Begin typing your search above and press return to search.

హోటల్ బిల్స్..70 వేల కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టిన ఏఐ..ఎలాగంటే?

మనం హోటల్‌కు వెళ్లి బిర్యానీ తిని బిల్లు కడతాం కదా.. ఆ బిల్లుల్లోనే కొన్ని హోటల్స్ 'మ్యాజిక్' చేస్తున్నాయని ఐటీ శాఖ కనిపెట్టింది.

By:  Madhu Reddy   |   20 Feb 2026 5:00 PM IST
హోటల్ బిల్స్..70 వేల కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టిన ఏఐ..ఎలాగంటే?
X

మనం హోటల్‌కు వెళ్లి బిర్యానీ తిని బిల్లు కడతాం కదా.. ఆ బిల్లుల్లోనే కొన్ని హోటల్స్ 'మ్యాజిక్' చేస్తున్నాయని ఐటీ శాఖ కనిపెట్టింది. అదీ మామూలుగా కాదు, ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడి దేశవ్యాప్తంగా దాదాపు రూ. 70,000 కోట్ల ఆదాయాన్ని నొక్కేసినట్లు తేల్చింది. హైదరాబాద్ ఐటీ విభాగం చేపట్టిన ఈ ఆపరేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్ యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మన ప్లేటు మీది లాభాన్ని ఐటీ కన్ను ఎలా పట్టేసిందో ఇప్పుడు చూద్దాం..

60 TB డేటా.. ఏఐ పట్టిన గట్టి వేటు:

హైదరాబాద్ ఐటీ ఇన్వెస్టిగేషన్ యూనిట్ దేశవ్యాప్తంగా 1.7 లక్షల రెస్టారెంట్లు వాడుతున్న బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌పై గురి పెట్టింది. సుమారు 60 టెరాబైట్ల (TB) భారీ డేటాను ఏఐ మరియు బిగ్ డేటా అనలిటిక్స్ సాయంతో జల్లెడ పట్టారు. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి జరిగిన లావాదేవీలను పరిశీలిస్తే, మొత్తం రూ. 2.43 లక్షల కోట్ల బిల్లింగ్‌లో దాదాపు 70,000 కోట్ల రూపాయలు టర్నోవర్‌ను హోటల్స్ తక్కువ చేసి చూపాయని తేలింది. బిల్లులు వేసిన తర్వాత వాటిని సాఫ్ట్‌వేర్ నుంచి డిలీట్ చేయడం లేదా ఎడిట్ చేయడం ద్వారా ఈ భారీ స్కామ్‌కు పాల్పడ్డారు.

దక్షిణాది రాష్ట్రాలే టార్గెట్.. భారీగా డిలీషన్స్:

ఈ డేటా విశ్లేషణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. బిల్లులను డిలీట్ చేయడంలో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక కర్ణాటకలో అత్యధికంగా రూ.2,000 కోట్లు, తెలంగాణలో రూ. 1,500 కోట్లు, తమిళనాడులో రూ. 1,200 కోట్ల విలువైన బిల్లులను సిస్టమ్ నుండి మాయం చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే 3,734 పాన్ కార్డుల డేటాను పరిశీలించగా.. ఐటీ రిటర్న్స్‌లో చూపించిన దానికంటే రూ. 5,141 కోట్లు తక్కువ ఆదాయం చూపినట్లు ఏఐ స్పష్టంగా తేల్చి చెప్పింది.

చిక్కుల్లో హోటల్ యజమానులు.. తప్పవు కఠిన చర్యలు:

మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ ఈ ఎగవేత భారీగానే జరిగింది. ఇక బిల్లులు ఎడిట్ చేసి ఆర్డర్ సైజును తగ్గించడం ద్వారా టాక్స్ నుంచి తప్పించుకోవచ్చని హోటల్ యజమానులు భావించారు. కానీ, ఏఐ టెక్నాలజీ ప్రతి చిన్న మార్పును పసిగట్టేయడంతో ఇప్పుడు అందరూ చిక్కుల్లో పడ్డారు. త్వరలోనే ఈ అక్రమాలకు పాల్పడిన రెస్టారెంట్లకు ఐటీ నోటీసులు పంపే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో జరిమానాలతో పాటు కఠినమైన చర్యలు తప్పవని ఐటీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇకపై ఐటీ కన్ను తప్పించుకోవడం అంత సులువు కాదని ఈ ఘటన నిరూపించింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ దొంగలు కొత్త దారులు వెతుకుతుంటే, అదే టెక్నాలజీతో ఐటీ శాఖ వారిని పట్టుకుంటోంది. ₹70,000 కోట్ల ఈ భారీ స్కామ్ బయటపడటం అనేది దేశ ఆర్థిక వ్యవస్థలో స్పష్టతకు ముందడుగు.