, మంత్రులు వంటి ప్రముఖులు లేదా అధికారుల ఫొటోలను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకుని డబ్బులు దండుకునే ప్లాన్ అమలు చేయడానికి వెనకాడని పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఇంటర్నెట్‌లో దొరికే ప్రముఖుల వీడియోలు, ఆడియో క్లిప్పులను ఏఐ సాఫ్ట్‌వేర్లలో ఉపయోగించి.. వారు నిజంగానే లైవ్‌లో మాట్లాడుతున్నట్లు వీడియో కాల్స్ సృష్టించడం,
గొంతును మార్చడం ద్వారా డబ్బులు గుంజుకుంటారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
