ఓపెన్ ఏఐ సంచలన రిపోర్టు.. వారానికి నాలుగు రోజుల పని
కృత్రిమ మేధ ఎంట్రీతో ప్రపంచ గమనం పూర్తిగా మారిపోయింది. ఏఐ ఎంట్రీతో పెద్ద ఎత్తున ఉద్యోగాల్ని పోయేలా చేస్తుందన్న భయాందోళనలు పెద్ద ఎత్తున ఉన్నాయి.
By: Garuda Media | 9 April 2026 12:00 AM ISTకృత్రిమ మేధ ఎంట్రీతో ప్రపంచ గమనం పూర్తిగా మారిపోయింది. ఏఐ ఎంట్రీతో పెద్ద ఎత్తున ఉద్యోగాల్ని పోయేలా చేస్తుందన్న భయాందోళనలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే.. ఇలాంటి ఆందోళన అవసరం లేదంటూ ఒక ఆసక్తికర అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఏఐ కారణంగా వారంలో జరిగే పనిని రోజుల వ్యవధిలో పూర్తి చేస్తున్నప్పుడు.. అన్ని రోజులు పని చేయాల్సిన అవసరం ఏముంది?
అందుకే వారానికి నాలుగు రోజులు పని చేస్తే సరిపోతుందన్న ఆలోచనను తెర మీదకు తీసుకొచ్చారు. ఏ మాత్రం జీతం తగ్గకుండా.. పెరిగిన పని సామర్థ్యాన్ని ఉద్యోగులకు అదనపు సమయం రూపంలో ఇవ్వాలని చాట్ జీపీటీ క్రియేట్ చేసిన ఓఫెన్ ఏఐ ప్రభుత్వాలకు తన రిపోర్టులో పేర్కొంది. తాజాగా ఓపెన్ ఏఐ ప్రభుత్వాలకు పదమూడు పేజీల రిపోర్టును సిద్ధం చేసింది.ఇండస్ట్రియల్ పాలసీ ఫర్ ది ఇంటెలిజెన్స్ ఏజ్: ఐడియాస్ టు కీప్ పీపుల్ ఫస్ట్ పేరుతో అనేక ఆసక్తికర అంశాల్ని అందులో పేర్కొన్నారు.
ఏఐతో పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో.. ఆ లాభాల్ని సమాజం మొత్తానికి పంచాలని పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా 32 గంటలు.. నాలుగు రోజుల పని విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలన్న సూచన చేసింది. ఈ కారణంగా పని దినాలు తగ్గించినా ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి కోత విధించకూడదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పింది. గతంలో గంటల కొద్దీ జరిగే సమయాన్ని ఇప్పుడు నిమిషాల్లో పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ లెక్కన.. ఏఐ కారణంగా భవిష్యత్తులో నెలల తరబడి చేసే ప్రాజెక్టుల్ని కొత్త సాంకేతికతతో చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేసే వీలుందన్న విషయాన్ని ఓపెన్ ఏఐ అంచనా వేస్తోంది. ఇలా ఆదా అయిన సమయాన్ని.. పెరిగిన ఉత్పాదకతను అనుసరించి ఉద్యోగులకు బెనిఫిట్స్.. బోనస్ లు ఇవ్వాలని.. అదనపు పెయిడ్ లీవ్ లు మంజూరు చేయాలని ఓపెన్ ఏఐ కోరుతుందని చెబుతున్నారు. పని గంటల్ని తగ్గించటమే కాదు.. మరో ఆసక్తికర ప్రతిపాదనను చేసింది.
విధాన నిర్ణేతలు.. ఏఐ కంపెనీలు కలిసి పబ్లిక్ వెల్త్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని ఓపెన్ ఏఐ కీలక ప్రతిపాదన చేసింది. ఏఐ కారణంగా వచ్చే ఆర్థిక లాభాల్లో సామాన్యులకు వాటా దక్కేలా పబ్లిక్ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను షేర్ చేసింది. ఇందులో వచ్చే లాభాల్ని ప్రజలకు పంచటం ద్వారా ఆర్థిక అసమానతలు తొలగించొచ్చని పేర్కొంది. ఏఐ రాకతో పని విధానం పూర్తిగా మారుతుందన్న విషయాన్ని తాజా నివేదిక స్పష్టం చేసినట్లు చెప్పాలి.
