అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ ట్విస్ట్.. 11 ఏళ్లుగా కొనసాగుతున్న లోపాలు బయటకు!.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే, తాజాగా ఒక సంచలన విషయం బయటపడింది.
By: Madhu Reddy | 20 March 2026 1:57 PM ISTఅహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే, తాజాగా ఒక సంచలన విషయం బయటపడింది. ఆ విమానంలో గత 11 ఏళ్లుగా సాంకేతిక లోపాలు ఉన్నాయని అమెరికాకు చెందిన ఏవియేషన్ సేఫ్టీ ఫౌండేషన్ బాంబు పేల్చింది. ఎలక్ట్రికల్ సమస్యల నుంచి కంప్యూటర్ వైఫల్యాల వరకు ఎన్నో లోపాలు ఉన్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తోంది. అసలు మన ప్రాణాలకు గ్యారెంటీ ఏది? ఈ ట్విస్ట్‌తో విమానం ఎక్కాలంటేనే సామాన్యులకు భయం వేస్తోంది. ఆ వివరాలు చూద్దాం..
11 ఏళ్లుగా పొంచి ఉన్న మృత్యువు:
గత ఏడాది జూన్ 12న 260 మంది ప్రాణాలను బలిగొన్న ఆ విమానం అకస్మాత్తుగా ప్రమాదానికి గురికాలేదని, దాని వెనుక ఏళ్ల తరబడి నిర్లక్ష్యం ఉందని ఎఫ్‌ఏఎస్ (FAS) ఆరోపిస్తోంది. గత 11 ఏళ్లుగా ఆ విమానంలో తీవ్రమైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సమస్యలు ఉన్నాయట. పవర్ కంట్రోల్ యూనిట్ సరిగా పనిచేయకపోవడం, ఫ్లైట్ మేనేజ్‌మెంట్ కంప్యూటర్లు తరచూ విఫలం కావడం వంటి భయంకరమైన లోపాలను ఈ సంస్థ గుర్తించింది. ఇన్ని సమస్యలు ఉన్న విమానాన్ని ఇన్నేళ్లపాటు ఎలా నడిపించారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
అధికారుల మౌనం.. మరిన్ని అనుమానాలు:
ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న భారత ఏజెన్సీలు ఏఏఐబీ, ఎన్‌టీఎస్‌బీలపై ఎఫ్‌ఏఎస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. తాము సేకరించిన కీలక పత్రాలను వారికి పంపినప్పటికీ, వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఎఫ్‌ఏఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎడ్ పియర్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తాము ఇచ్చిన సమాచారాన్ని దర్యాప్తులో పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అని అడిగినా అధికారులు నోరు విప్పడం లేదట. ఈ మౌనం వెనుక ఏవైనా పెద్ద తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాణాలకు భరోసా ఏది?:
సాధారణంగా అత్యంత సురక్షితమైన ప్రయాణం అని భావించే విమాన ప్రయాణంలో ఇలాంటి లోపాలు బయటపడటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. విమానంలో ఉండాల్సిన కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ప్రయాణికుల ప్రాణాలకు గ్యారెంటీ ఏముంటుంది? విమానం ఎక్కే ప్రతిసారి ఏదో ఒక సాంకేతిక లోపం ఉంటుందేమోనన్న భయం ఇప్పుడు సామాన్యుడిని వెంటాడుతోంది. ఇక నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఒక్క చిన్న ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయినా గాలిలో ఉన్న విమానం సెకన్ల వ్యవధిలో కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది.
మళ్లీ దర్యాప్తు జరగాల్సిందే:
ఎఫ్‌ఏఎస్ చేసిన ఈ ఆరోపణల నేపథ్యంలో, అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్‌పై మరోసారి లోతైన దర్యాప్తు జరపాలని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. కేవలం పైలట్ తప్పిదమో లేక వాతావరణం సరిగ్గా లేకపోవడమో అని చెప్పి కేసు క్లోజ్ చేయకుండా, విమానంలో ఉన్న సాంకేతిక లోపాలపై పూర్తి స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. మళ్ళి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏవియేషన్ సంస్థలు పాత విమానాల విషయంలో మరియు సాంకేతిక తనిఖీల్లో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వందలాది కుటుంబాల్లో చీకటి నింపిన ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు రావాలి. సాంకేతిక లోపాలు ఉంటే వాటిని ముందే సరిదిద్దాలి తప్ప, ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.
