'ముక్కలు కాదు, పూర్తి మృతదేహం ఇప్పించండి'.. గుండెల్ని మెలిపెట్టే ఘటన!
అహ్మదాబాద్ జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సుమారు 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు వ్యాపించాయని అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 Jun 2025 6:20 PM ISTఅహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సుమారు 274 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ మృతదేహాలను అహ్మదాబాద్ లోని సివిల్ ఆస్పత్రిలో భద్రపరిచారు. రక్తసంబంధీకుల నుంచి డీ.ఎన్.ఏ. నమూనాలను సేకరించి, మృతదేహాల నమూనాలతో సరిపోల్చి, బంధువులకు అప్పగిస్తున్నారు. ఈ సమయంలో హాస్పటల్ వద్ద జరుగుతున్న ఘటనలు గుండెల్ని మెలిపెడుతోన్నాయి.
అవును... అహ్మదాబాద్ జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సుమారు 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు వ్యాపించాయని అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో శరీరాలన్నీ గుర్తుపట్టని రీతిలో సజీవ దహనమైపోయాయి. దీంతో ఆ మృతదేహాలను గుర్తించడం కష్టతరమవుతోంది. శరీరాలు ఛిద్రమైపోవడంతో ఆ మృతదేహాలు ఎవరివో తేల్చడం కత్తిమీద సాములా మారిందని అంటున్నారు.
మూడురోజుల్లో కేవలం 32 మంది మృతుల డీ.ఎన్.ఏ వారి కుటుంబసభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలగా.. వాటిలో 14 మృతదేహాలను మాత్రమే వారి కుటుంబసభ్యులకు అందజేశారు అంటే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్ధం చేసుకొవచ్చు. ప్రతి శరీరభాగానికి డీ.ఎన్.ఏ టెస్టులు చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం తీసుకుంటోంది. ఈ సమయలో ఊహించని సమస్యలు ఎదురవుతున్నాయి.
ఇందులో భాగంగా... డీ.ఎన్.ఏ టెస్టులో వారి కుటుంబ సభ్యుల జన్యువుతో పోలిన మాంసపు ముద్దలు దొరికినా వాటిని కుటుంబ సభ్యులకు ఇస్తున్నారు వైద్యులు. దీంతో.. అందుకు బంధువులు అంగీకరించలేకపోతున్నారు. రెండేసి, మూడేసి ముక్కలు కాకుండా పూర్తి మృతదేహాలను అప్పగిస్తే అంత్యక్రియలైనా గౌరవంగా నిర్వహించుకుంటామంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పైగా.. తాజాగా సివిల్ ఆస్పత్రి మార్చురీ వద్ద ఒక డెడ్ బాడీ బ్యాగులో రెండు తలలు ఉండటంతో మరింత కలకలం రేగింది. దీంతో.. వైద్యులు మరోసారి డీ.ఎన్.ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తన కుటుంబ సభ్యుల అవశేషాలన్న్నీ అప్పగించమని ఓ వ్యక్తి అధికారులను వేడుకుంటున్న తీరు అందరితోనూ కన్నీరు పెట్టిస్తోంది.
మరోవైపు డీ.ఎన్.ఏ పరీక్షతో పనిలేకుండానే 8 మృతదేహాలను బంధువులు గుర్తుపట్టారు. దీంతో.. వాటిని వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు వైద్యులు. ఈ నేపథ్యంలో వీలైనంత వేగంగా మృతదేహాల డీ.ఎన్.ఏలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికోసం 230 బృందాలను ఏర్పాటు చేసినట్లు వైద్యులు తెలిపారు!
